Sunday, December 15, 2024

పండగ వాతావరణంలో ప్రజా పాలన విజయోత్సవాలు

- Advertisement -
- Advertisement -

ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు గడప గడపకు చేరేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి
ప్రజా పాలన విజయోత్సవాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి
అన్ని శాఖల అధికారులు ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు జరపాలి
ఈనెల 30న మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం సభ
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో కార్నివాల్, లేజర్ షో
రాష్ట్రస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సమావేశానికి హాజరైన మంత్రులు ఉత్తమ్ , పొంగులేటి, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో చేపట్టిన విప్లవాత్మక పధకాల అమలు, కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి గడప గడపకు చెరవేసేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ- సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడంతో ప్రజా విజయోత్సవాలు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్.బీ స్టేడియంలో పాఠశాల విద్యార్థుల దినోత్సవం, వరంగల్‌లో మహిళా దినోత్సవం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, ఈనెల 30 న మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు వివరించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో కన్నుల పండగగా కార్నివాల్, లేజర్ షో, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మూడు రోజుల ఉత్సవాల్లో మహిళలు, పిల్లలు, పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నాయని, ప్రతి గ్రామ స్థాయి నుండి, మండలాలు, జిల్లా స్థాయి వరకు ఈ ప్రజా విజయోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.

ప్రతి శాఖలో ఈ సంవత్సర కాలంలో అమలు చేసిన పధకాలు, కార్యక్రమాలపై అంతర్గతంగా వేడుకలు నిర్వహించుకోవాలని డిప్యూటీ సి.ఎం ఆదేశించారు. ఈ సంవత్సర కాలంలో చేపట్టిన విజయాలను ప్రతి వ్యక్తికీ చేరవేసేలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సాధించిన విజయాలను సక్సెస్ స్టోరీలను తమ వెబ్ సైట్‌లో సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 లక్షల స్వయం సహాయక మహిళలకు సున్నా వడ్డీ పధకం, బ్యాంకు లింకేజీలు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ తదితర మహిళా సాధికారత పధకాల వివరాలన్నీ వారికి చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగులు, షార్ట్ ఫిలింలు, తదితర ప్రచార అంశాలను హోర్డింగులు, ప్రకటనలు, సోషల్ మీడియాలా ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 25 వేల ఆర్టీసీ బస్సుల పై ఈ హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ గ్యారంటీలలో భాగంగా అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లేక్ గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ కవరేజీ పెంపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ సంస్థల ఏర్పాటు తదితర పథకాలపై పాఠశాల విద్యార్థులు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఈ ప్రజా విజయోత్సవాలు పురస్కరించుకుని రాష్ట్రంలో నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం, 200 విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం, 9007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయడం, ఆరు ప్రధాన పాలసీలను ముఖ్యమంత్రిచే ప్రారంభించుకోవడం తదితర కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఈ ప్రజా విజయోత్సవాల నిర్వహణపై వివిధ శాఖల కార్యదర్శుల సలహాలు, సూచనలను డిప్యూటీ సిఎం స్వీకరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, శ్రీధర్, క్రిస్టినా జోంగ్టు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, హైదరాబాద్, సైబరాబాద్ నగర పోలీస్ కమీషనర్లు సీ.వీ ఆనంద్, మొహంతి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హరీష్, ఫైర్ సర్వీసుల డీజీ నాగి రెడ్డి, సిఎంఓ అధికారులు షా నవాజ్ కాసీం, మాణిక్ రాజ్, శ్రీనివాసులు, శ్రీరామ్ కర్రి వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News