Sunday, April 28, 2024

ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి

- Advertisement -
- Advertisement -

ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న ముఖ్యమైన లక్ష్యాలను గత పదేళ్ళలో చాలా వరకు నెరవేర్చుకో గలిగింది. ముఖ్యంగా ఇటీవల అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తికావడంతో బిజెపి మంచి జోరుమీద ఉంది. ఇప్పటికే కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని బిజెపి ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది.ఈ ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్రను సృష్టించింది. ఈ చట్టం ద్వారా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ సమానులేనని రుజువు చేయడమే ఉమ్మడి పౌరస్కృతి లక్ష్యం అని ప్రకటించింది.

మానవ జీవన ప్రయాణంలో కుటుంబ జీవితం ఒక ప్రధాన ఘట్టం. దానిలో వివాహం, విడాకులు, దత్తత మొదలైన పౌరజీవితాన్ని ప్రభావితం చేసే వ్యవహారాలలో ఈ ఉమ్మడి పౌరస్మృతి అనే చట్టం కీలకం కానున్నది. ఇప్పటికే ఈ తరహా చట్టాన్ని అమలు చేసేందుకు అసోం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇవి అన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలే కావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బిజెపి ఆధీనం లో ఉంది కనుక దీనిని అమలు చేయడంలో పెద్దగా ఆటంకాలు అంటూ ఏమీ ఎదురుకావు. ఈ చట్టం ప్రకారం సహజీవనం సాగిస్తున్న జంటలుకూడా వెంటనే తమ బంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే నిబంధనను ఈచట్టంలో చేర్చారు. ఒకవేళ ఎవరైనా అలా చేయించుకోకపోతే వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. మూడు నెలలపాటు సహజీవనం చేసిన జంట తమ డిక్లరేషన్ తప్పక ఇవ్వాల్సిందే. లేకపోతే వారికి మూడు నెలలు జైలు శిక్షపడుతుంది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లులో గిరిజనులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ సహజీవనం చేసుకున్న వారికి పుట్టిన పిల్లలకు, వారి సంతనానికి సమాన హక్కులు ఉంటాయి. ఈ చట్టం ద్వారా మహిళలకు రక్షణ లభిస్తుంది. ఇంతకు ముందు ‘గోవా’ ప్రాంతం పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పుడు ఇలాంటి చట్టం అమలు లో ఉండేది.ఈ చట్టం అమలైతే బాల్యవివాహాలు రద్దు అవుతాయి. ఇప్పటికే అరేబియా, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మొదలైన దేశాల్లో కూడా ఇలాంటి చట్టం అమలులో ఉంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మహిళలకు పూర్తి భద్రత లభిస్తుంది. ముఖ్యంగా సహజీవనం పేరిట జరిగే మోసాలకు పరిష్కారం లభిస్తుంది. పాశ్చాత్య దేశాల ప్రభావంతో వివాహం కాకుండానే కొంతకాలం ఇష్టపూర్వకంగా సహజీవనం చేయడం కలతలు, విభేధాలు రాగానే వెంటనే విడిపోయి, ఎవరికి వారు స్వతంత్రంగా బతకటం మామూలైపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా నలిగిపోతున్నది మహిళలు వారికి కలిగిన సంతానం. సమాజపరంగా అనేక అవమానాలను వారు ఎదుర్కొంటున్నారు.

ఈ కష్టకాలంలో వారికి ఏ విధమైన చట్టపరమైన రక్షణ గానీ, తమ కుటుంబ బంధుమిత్రుల నుండి ఆదరణగానీ వారికి దొరకటం లేదు. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే మహిళలకు ఈ చట్టం రక్షణ కవచంలా పని చేస్తుంది. అలాగే ముస్లిం సమాజంలో ఉన్న మహిళలు ‘త్రిపుల్ తలాక్’తో అనేక వివక్షలను ఎదుర్కొంటున్నారు.అందువల్ల ‘త్రిపుల్ తలాక్’ చట్టం రద్దు చేయటం ద్వారా మహిళల పట్ల వివక్ష లేకుండాచేశారు. ముస్లిం సంప్రదాయంలో ఇది భాగమంటూ చాలా కాలం దీనిని ఇస్లాం మతపెద్దలు కొందరు, లౌకికవాదుల పేరిట కొందరు చాలా కాలం అడ్డుకున్నారు. అయితే, ఇది పూర్తిగా మతపరమైన సమస్య మాత్రమే కాదు మొత్తంగా ముస్లిం మహిళల అందరి సామాజిక సమస్య. ఇంతకాలం ఈ ‘త్రిపుల్ తలాక్’ అనేది పురుషులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండేది. ఎలాంటి లింగ వివక్షత ఉండరాదు అని ఇప్పటికే అనేక మహిళా సంక్షేమ సంఘాలు దశాబ్దాలుగా దేశవిదేశాలలో పోరాటాలు చేశారు.

అందుకే ముస్ల్లిం మహిళలకు రక్షణ కల్పంచే ఉద్దేశంతోనే ‘త్రిపుల్ తలాక్’ను రద్దు చేస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో స్పష్టం చేశారు. ‘ఉమ్మడి పౌర స్మృతి’ ని చాలా కాలం అనేక మంది అనేక కారణాలతో ఆచరణ సాధ్యం కాకుండా అడ్డుకున్నారు. ఇప్పటికీ కొంతమంది అడ్డుకుంటున్నారు కూడా. దీని వల్ల మహిళలు నష్టపోతున్నారు. సమాన అవకాశాలూ, హక్కులను కోల్పోతున్నారు. మహిళలకు ఉద్యోగాల్లో, విశ్వవిద్యాలయాలో, విద్యా సంస్థల్లో ఇప్పటికే సమాన అవకాశాలు లభిస్తున్నాయి. వీటిని ఇంకా విస్తృత పరిచేందుకు ‘ఉమ్మడి పౌరస్మృతి’ ఎంతో ఉపయోగపడుతుంది. ఉత్తరాఖండ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలకు వాగ్దానం చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ‘పుష్కర్ సింగ్ దామి’ ఈ బిల్లు అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా పి.దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ రెండేళ్ళు పాటు కసరత్తు చేసింది. సంబంధిత వర్గాలతో అనేక సార్లు చర్చల తర్వాత ఆ కమిటీ తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేసింది.

ఈ సిఫారసుల్లో కుల, మతాలతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ఒకే తరహా చట్టాలు వర్తిస్తాయి. ఆస్తి, వారసత్వ చట్టాల్లో కూడా సమానత్వ హక్కు ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఉత్తరాఖండ్‌లో బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకుని రావడం తో తమ పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే, దేశమంతటా ఇలాంటి చట్టాన్ని తీసుకు వస్తామని ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు ప్రజలకు వాగ్దానం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో తమ పార్టీకి దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ చేరుకోలేదు అనే భరోసాతో ఉన్నారు.

అందుకు తగినట్లుగానే ‘ఇండియా’ కూటమి కూడా బలహీనపడుతుంది. వారిలో ఐక్యత లోపించింది. ప్రజా సమస్యలపై ‘కామన్ ఎజెండా‘ను ఇంకా రూపొందించుకోలేదు. కీలక నేతలు యుద్ధానికి ముందే రణక్షేత్రం నుండి తప్పుకుంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటి లో లోక్ సభ ఎన్నికల లోపు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని తీసుకుని వచ్చేందుకు కమలనాథలు ఉత్సాహాతో ముందుకు సాగుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించటమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇతర రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని తెచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News