Friday, April 26, 2024

ఫేస్‌బుక్, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం

- Advertisement -
- Advertisement -
Agreement between Facebook and Australia
వార్తలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ఫేస్‌బుక్

మెల్బోర్న్: గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఫేస్‌బుక్‌కు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వీరి మధ్య సంధి కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజన్సీలకు చెందిన వార్తలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.త్వరలోనే తమ సైట్‌లో మళ్లీ వార్తలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. గూగుల్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వార్తలు షేర్ చేస్తున్నందుకుగాను వార్తాసంస్థలకు ఆ సంస్థలు డబ్బు చెల్లించాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు వార్తలు అందించడాన్ని తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని నిషేధించింది. ఫేస్‌బుక్ వార్తలను నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో భాగంగా ఆస్ట్రేలియా ఆర్థిక మంత్రి(ట్రెజరర్) జోష్ ఫ్రైడెక్‌బర్గ్, ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం మేరకు ఫేస్‌బుక్ కూడా న్యూస్ పేజిలపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చినందుకు సంతోషిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ తమకు మళ్లీ ఫ్రెండ్ అయిందని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ చెప్నారు. ఇదిలా ఉంటే గూగుల్‌మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియాలోని చిన్నచిన్న సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం న్యూస్ షోకేస్ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. వార్తాసంస్థలు పోస్టు చేసే వార్తలన్నీ ఇందులో కనిపించేలావిధానాలను రూపొందించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News