Wednesday, May 1, 2024

కాబూల్‌లో జర్నలిస్టుపై తాలిబన్ల దాడి

- Advertisement -
- Advertisement -
Attack on Afghan journalist in kabul
కాబూల్ చౌరస్తాలో తాలిబన్ల విలనీజం

కాబూల్: కల్లోల, అరాచకాల అఫ్ఘనిస్థాన్‌లో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులూ బాధితులు అవుతున్నారు. కాబూల్ నగరంలో వార్తా సేకరణలో ఉన్న టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ యాద్, ఆయన వెంట ఉన్న ఫోటోగ్రాఫర్ బెయిస్ మజిదీని అటకాయించి తాలిబన్లు తుపాకుమడమలతో, ఇతర మారణాయుధాలతో తీవ్రంగా కొట్టారు. కారణం ఏమిటనేది తాలిబన్లు తెలియచేయలేదని టోలో న్యూస్ ఆ తరువాత తెలిపింది. కాబూల్‌లో అస్తవ్యవస్థ పరిస్థితుల నడుమ పేద రోజువారి కూలీల దుస్థితిపై వార్తా సేకరణకు ఈ ఇద్దరూ స్థానిక హాజీ యాకూబ్ స్కేర్ వద్దకు వెళ్లారు.

పనులు దొరకక విలవిల్లాడుతున్న కూలీల ఫోటోలు తీసుకుంటుండగా, వారి బాధలను తెలుసుకుని రికార్డు చేసుకుంటూ ఉండగా వారిపై తాలిబన్లు దాడికి దిగారు. తాను వార్తను పంపిస్తుండగా తాలిబన్లు దాడి చేశారని, ఫోటోగ్రాఫర్‌పై దౌర్జన్యం జరిపి కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు తీసుకువెళ్లారని, తన వ్యక్తిగత మొబైల్ ఫోన్ కూడా కాజేశారని యాద్ ఆ తరువాత ట్వీటు వెలువరించారు. కూలీల పడిగాపుల దృశ్యాల చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. దాడిలో తాను చనిపోయినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని యాద్ తెలిపారు. తాలిబన్లు ఉన్నట్లుండి దాడికి దిగారని, ఎందుకు ఈ విధంగా చేశారో తెలియదని తాను అక్కడున్న తాలిబన్ల నేతలకు విషయం చెప్పానని అయితే వారు పట్టించుకోలేదని, ఇంతవరకూ దాడికి దిగిన వారిని అరెస్టు చేయలేదని యాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాలిబన్లు ఆయుధ భరిత శకటంలో సంచరిస్తూ తమను చూడగానే దిగివచ్చిచేతిలో గన్‌తో బెదిరిస్తూ చంపేస్తామని బెదిరిస్తూ కొట్టారని తెలిపారు. అక్కడ మీడియా స్వేచ్ఛ, భావ వ్యక్తీకణ అవకాశం లేకుండా పోవడం బాధాకరమైన విషయం అని ఈ జర్నలిస్టు స్పందించారు. కాబూల్‌లోని హాజీ యాకూబ్ చౌరస్తా రోజువారి అడ్డకూలీలతో సందడిగా ఉంటుంది. ఇప్పుడు నగరంలో నెలకొన్న పరిస్థితితో కూలీలకు పని దొరకని స్థితి ఏర్పడింది. దీనితో పస్తులు ఉంటున్నారు. ఈ అంశంపై వార్తా కథనాన్ని పంపించేందుకు ఈ జర్నలిస్టు యత్నించారు. టోలో న్యూస్ రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌పై తాలిబన్ల దాడిపై పలువురు జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల పట్ల ఇటువంటి దురుసు ప్రవర్తన తగదని ప్రకటన వెలువరించారని టోలోన్యూస్ వార్త వెలువరించింది. తాలిబన్ల దాడిలో ఈ జర్నలిస్టు ఆ తరువాత చనిపోయినట్లు పలు టీవీ ఛానల్స్‌లో వార్తలు వెలువడ్డాయి. ఇవి నిజం కావని యాద్ వివరణ ఇచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News