Sunday, April 28, 2024

ఎపిలో మండలి రద్దు నిర్ణయం వెనక్కి

- Advertisement -
- Advertisement -

AP Assembly approves withdrawal of council dissolution decision

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం నాడు వెనక్కి తీసుకుంది. ఈక్రమంలో కౌన్సిల్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే తీర్మానాన్ని ఎపి అసెంబ్లీ ఆమోదించింది. కౌన్సిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలంటూ 22 నెలలుగా కేంద్రానికి వివిధ సందర్భాల్లో వివరించినా ఫలితం లేకపోవడంతో పాటు అంశాన్ని చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టిందని అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. దీనిపై సభ్యుల్లో సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని విరమించుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సందిగ్ధత ఉండేదని, ఏదో రకంగా అసెంబ్లీ నిర్ణయాలను అడ్డుకోవాలని ఇన్నాళ్లు చూశారని వ్యాఖ్యానించారు. 2020 జనవరి 27న శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. దీంతో గత కొంతకాలంగా కౌన్సిల్‌లో సందిగ్ధత కొనసాగిందని, మంగళవారం నాడు మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ అమోదం తెలిపిందన్నారు.

రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో శాసన మండలిని ఏర్పాటు చేశారని, అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో శాసన మండలిని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. తిరిగి 2006లో శాసన మండలిని మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకోబడిన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువ సభకు సూచనలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు శాసన మండలిని రద్దు చేయగా మరికొన్ని రాష్ట్రాల్లో అసలు ఏర్పాటే చేయలేదని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. కొన్ని కీలక అంశాల్లో సందిగ్ధతకు కారణమవుతున్నందున రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త సభ్యులు మండలిలోకి వచ్చినట్లు తెలిపారు. కొత్త సభ్యుల రాకతో శాసనమండలి ఇకపై అసెంబ్లీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందనే భావనతో గతంలో రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి బుగ్గన సభకు తెలిపారు.

ఓ వైపు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో వెనక్కి తీసుకోగా మరోవైపు కొత్తగా ఎంపికైన ఎంఎల్‌సిలు మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సిలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్న గోవిందరెడ్డి, ఇసాక్ బాషా, పాలవలస విక్రాంత్‌లతో ఎపి శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణాలు చేయించారు. కొత్త సభ్యుల రాకతో మండలిలో అధికార వైసీపీ బలం 21కి పెరిగింది.మరోవైపు ఎపి అసెంబ్లీలో 151 మందితో తిరుగులేని బలమున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు మొన్నటిదాకా మండలిలో చిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగా మరో 11 మంది ఎంఎల్‌సిలు స్థానిక సంస్థల కోటా నుంచి, అదికూడా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచే సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయా జిల్లాల నుంచి స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఇప్పటికే నామినేషన్లు వేయడం తెలిసిందే. స్థానిక ఎంఎల్‌సిలను కలుపుకొంటే, ఈ నెలాఖరులోగా మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 32కు పెరగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News