కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌కు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాలలో ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా లేదా బర్డ్‌ఫ్లూ ప్రబలినట్లు తేలిందని కేంద్రం బుధవారం ప్రకటించింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని 12 ప్రాంతాలలో ఈ వ్యాధి పక్షులలో ప్రబలినట్లు కేంద్రం తెలిపింది. ఈ వైరస్ పౌల్ట్రీ బాతులకు, కాకులకు, ఇతర వలస పక్షులకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచనలు పంపినట్లు కేంద్రం తెలిపింది. పక్షులలో అసాధారణ మరణాలు ఏవైనా సంభవించిన పక్షంలో అప్రమత్తంగా ఉండాలని ఇతర రాష్ట్రాలను కూడా హెచ్చరించినట్లు కేంద్ర మత్స, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో బర్డ్‌ఫ్లూ లేదని 2020 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్ది నెలల్లోనే ఈ ఇన్ఫెక్షన్ మళ్లీ ప్రబలినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో మొదటిసారి 2006లో బర్డ్‌ఫ్లూను గుర్తించడం జరిగింది. ఐసిఎఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఎడికు పంపిన నమూనాలు పాజిటివ్‌గా తేలడంతో నాలుగు రాష్ట్రాల్లోని 12 చోట్ల ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందని కేంద్రం తెలిపింది.
రాజస్థాన్‌లోని బరాన్, కోట, ఝలావర్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సోర్, ఇండో, మాల్వా ప్రాంతాలలో కాకులకు ఈ ఇన్ఫెక్షన్ సోకింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ప్రాంతంలో వలస పక్షులలో బర్డ్‌ఫ్లూను గుర్తించారు. కేరళలోని కొట్టాయం, అలప్పుళ(4 ప్రాంతాలు)లో పౌల్ట్రీ బాతులలో ఈ ఇన్ఫెక్షన్ కనిపించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, రోజువారీ పద్ధతిలో వ్యాధి నియంత్రణ చర్యలను సమీక్షించడానికి న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్‌ను నెలకొల్పినట్లు కేంద్రం వివరించింది. సాధారణంగా సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఫిబ్రవరి-మార్చి వరకు దేశంలోకి ప్రవేశించే వలస పక్షుల ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తుందని కేంద్రం తెలిపింది. కాగా..ఇన్ఫెక్షన్‌కు గురైన పక్షులను తాకడం వల్ల మానవులకు ఇది వ్యాపించే అవకాశం లేకపోలేదని కేంద్రం పేర్కొంది. విషపూరితమైన పౌల్ట్రీ పక్షులను తినడం ద్వారా ఇది మానవులకు వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ప్రత్యక్ష ఆధారాలు ఏవీ లేవని కూడా కేంద్రం పేర్కొంది.