Friday, May 3, 2024

ఎటిఎం అటెన్షన్ డైవర్ట్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

ATM attention divert gang arrested

రూ.2.5లక్షల నగదు, 115 ఎటిఎం కార్డులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఆసిఫ్‌నగర్ ఎసిపి శివమారుతి

మనతెలంగాణ, హైదరాబాద్ : ఎటిఎం సెంటర్ల వద్ద వృద్ధులను దృష్టి మరల్చి డబ్బులు దోచుకుంటున్న బీహార్‌కు చెందిన ముఠాను ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రూ.2,50,000 నగదు, 115 ఎటిఎం కార్డులు, స్వైపింగ్ మిషన్, మూడు ఫేవికాల్ బాటిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎసిపి శివమారుతి శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం, గయా జిల్లా, డుమ్రీ గ్రామానికి చెందిన అటౌలా ఖాన్ అలియాస్ ఆటా అలియాస్ డానిష్ వ్యాపారం చేస్తున్నాడు, ఫతేపూర్, ఏకాంబ, ధనేటాకు చెందిన సురేంద్ర కుమార్ అలియాస్ మంటు సింగ్ కూలీ పనిచేస్తున్నాడు, బిర్రూ పాండే పరారీలో ఉన్నాడు. వివిధ బ్యాంక్‌లకు చెందిన ఎటిఎం కార్డులను నిందితులు తీసుకుని నగరానికి వచ్చారు. సికింద్రాబాద్‌లోని రాహుల్ ఇంర్నేషనల్ హోటల్‌లో బసచేశారు.

నగరంలోని వారికి అనుకూలంగా ఉన్న ఎటిఎంలను ఎంపిక చేసుకుని కార్డులకు ఫేవికాల్ గ్లూ రాసి ఇన్‌సర్ట్ చేసేవారు. దీంతో ఎటిఎం మిషన్ ఐదు లావాదేవీల వరకు పనిచేయడం మానివేస్తుంది. ఈ సమయంలోనే నిందితులు ఎటిఎంల సమీపంలో ఉండేవారు. డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్నారు. ఎటిఎంల నుంచి డబ్బులు తీసేందుకు వచ్చి అవి రాకపోయేసరికి వీరి సాయం అడగడంతో వృద్ధుల ఎటిఎం కార్డు తీసుకుని సాయం చేస్తున్నట్లు నటిస్తున్నారు. వృద్ధుల ఒరిజినల్ కార్డు తీసుకుని వారి వద్ద ఉన్న నకిలీ కార్డులను వృద్ధులకు ఇస్తున్నారు. తర్వాత వృద్ధుల ఎటిఎం కార్డుల నుంచి నగదు డ్రా చేసి మోసం చేస్తున్నారు. వీరిపై ఆసిఫ్‌నగర్, హుమాయున్ నగర్, సైఫాబాద్, సుల్తాన్‌బజార్, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితులు నేరాలు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమయం చూసి ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, డిఐ నాగేశ్వర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస తేజ నిందితులను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News