Saturday, April 27, 2024

చంద్రుడి పైకి అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం !

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : దాదాపు 50 ఏళ్ల తర్వాత చందమామ పైకి ల్యాండర్ పంపాలని అమెరికా చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది. చంద్రుడిపై పెరిగ్రిన్ వ్యోమనౌకను దింపాలనుకున్న లక్షాన్ని విరమించుకుంటున్నట్టు పెరిగ్రిన్‌ను రూపొందించిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ మిషన్ లక్షాలను పునఃసమీక్షించే పనిలో నిమగ్నమైంది. సోమవారం ఫ్లోరిడా లోని కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వుల్కన్ రాకెట్ ద్వారా పెరిగ్రిన్‌ను గగనం లోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే.

ఏడు గంటల తరువాత ఈ వ్యోమనౌకలో ఇబ్బంది తలెత్తిందని గుర్తించారు. ల్యాండర్‌కు సంబంధించిన సౌరఫలకం సూర్యుడికి అభిముఖంగా లేదని, ప్రొపెల్లెంట్ కోల్పోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించారు. దీనివల్ల పెరిగ్రిన్ ఛార్జింగ్ కోసం అవసరమైన విద్యుత్ జరగడం లేదని చెప్పారు. బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించినా, ప్రొపెల్లెంట్ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరిచేయలేక పోయారు. పెరిగ్రిన్ దిశను సమయానుకూలంగా మార్చే యాటిట్యూట్ కంట్రోల్ సిస్టమ్ లోని థ్రస్టర్లు ఇంధన లీక్ కారణంగా నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని ఆస్ట్రోబోటిక్ ప్రకటించింది.

అవి గరిష్ఠంగా మరో 40 గంటలు మాత్రమే పనిచేస్తాయని, ఆ తర్వాత సూర్యుడికి అభిముఖంగా వ్యోమనౌక దిశను మార్చడం కుదరదని , దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందని ఆస్ట్రోబోటిక్ వివరించింది. ఆలోపే పెరిగ్రిన్‌ను చంద్రుడికి వీలైనంత దగ్గరగా తీసుకెళ్లడమే తమ ప్రస్తుత లక్షమని వెల్లడించింది. దీనిని బట్టి చంద్రుడి పైకి చేరుకోవాలన్న లక్షం దాదాపు విఫలమైనట్టే కనిపిస్తోంది. ఆరు అడుగుల ఎత్తున్న ఈ వ్యోమనౌకలో అనేక సైన్సు పరికరాలు ఉన్నాయి.

చంద్రునిపై నీటి తీరుతెన్నులను పరిశోధించే పెరిగ్రిన్ అయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్, ఎవరెస్ట్ పర్వతం నుంచి సేకరించిన రాతి తునక, చిన్న రోవర్లు, మెక్సికోకు చెందిన చక్రాల రోబోలు, వికీపీడియా ప్రతి, ఒక బిట్ కాయిన్, కొన్ని ఫోటోలు, డ్రాయింగ్, ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనెడీ, జార్జ్ వాషింగ్టన్, ఐసెనహోవర్, స్టార్‌ట్రెక్ టీవీ ధారావాహిక సృష్టికర్త జీన్ రాడన్‌బెర్రీ, ప్రముఖ సైన్స్ కాల్పనిక సాహిత్య రచయిత ఆర్థర్ సి క్లార్క్‌కు సంబంధించిన అవశేషాలు, డీఎన్‌ఏ నూ ఈ వ్యోమనౌక మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ అభివృద్ధి కోసం ఆస్ట్రోబోటిక్ సంస్థతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 108 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News