Monday, April 29, 2024

పరువు కోసం భారత్… పట్టు కోసం కివీస్

- Advertisement -
- Advertisement -

 India vs New Zealand

 

నేడే చివరి వన్డే మ్యాచ్

మౌంట్ మాంగనూయి: వారం రోజుల్లోనే పరిస్థితి తారుమారయింది. వరస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీ సేన ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. తిరుగులేదనుకున్నఆ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో వన్డే సిరీస్‌లో 0- 2 తేడాతో వెనకబడి నిరాశపరిచింది. మంగళవారం ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గాయం కారణంగా కెప్టెన్ విలియమ్సన్ సేవలు లేకపోయినా కివీస్ జట్టు టి20పరాజయ భారంనుంచి బైటపడి వన్డే సిరీస్‌లో విజయ దుందుభి మోగించింది.

ఇక చివరి వన్డేకు విలియమ్సన్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులో చేరుతుండడంతో ఆ జట్టు ఆత్మ విశ్వాసం మరింత ఇనుమడించింది. ఈ రెండు జట్లు మధ్య ప్రధాన తేడా టాప్ ఆర్డర్ ప్రభావమేననిపిస్తోంది. టీమిండియాలో రోహిత్ శర్మ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏడాదికాలంగా అతను తిరుగులేని ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు శిఖర్ ధావన్ కూడా లేడు. కీపింగ్ చేస్తున్న కారణంగా కెఎల్ రాహుల్ అయిదో స్థానంలోకి వెళ్లాడు. కొత్త ఓపెనర్తు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందిస్తున్నా వ్యక్తిగత మెరుపులు కరువైనాయి. దీంతో పరుగుల భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే పడింది. కివీస్ బౌలర్లు అతడు ఎక్కువ పరుగులు చేయనీయకుండా అడ్డుకోవడంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

వెలవెలపోతున్న బౌలింగ్, ఫీల్డింగ్
మరో వైపు టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ వెలవెలపోతున్నాయి.తీరిక లేని షెడ్యూల్‌తో ప్రాక్టీస్‌కు సమయం దొరకడం లేదని చెబుతున్నా క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తి లయను అందుకోలేదు.గాయపడ్డ తర్వాత అతడి బౌలింగ్‌లో మునుపటి పదును లేదు. అతడి బంతులను కివీస్ బ్యాట్స్‌మెన్ సునాయాసంగా ఆడేస్తున్నారు. బంతితో పాటు బ్యాటుతోను ఆకట్టుకున్న నవ్‌దీప్ సైనీకి తిరులేదు.కుల్దీప్ బౌలింగ్‌తో పాటుగా ఫీల్డింగ్‌లోను నిరాశపరుస్తున్నాడు.

దీంతో చివరి మ్యాచ్‌లో అతడికి స్థానం దక్కడం అనుమానమే.భీకరంగా విజృంభిస్తున్న రాస్ టేలర్‌ను అడ్డుకోవడంపైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. తొలి పది ఓవర్లలో మన వాళ్లు వికెట్లు తీయలేకపోతున్నారనడానికి గత రెండు మ్యాచ్‌లే నిదర్శనం. కాగా చివరి మ్యాచ్‌లో షాకు బదులు రాహుల్‌తో ఓపెనింగ్ చేయించి రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి.అద్భుతంగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ టేలర్‌లాగా చివరిదాకా కొసాగాల్సిన అవసరం ఉంది. రెండో వన్డేలో లోయర్ ఆర్డర్ రాణించడం సానుకూల అంశం.

విజయోత్సాహంతో కివీస్
మరో వైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు పూరిత ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి టి20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. కెప్టెన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి రావడం అదనపు బలం. ఓపెనర్లు గఫ్తిల్, నికోల్స్‌లు శుభారంభాలను ఇస్తున్నారు. టిమ్ సౌథీ, మిచెల్ శాంటర్న్‌లు కడుపు కొప్పితో బాధపడుతున్నారు.స్కాట్ కుగెలీన్‌కు వైరల్‌జ్వరం. మ్యాచ్ సమయానికి వీరు కోలుకుంటారని జట్టు ఆశిస్తోంది. ముందు జాగ్రత్తగా స్పిన్నర్ ఇష్ సోథి,పేసర్ బ్లెయిర్ టిక్నెర్‌ను పిలిపించింది.

టామ్ లేథమ్,జిమ్మీ నీషమ్‌లు కూడా ఫామ్‌లో ఉన్నారు. టీమిండియాతో పోలిస్తే ఆ జట్టుకు సమస్యలు తక్కువే. కాగా మౌంట్ మాంగనూయిలో పరుగుల వరద ఖాయమేనంటున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వారం రోజుల క్రితం ఇక్కడే చివరి టి20 మ్యాచ్ గెలిచి టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 2019లోను ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌లలోను కోహ్లీ సేన విజయం సాధించింది. అప్పుడు వన్డే సిరీస్‌ను గెలుచుకున్న జట్టు టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు ఇక్కడ పది వన్డే మ్యాచ్‌లు జరగ్గా తొలుత బ్యాట్ చేసిన జట్టు అయిదు సార్లు గెలుపొందగా ఛేదించినవి అయిదు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్ రోజు ఏ జట్టు అన్ని రంగాల్లో రాణిస్తుందో ఆ జట్టుదే గెలుపు అవుతుంది.

ఇరు జట్లు
భారత్: విరాట్ కోహీ ్ల(కెప్టెన్), పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, మహమద్ షమీ, బుమ్రా, శార్దూల్ ఢాకూర్, నవ్‌దీప్ సైనీ.

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్) టామ్ లేథమ్, మార్టిన్ గప్తిల్ ,రాస్ టేలర్, గ్రాంట్‌హోమ్,జిమ్మీ నీషమ్, స్కాట్ కుగెలీన్, టామ్ బ్లండెన్, హెన్రీ నికోల్స్, మిచెల్ శాంట్నర్, హమీష్ బెన్నెట్, టిమ్ సౌథి, జేమిసన్, ఇష్ సోథి, బ్లెయిర్ టిక్నర్.

3rd Odi between India vs New Zealand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News