Tuesday, April 30, 2024

అఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

- Advertisement -
- Advertisement -
At least 100 dead in suicide blast at Afghanistan
కుంద్‌జ్‌లోని మసీదులో భారీ పేలుళ్లు
100మంది మృతి, పలువురికి గాయాలు
మసీదులో చెల్లాచెదురుగా మృతదేహాలు
షియాలు లక్షంగా ఐఎస్ ఖొరాసాన్..?

కాబూల్: అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో వణికిపోయింది. ఉత్తర అఫ్ఘానిస్థాన్ కుంద్‌జ్ నగరంలోని షియా ముస్లింల మసీదులో జరిగిన బాంబు పేలుళ్లలో 100మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం గోజర్‌ఇసయ్యద్‌అబాద్ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్ల ఘటన జరిగింది. పేలుళ్లకు సంబంధించి భారీ శబ్దాలను విన్నామని స్థానికులు తెలిపారు. పేలుళ్ల ధాటికి ప్రార్థనలో పాల్గొన్నవారి శవాలు మసీదులో చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రంగా గాయపడినవారి రోదనలతో ఆ ప్రాంతం బీతావహంగా మారిపోయింది. క్షతగాత్రుల్ని బటయటకు తీసుకువస్తున్న దృశ్యాల్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఆత్మాహుతి దాడి అని కుంద్‌జ్ రాష్ట్ర పోలీస్ డిప్యూటీ చీఫ్ దోస్త్ మహ్మద్ ఒబాయిడా అన్నారు. ప్రార్థనలు జరుపుతున్నవారిలో కలిసిపోయిన సూసైడ్ బాంబర్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆయన అన్నారు. షియా ముస్లింల రక్షణకు తాలిబన్ల ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటపై దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.

అఫ్ఘన్‌ను ఆగస్టు చివరన అమెరికా, నాటో దళాలు వీడిన తర్వాత అక్కడ జరిగిన అతిపెద్ద హింసాత్మక ఘటన ఇది. ఆగస్టు 26న కాబూల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 169మంది అఫ్ఘన్లు, 13మంది అమెరికా సైనికులు మృతి చెందారు. ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం ఇదే మొదటిసారి. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్(ఖొరాసాన్)పైనే తాజా దాడి విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారికంగా ఆ సంస్థ నుంచి ఇంకా ప్రకటన రాలేదు. అయితే, ఐఎస్ ఇప్పటికే అఫ్ఘన్‌లోని షియా ముస్లింలపై యుద్ధం ప్రకటించి పలు దాడులు జరిపింది.

కాబూల్‌తోపాటు హెరాత్ రాష్ట్రంలోని షియా ముస్లింల మసీదులపై ఐఎస్ దాడులు జరిపింది. తాజా దాడి జరిగిన కుంద్‌జ్ రాష్ట్ర జనాభా దాదాపు 10 లక్షలు కాగా, అందులో హజారాలనే షియాలు 6 శాతం వరకూ ఉంటారు. ఆ రాష్ట్రంలో ఉజ్బెక్ జాతికి చెందినవారు అధిక సంఖ్యలోఉన్నారు. ఐఎస్‌లో చేరేవారిలోనూ వీరే అధికం. ఉజ్బెకిస్థాన్‌లోని ఐఎస్ ఉగ్రవాద సంస్థతో ఖొరాసాన్‌కు లింకులున్నాయి. అఫ్ఘన్‌లో తాలిబన్లతోనూ ఐఎస్ ఆధిపత్యపోరుకు తలపడుతోంది. తాలిబన్ల సాయుధ బలగాలపైనా ఐఎస్ కొన్ని దాడులు నిర్వహించింది. ఇటీవల కాబూల్‌లోని ఓ మసీదులో తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిత్ తన తల్లి స్మారకం నిర్వహిస్తుండగా ఆత్మాహుతి దాడికి ఐఎస్ పాల్పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News