దుబాయి: వరుస విజయాలతో ఇప్పటికే ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా శుక్రవారం శ్రీలంకతో జరిగే సూపర్4 చివరి మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను ఫైనల్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసుకు దూరమైంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో లంక టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలనే లక్షంతో లంక ఉంది. అయితే అసాధారణ ఆటతో ఆసియాకప్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న టీమిండియాను ఆపడం లంకకు శక్తికి మించిన పనిగానే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జోరుమీదున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోతున్నాడు.
ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. శుభ్‌మన్ గిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు జట్టుకు కీలకంగా మారారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా సూర్య తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. తిలక్‌వర్మ, హార్దిక్, సంజు శాంసన్, అక్షర్ పటేల్ తదితరులతో టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, కుల్దీప్,అక్షర్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లంక కూడా చివరి మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. కానీ కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. దీన్ని సరిదిద్దుకుంటేనే లంకకు గెలుపు అవకాశాలు ఉంటాయి.