Wednesday, May 22, 2024

ఆన్‌లైన్ యాప్‌లపై దాడులు.. బెంగళూరులో మరో ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ యాప్‌లపై సిసిఎస్ దాడులు
బెంగళూరులో మరో ముగ్గురు అరెస్ట్
అవగాహన కోసం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

Another 3 Arrested in Online Loan Apps Fraud

మనతెలంగాణ/హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్ యాప్ కేస్ లో బెంగుళూర్ లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దాడులు జరిపి మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో బెంగుళూర్ లో రెండు కాల్ సెంటర్ ల పై హైదరాబద్ పోలీసులు మెరుపు దాడులు చేసి సుమారు 350 మంది టెలి కాలర్ లు ఈ రెండు కాల్ సెంటర్ లలో పని చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు కేంద్రంగా 42 లోన్ యాప్ లను నడిపిస్తున్న 4 మైక్రోఫైనాన్స్ సంస్థలపై కేసులు నమోదు చేశారు. కాగా ఆన్‌లైన్ యాప్ రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు హైదరాబాద్ లో 27 కేసులు నమోద చేశామని, ఈ నేపథ్యంలో సింగపూర్, చైనాలోకి కీలక నిందితులకు చెందిన 350 అకౌంట్ ల నుండి డబ్బు జమ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆర్.బి.ఐ లో రిజిస్టర్ కాని అక్రమ యాప్ ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనతికాలంలో ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేపడతామని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ఇదిలావుండగా ఆర్‌బిఐ నుంచి అనుమతి లేకుండానే లీఫంగ్, పిన్ ప్రింట్, నబులోం, హాట్ ఫుల్ టెక్నాలజీస్ మొత్తం 42 యాప్ లను ఆ సంస్థలు నడిపిస్తున్నాయని, తెలంగాణలో ఆత్మ హత్యకు పాల్పడ్డ వ్యక్తులు ఈ యాప్ లో లోన్ తీసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

అయితే ప్రజలెవరూ ఆర్‌బిఐ అనుమతిలేని సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో గాని లేదా ఏవిధమైన బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని పోలీసులు వివరిస్తున్నారు. ఆర్.బి.ఐ చట్టం 1934 లోని సెక్షన్ 45-1ఎ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని, ఆర్.బి.ఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని పోలీసులు పేర్కొంటు న్నారు. ఆన్‌లైన్‌లో రుణ సదుపాయం కల్పించే యాప్ లలో అధికశాతం ఆర్.బి.ఐ లో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారంలేదని తేల్చిచెబుతున్నారు. ఈ యాప్ లలో అధికంగా చైనీస్ వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నెంబర్ గాని ఇతర వివరాలు ఉండవని తెలిపారు.

ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్ లు మోసపూరితమైనవని, ఆర్.బి.ఐ గుర్తింపులేని ఈ యాప్ ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు. ఈ యాప్ ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సి రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణవలయంలో చిక్కుకోకతప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రుణాలను చెల్లించలేని స్థితిలోఉంటే క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని రుణం అందించే యాప్ లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొంటున్నారు. ఆర్.బి.ఐ లో రిజిస్టర్ కాని, అక్రమ యాప్ ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేపడతామని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.

Another 3 Arrested in Online Loan Apps Fraud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News