Sunday, April 28, 2024

స్టైలిష్ డైరెక్టర్‌తో రామ్ మూవీ?

- Advertisement -
- Advertisement -

Actor Ram Movie with Surender Reddy

 

‘అతనొక్కడే’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన సురేందర్ రెడ్డి తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరవాత ఎన్టీఆర్‌తో తీసిన ‘అశోక్’, సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో తీసిన ‘అతిథి’ సినిమాలు నిరాశపరిచాయి. అనంతరం రవితేజతో ‘కిక్’, రామ్‌చరణ్‌తో ‘ధృవ’, అల్లు అర్జున్‌తో ’రేసుగుర్రం’ లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ స్టైలిష్ డైరెక్టర్. ఈ క్రమంలో గతేడాది మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో సురేందర్ రెడ్డి ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ‘సైరా’ సినిమా వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా ఆయన ఇంకా కొత్త మూవీ ప్రకటించలేదు. అప్పట్లో నాగచైతన్య, అఖిల్, నితిన్, ప్రభాస్‌లతో సురేందర్ రెడ్డి కథా చర్చలు జరిపాడని వార్తలు వచ్చాయి. కానీ అవి చర్చలుగానే మిగిలిపోయాయి. ఇటీవల అల్లు అర్జున్‌తో సూరి నెక్స్ట్ సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి.

వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ‘రేసుగుర్రం’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ బన్నీ ప్రస్తుతం సుకుమార్‌తో ‘పుష్ప’, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత కొరటాల శివతో సినిమా ఉంటుందని సమాచారం. దీంతో బన్నీ, సూరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశాలు లేవు. ఇప్పుడు లేటెస్టుగా సురేందర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌తో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ ఫామ్‌లో ఉన్న రామ్ వెంటనే తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.

ఏప్రిల్ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా ‘రెడ్’ సినిమా తర్వాత రామ్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ రామ్‌కి నచ్చిందట. ‘రెడ్’ సినిమా రిలీజ్ అయిన వెంటనే సురేందర్ రెడ్డితో సినిమా ప్రారంభించాలని చేయాలని రామ్ భావిస్తున్నాడట. హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో సూరిని మించిన వారు లేరని ఇండస్ట్రీలో అంటుంటారు. ముందే స్టైలిష్‌గా ఉండే రామ్‌ని ఇంకెంత స్టైలిష్‌గా చూపిస్తాడో అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News