Sunday, April 28, 2024

కర్ణాటకలో ఆల్మట్టి ఫుల్..గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

వారం రోజుల్లో పూర్తి స్థాయికి తుంగభద్ర
తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ పరుగులు
50శాతం నిండిన శ్రీశైలం
గోదావరిలొ తగ్గిన వరద ప్రవాహం
భద్రాచలం వద్ద 20.30అడుగులకు నీటిమట్టం

హైదరాబాద్ : పడమటి కనుమల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణానది పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలో ఆల్మట్టి జలాశయంలో నీటినిలువ గరిష్ట స్థాయికి చేరి నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాలను దృష్టిలో పెట్టుకుని ఆల్మట్మి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ఆల్మట్టి ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటినిలువ సామర్ధం 129.72 టిఎంసీలు కాగా ,సోమవారం సాయంత్రానికి ఆల్మటి రిజర్వాయర్‌లో నీటి నిలువ 126.38 టిఎంసీలకు చేరుకుంది. ఇక కేవలం మూడు అడుగులు మాత్రమే కుషన్ ఉండటంతో ప్రాజెక్టు అధికారులు ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి ఆల్మట్టి ప్రాజక్టులోకి 70వేల క్యూసెక్కలు వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా రిజర్వాయర్ నుంచి బయటకు వదిలిపెడుతున్నారు. మరో వైపు కృష్ణనదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులో కూడా నీటి నిలువ గరిష్ట స్థాయికి చేరువవుతోంది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ సామర్దం 105టిఎంసీలు కాగా సోమవారం నాటికి నీటి నిలువ 86టిఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి తుంగభద్ర జలాశయంలోకి 8870 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరో వారం రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు కూడా గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా కర్ణాటకతోపాటు ఆంధప్రదేశ్‌లోని హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి కాలువల కింద ఆయకట్టుకు ఇప్పటికే సాగునీటి విడుదలను ప్రారంబించారు.
తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ పరుగులు
ఎగువన ఆల్మట్టి తోపాటు నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవటంతో కృష్ణమ్మ తెలుగురాష్ట్రాలవైపు పరుగులు పెడుతోంది. నారాయణపూర్ ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటినిలువ సామర్ధం 37.64టిఎంసీలు కాగా, ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 35.64టిఎంసీల నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి 70వేలక్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి బయటకు 63100క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన తెలుగు రాష్ట్రాల ముఖద్వారంగా ఉన్న జూరాల ప్రాజెక్టులోకి55వేల క్యూసెక్కలు నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు ఇప్పటికే గరిష్టస్థాయికి చేరువలో ఉంది. ఈ ప్రాజెక్టులో 9.66టిఎంసీల నీటినిలువ సామర్ధం ఉండగా, సోమవారం నాటికి 8.32టిఎంసీల నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి అనంతరం 37221క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
50శాతం నిండిని శ్రీశైలం
తెలంగాణ ఏపి ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు సోమవారం నాటికి 50శాతం నిండిపోయింది. ఈ ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటినిలువ సామర్ధం 215.81టిఎంసీలు కాగా, ఇప్పటికే నీటినిలువ 111.68టిఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 42129క్యూసెక్కుల నీరు చేరుతోంది. దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో గరిష్ట స్థాయి 312టిఎంసీలకు గాను 140టిఎంసీల నీరు నిలువ ఉంది.
గోదావరికి తగ్గిన వరద
గోదావరిలో వరద ప్రవాహం క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరాం సాగర్‌ప్రాజెక్టులోకి 5360క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టులో 90.300టిఎంసీల గరిష్ట స్థాయి నీటినిలువకుగాను 84.81టిఎంసీల నీరు నిలువ ఉంది. కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పూర్తిగా నిలిచి పోయింది. రిజర్వార్‌లో 7.600టిఎంసీల గరిష్ట స్థాయి నీటినిలువకుగాను 5.31టిఎంసీల నీరు నిలువ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 14151క్యూసెక్కుల నీరు చేరుతుండగా , 13,855క్యూసెక్కుల నీటిని బయటకు విడుదలు చేస్తున్నారు. ప్రాజెక్టులో 20.175టిఎంసీల గరిష్ట స్థాయి నీటినిలువకుగాను 19.26టిఎంసీలనీరు నిలువ ఉంది.
లక్ష్మి బ్యారేజ్‌కి 2,05,980క్యూసెక్కువ వరద
ప్రాణహిత నది ద్వారా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది . మేడిగడ్డ వద్ద లక్ష్మీబ్యారేజ్‌లోకి 2,05,980క్యూసెక్కల వరదనీరు చేరుతుండగా, వచ్చిన నీటిని వచ్చినట్టుగా బయటకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ లోకి 2,12,450క్యూసెక్కల నీరు చేరుతుండగా , వచ్చిన నీటని వచ్చినట్టుగా దిగువకు వదిలిపెడుతున్నారు. దుమ్మగూడెం సీతమ్మసాగర్ ప్రాజెక్టులోకి 1,85,397క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 20.30అడుగుల వద్ద నదిలో 1,85,397 క్యూసెక్కలు నీరు ప్రవహిస్తోంది.
నిలిచిపోయిన మంజీరా ప్రవాహం
ఎగువన వర్షాలు లేకపోవటంతో మంజీరా నదిలో నీటి ప్రవాహాలు నిలిచి పోయాయి. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి చిన్న ధారగా 505క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టులో నీటినిలవ 29.917టిఎంసీల గరిష్ట స్థాయికి గాను 27.64టిఎంసీల నీరు నిలువ ఉంది. నిజాంసాగర్‌లోకి ఎగవ నుంచి 1505క్యూసెక్కలు నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 17.80టిఎంసీల గరిష్ఠ స్థాయిలో నిండుకుండను తలపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News