Sunday, April 28, 2024

కోహ్లి నిర్ణయంతో సంబంధంలేదు

- Advertisement -
- Advertisement -

Arun Dumal remarks on Kohli T20 captancy

బిసిసిఐ కోశాధికారి అరుణ్ దుమాల్

ముంబై: ప్రపంచకప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనతో బిసిసిఐకి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని తాము ఎప్పుడూ కూడా కోహ్లిపై ఒత్తిడి తేలేదన్నారు. ఈ విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కోహ్లి వంటి దిగ్గజాన్ని అవమానించడం తమ అభిమతం కాదన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టును గెలుపు బాటలో నడిపించిన ఘనత కోహ్లికి ఉందన్నారు. ఫార్మాట్ ఏదైనా జట్టును ముందుండి నడిపించడంలో విరాట్‌కు ఎవరూ సాటిరారన్నాడు.

అలాంటి కెప్టెన్‌ను తప్పించాలని బిసిసిఐ ఎందుకు కోరుకుంటుందని ఎదురు ప్రశ్నించారు. ఇక కోహ్లిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని జట్టులోని కొంత మంది సీనియర్లు బిసిసిఐపై ఒత్తిడి తెచ్చారని జాతీయ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు. కోహ్లికి బిసిసిఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని అతని నిర్ణయాల్లో ఎప్పుడూ కూడా బిసిసిఐ జోక్యం చేసుకోలేదన్నారు. ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్నది పూర్తిగా కోహ్లి వ్యక్తిగత నిర్ణయమన్నారు. దీనిలో తాము ఎలాంటి జోస్యం చేసుకోలేదన్నారు. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని దుమాల్ అభిప్రాయపడ్డారు.

అరుదైన క్రికెటర్..

ఇక టీమిండియాకు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లి ఒకడని ఆయన ప్రశంసించారు. ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లిని మించిన ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదన్నారు. మూడు ఫార్మాట్‌లలోనూ అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన ఘనత కోహ్లికి ఉందన్నారు. మరి కొన్నేళ్ల పాటు అతను టీమిండియాలో కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా బ్యాట్స్‌మన్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌లో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతాడనే నమ్మకం తనకుందన్నారు. ఇక వచ్చే వరల్డ్‌కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా నియమించడం తనను ఆనందం కలిగించిందని దుమాల్ అన్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్‌లలో ధోని ఒకడిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ధోని సారథ్యంలో భారత్ రెండు ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచిన విషయాన్ని మరువకూడదన్నారు. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌లో ధోని సేవలు అందుబాటులో ఉంటే జట్టుకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నారు. యువ ఆటగాళ్లకు సరైన మార్గనిర్దేశం చేస్తూ జట్టును గెలుపు బాటలో నడిపించే సత్తా ధోనికి ఉందన్నారు. కెప్టెన్ కోహ్లితో పాటు ఇతర సీనియర్లతో, యువ క్రికెటర్లతో ధోనికి మంచి అవగాహన ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమన్నారు. ఇక వరల్డ్‌కప్‌లో టీమిండియా ట్రోఫీని సాధిస్తుందనే నమ్మకాన్ని దుమాల్ వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News