Thursday, May 2, 2024

ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. ప్రపంచకప్ తర్వాత అంతటి ఆదరణ కలిగిన టోర్నీ ఏదైనా ఉందంటే అది ఐపిఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఏడాది జరిగే కాసుల క్రికెట్‌పై కరోనా పంజా విసిరింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఐపిఎల్‌ను నిర్వహించడం తమ వల్ల కాదని తేల్చి చెప్పేశాయి. ఇక, మహారాష్ట్ర ప్రభుత్వం అయితే టికెట్ల అమ్మకంపై ఏకంగా నిషేధం విధించింది. మరోవైపు విదేశాంగ శాఖ కూడా ఐపిఎల్‌లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లకు వీసాలు మంజూరు చేయడంపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్ కొనసాగడం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, దీనిపై శనివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శనివారం కేంద్ర ప్రభుత్వం, బిసిసిఐ ప్రతినిధుల మధ్య జరిగే భేటిలో ఐపిఎల్ భవితవ్యం తేలనుంది. పరిస్థితులు గమనిస్తే మాత్రం ఐపిఎల్ యథావిథిగా సాగడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.

మరోవైపు టోక్యో వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు షెడ్యూల్ ప్రకారమే సాగుతాయని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాధి భయపెట్టిస్తున్నా ఒలింపిక్స్ క్రీడలను యథావిథిగా నిర్వహిస్తామని టోక్యో గవర్నర్ ఒక ప్రకటనలో తేల్చి చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్రీడల ప్రారంభం నాటికి మాములు పరిస్థితులు నెలకొంటాయనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

BCCI to meet central govt on Saturday over IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News