Thursday, May 2, 2024

బంగ్లాదేశ్ కుర్రాళ్ల ‘అతి’!

- Advertisement -
- Advertisement -

Bangladesh

 

వాళ్ల సంబరాలు శ్రుతి మించాయి: ప్రియమ్ గార్గ్ n క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్ సారథి

పోచెమ్‌స్ట్రూమ్: వివాదాస్పద సంబరాలతో విమర్శలపాలయిన బంగ్లాదేశ్ సీనియర్ జట్టు బాటలోనే ఆ దేశ యువ క్రికెట్ జట్టు కూడా పయనిస్తోంది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో విజయం తర్వాత హద్దులు దాటి మరీ సంబరాలు చేసుకుంది. భారత ఆటగాళ్ల వద్దకు వచ్చి దాదాపు గొడవకు దిగినంత చేసింది. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరు సర్వత్రా విమర్శలకు గురయింది. విజయానంతరం బంగ్లాదేశ్ క్రికెటర్లు శ్రుతి మించి ప్రవర్తించారని, చెత్తగా సంబరాలు చేసుకున్నారని భారత జట్టు సారథి ప్రియమ్ గార్గ్ అన్నాడు. ‘మేం సాధారణంగానే ఉన్నాం. మ్యాచ్‌లో గెలుపు ఓటములు సహజం.ఆటలో భాగమనే భావించాం. అయితే వారి గెలుపు సంబరాలు చెత్తగా ఉన్నాయి. అలా జరగకూడదు’ అని అన్నాడు. భారత ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటినుంచీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు నోటికి పని చెప్పారు. భారత బ్యాట్స్‌మెన్‌ను అదేపనిగా కవ్వించారు. పేసర్ షొరిపుల్ ఇస్లామ్ అయితే ప్రతి బంతికీ తిడుతూ కనిపించాడు.

అయితే విజయానంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను చూస్తూ వెకిలిగా సంజ్ఞలు చేశారు. అంతేకాకుండా భారత కుర్రాళ్ల దగ్గరికి వచ్చి హేళన చేశారు. దీంతో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు ఆటగాళ్లు కొట్టుకోబోయారు. దీంతో అంపైర్లు , సహాయక సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరుకు ఆ జట్టు కెప్టెన్ అక్బర్ క్షమాపణలు చెప్పాడు.‘ ఇలా జరగడం దురదృష్టకరం.మా బౌలర్లు కొందరు ఎక్కువగా ఉద్వేగానికి గురయ్యారు.అత్యుత్సాహం చూపారు.

అయితే వారు గతంలో జరిగిన ఆసియాకప్‌కు ప్రతీకారంగా దీన్ని భావించారు. అందులో మేం ఫైనల్లో ఓటమిని చవిచూశాం. ఇప్పుడు విజయం సాధించే సరికి అలా ప్రవర్తించారు. ఏది ఏమయినప్పటికీ జంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్‌లో ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వాలి. ఇలా జరగకూడదు.మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నాడు. ఈ సంఘటనపై భారత జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. దీనిలో భారత కుర్రాళ్ల తప్పు ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. కాగా ఈ సంఘటనను ఐసిసి కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కి సంబంధించి చివరి కొద్ది నిమిషాల వీడియో దృశాలను సమీక్షించాలని ఐసిసి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Bangladesh team with controversial festivities
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News