Sunday, April 28, 2024

దా’రుణాల’ కేసులో అరెస్టులు..

- Advertisement -
- Advertisement -

Arrest of online Loan Accused

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ల అరెస్టు
ధనా ధన్, క్యాష్ మామా, లోన్ జోన్ యాప్‌ల ద్వారా లోన్లు
70వేల మంది బాధితులు
రూ.1.52కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు
ఏడు రోజుల్లో తిరిగి చెల్లించాలి
35 శాతం వడ్డీ వసూలు చేస్తున్న నిందితులు
కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నిందితులు
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

మనతెలంగాణ, హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, మూడు డెస్క్‌టాప్‌లు, 22 మొబైల్ ఫోన్లు, 18 బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.52 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. కోకాపేటకు చెందిన కొనాటహం శరత్ చంద్రా ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ, డైరెక్టర్‌గా, పుష్పలత ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉంది. క్రెడ్‌ఫాక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ వాసవ చైతన్య, సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేష్ కలెక్షన్ ఏజెంట్, సచిన్ దేశ్‌ముఖ్ కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. గచ్చిబౌలికి చెందిన సయిద్ ఆశిక్ టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చేందుకు సంస్థ డైరెక్టర్లు యాప్‌లను తయారు చేయించారు.

క్యాష్ మామా, ధనాధన్ యాప్‌లను తయారు చేసి గూగుల్ ప్లేస్టోర్‌లో జనవరి 8వ తేదీ,2020లో పెట్టారు. దాని ఆధారంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ తదితరాలను తీసుకుని రుణాలు ఇస్తున్నారు. రుణం కావాల్సిన వారు రూ.5,000 తీసుకుంటే ఏడు రోజుల్లో చెల్లించాలి, రుణం ఇచ్చే ముందు రూ.1,180ని ప్రాసెసింగ్, జిఎస్‌టి తదితరాల పేరు చెప్పి ముందే తీసుకుంటారు. మిగతా డబ్బులను బాధితుల బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. బాధితులు డబ్బులు కట్టకుంటే వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి ఫోన్లు చేసి వేధించడం ప్రారంభిస్తున్నారు. లేకుంటే వేరే యాప్‌లలో రుణం తీసుకుని చెల్లించమని సూచిస్తున్నారు. ఈ విధంగా హే ఫిష్, మంకీ క్యాష్, క్యాష్ ఎలిఫెంట్, లోన్ జోన్, క్యాష్ జోన్, వాటర్ ఎలిఫెంట్, మీరా లోన్ తదితర వాటిలో తీసుకుని రుణం కట్టమని చెబుతున్నారు. వారి మాటలు నమ్మిన బాధితులు వాటి నుంచి రుణం తీసుకుని వీరికి కడుతున్నారు.

అయితే ఆ యాప్‌లు కూడా వీరివేకావడంతో బాధితులు అప్పుల్లో కూరుకుపోతున్నారు.వీరి మాటలు నమ్మిన ఓ బాధితుడు రూ.30,000 తీసుకుంటే చేతికి వచ్చింది రూ.20,000మాత్రమే చెల్లించాల్సింది మాత్రం రూ.30,000 ఇంత చెల్లించినా కూడా లోన్ మాత్రం పూర్తిగా తేరడం లేదు. దీంతో డైరెక్టర్లు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి బాధితులకు ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 110మందితో రెండు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వారు రుణం తీసుకున్న వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి రుణం తీసుకున్న వారు కట్టకుంటే మీరే ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే 35శాతం వడ్డీ తీసుకుంటున్నారు. రుణాలు తీసుకున్న వారిని బకెట్ల వారీగా విభజించి వడ్డీ తీసుకుంటున్నారు. రుణం కట్టడం ఆలస్యం చేస్తే భారీగా వడ్డీ తీసుకుంటున్నారు. రుణం తీర్చాల్సిన గడువు ముగిసిన వెంటనే వీరి వేధింపులు మొదలవుతున్నాయి. అసభ్యంగా తిట్టడం ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం, బంధువులకు ఫోన్లు చేసి పరువుతీస్తున్నారు.

కాల్ సెంటర్‌పై దాడి….

ఆన్‌లైన్ రుణాలు తీసుకున్న వారిపై వేధింపులు ఎక్కువ కావడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బాధితులు వరుస కట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బయోడైవర్సిటీ వద్ద ఉన్న ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ కాల్ సెంటర్‌పై దాడి చేశారు. దీని యజమానిగా శరత్‌చంద్రా ఉన్నారు. రెండు కార్యాలయాలను ఏర్పాటు చేసిన శరత్ చంద్రా 110మంది ఉద్యోగులను నియమించారు. దాడి చేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సొంతంగా యాప్‌ల తయారీ….

ప్రధాన నిందితులు ఆన్‌లైన్ రుణాల కోసం యాప్‌లను తయారు చేయించారు. క్యాష్ మామా, లోన్ జోన్, ధనాధన్ లోన్, క్యాష్ అప్, క్యాష్ బస్, మేరా లోన్, క్యాష్ జోన్ తయారు చేయించారు. క్యాష్ బస్, క్యాష్ అప్ యాప్‌లను ఎసియా ఇన్నో నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ వారికి విక్రయించారు. మేరాలోన్, క్యాష్ జోన్‌ను బ్లూ షీల్డ్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరుకు విక్రయించారు. వీరు మాత్రం క్యాష్ మామా, ధనాధన్ లోన్, లోన్ జోన్ యాప్‌లను నిర్వహిస్తున్నారు. వీరికి దేశవ్యాప్తంగా 1.5లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 70,000 మంది ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. యాప్‌ల యజమానులు ఢిల్లీ కేంద్రంగా ఉన్న తొమ్మిది ఎన్‌బిఎఫ్‌సిలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.

యాప్‌లకు ఎలాంటి అనుమతి లేదుః విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

ప్లేస్టోర్స్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేదని, ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషర్ విసి సజ్జనార్ తెలిపారు. ఎవరికీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ క్రెడెన్షీయల్స్ ఇవ్వవద్దని కోరారు. రుణాలు ఇస్తామని ఆశ చూపే కంపెనీల లైసెన్స్‌లు చూసిన తర్వాతే రుణం తీసుకోవాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News