Sunday, April 28, 2024

తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు 

- Advertisement -
- Advertisement -

కంపెనీలతో మాట్లాడి ఉద్యోగులకు ఆరోగ్య భీమా,
పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు
జాబ్ సెక్యూరిటీని కల్పించేలా చూస్తాం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్,ఇతర ఆన్‌లైన్ సేవలకు
ప్రభుత్వమే స్వయంగా ఒక ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేయాలన్న గిగ్ వర్కర్ల ప్రతిపాదన

సానుకూలంగా స్పందించిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : స్విగ్గిస్ జొమాటో, ఒలా, ఉబర్, ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. వారు సేవలు అందిస్తున్న కంపెనీలతో మాట్లాడి ఈ ఉద్యోగులకు ఆరోగ్య భీమా, ప్రావిడెంట్ ఫండ్, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు జాబ్ సెక్యూరిటీని కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షలకు పైగా యువకులు ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారని కెటిఆర్ తెలిపారు.

ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమాన్ని చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికారంలోకి రాగానే ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు, గిగ్ వర్కర్ల ప్రతినిధులతో కలిపి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బోర్డులో ఒక లీగల్ సెల్ వ్యవస్థతోపాటు, ఈ యువకులకు కంపెనీల తరఫున ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న డెలివరీకి కొంత సొమ్ము అందుకుంటున్న పద్ధతితోపాటు వీరికి కనీస జీతాలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్
రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ ఉద్యోగాలు, ఇతర రంగాల్లో జరిగిన కంపెనీల విస్తరణ తర్వాత గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని కెటిఆర్ పేర్కొన్నారు. దీంతో ఎవరిపైన ఆధారకుండా గిగ్ వర్కర్లు సంపాదించుకోగలుగుతున్నారని వీరి సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.ఈ చర్చల సందర్భంగా తమకు ఎదురవుతున్న పలు ఇబ్బందులను గిగ్ వర్కర్లు కెటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. పలు కంపెనీలు తమకు అందించే ఫీజులను ఏమాత్రం పెంచడం లేదని, పైగా ఇన్సెంటివ్‌లను తీసివేశారని తెలిపారు. ఈ కంపెనీ ప్రతినిధులతో తాను స్వయంగా మాట్లాడి ఈ అంశంలో వీరికి సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటానని కెటిఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వమే స్వయంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్,ఇతర ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన ఒక ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు తెలిపిన ప్రతిపాదనపై కెటిఆర్ సానుకూలంగా స్పందించారు.

ఇప్పటికే ఇలాంటి ఒక వ్యవస్థ కేరళలో ప్రారంభమైందని, దానిపైన ఆధ్యాయనం చేసి మరింత మెరుగులు దిద్ది తెలంగాణలోని అమలు చేస్తామని తెలిపారు. గిగ్ వర్కర్ల సమస్యలపైన ప్రత్యేకంగా స్పందించి, సావధానంగా తమ సమస్యలు విని, తాము లేవనెత్తిన అంశాలను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించిన కెటిఆర్‌కు గిగ్ వర్కర్ల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. తమ సంక్షేమం పట్ల సానుకూలంగా స్పందించి తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన భారత రాష్ట్ర సమితికి ఈ ఎన్నికలు అండగా నిలబడతామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News