Friday, May 3, 2024

యుపి, కర్నాటక స్థానిక ఓటు

- Advertisement -
- Advertisement -

BJP defeat in UP Karnataka local body elections

పశ్చిమానికి చేరుకున్న పొద్దు వాలిపోయినట్టే ప్రజాభిమానం కోల్పోయే రాజకీయ పార్టీ కళావిహీనం కాక తప్పదు. ఓటు ఆయుధం గల జన బాహుళ్యానికి సంతృప్తికరమైన పరిపాలన అందించినంత వరకే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షానికైనా నూకలు లభించేది. ఇటీవలి కర్నాటక మునిసిపల్ (పట్టణ స్థానిక సంస్థలు) ఎన్నికల్లో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పంచాయతీ రాజ్ సంస్థల బ్యాలట్ సమరంలో భారతీయ జనతా పార్టీ చవిచూసిన ఓటమి దాని పతనావస్థకు తిరుగులేని సంకేతమని గట్టిగా చెప్పలేముగాని దేశంలో రాజకీయ గాలి దానికి ఎదురుగా వీయ డం ప్రారంభమైందనే సూచనలు, చిహ్నాలు ఇందులో కనిపిస్తున్నాయని మాత్రం అంగీకరించక తప్పదు. కర్నాటకలో పది పట్టణ స్థానిక పాలక సంస్థలకు గత నెల 27న ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏడింటిని కాంగ్రెస్, రెండింటిని జెడి(ఎస్) గెలుచుకోగా, పాలక బిజెపి ఒకే ఒక్క స్థానం గెలుపుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ గెలుపొందిన వాటిలో భారతీయ జనతా పార్టీకి కంచుకోటలైన బళ్లారి, తీర్థహళ్లి కూడా ఉన్నాయి. మంత్రి బి శ్రీరాములు బంధువు ఫకీరప్ప కుమార్తె ఉమాదేవి, బిజెపి ఎంఎల్‌ఎ సోమశేఖర్ రెడ్డి కొడుకు శ్రవణ్ కుమార్ కూడా బళ్లారి బరిలో ఓడిపోయారు. బీదర్‌లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.

మొత్తం 10 మునిసిపాలిటీల్లోని 266 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌కి 119, జెడి(ఎస్)కి 67, బిజెపికి 54 వచ్చాయి. 2018 మే వరకు ఐదేళ్ల పాటు కర్నాటకను పాలించిన కాంగ్రెస్ అప్పుడు జరిగిన ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. బిజెపి అతి పెద్ద పార్టీగా వచ్చింది. గవర్నర్ సహకారంతో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు కూడా అధికారంలో నిలదొక్కుకోలేకపోయారు. శాసన సభ వేదిక మీద బల నిరూపణకు తగిన సంఖ్యా బలాన్ని సమకూర్చుకోలేక ఆ ఘట్టానికి ముందే మూడు రోజులకే రాజీనామా చేసి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. కాంగ్రెస్, జెడి(ఎస్)ల ఉమ్మడి బలం బిజెపి కంటే ఎక్కువ కావడంతో ఆ రెండు పార్టీలు సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అలా ఏడాదికి పైగా గడిచిన తర్వాత 2019 జులైలో జెడి(ఎస్), కాంగ్రెస్‌ల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా బిజెపి పైచేయి సాధించుకోడంతో ఆ రెండు పార్టీల ప్రభుత్వం కూలిపోయి యెడ్యూరప్ప సారథ్యంలో కమలనాథుల పాలన నెలకొన్నది.

యెడ్యూరప్ప ప్రభుత్వానికి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. ఆయన పాలనా వైఫల్యాల వల్ల బిజెపి కర్నాటకలో క్షీణ దశకు చేరిందనే అభిప్రాయానికి ఈ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అవకాశమిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సహజంగానే పలుకుబడి, ప్రాబల్యాలుండే బిజెపి కర్నాటక మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోడం ఒక ఎత్తైతే దేశమంతటా ఎదురు దెబ్బలు తింటున్న కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా బలం పుంజుకోడం మరొక ఎత్తు. కొవిడ్ సెకండ్ వేవ్ కోరల నుంచి కర్నాటక ప్రజలను కాపాడడంలో యెడ్యూరప్ప ప్రభుత్వం విఫలమైనందువల్లనే పట్టణ ఎన్నికల్లో పరాజయం పాలైనట్టు స్పష్టపడుతున్నది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సొంత జిల్లాలోని భద్రావతి, తీర్థ హళ్లి స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకోడం గమనార్హం. తాజాగా ఉత్తరప్రదేశ్ పంచాయతీ రాజ్ సంస్థ ఎన్నికల్లోనూ బిజెపి నిలబెట్టిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఓటమి పాలయ్యారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగా జరగవు. కాని ఈసారి జరిగిన యుపి పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ 3050 వార్డులకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. అందులో 900 వార్డులను మాత్రమే గెలుచుకున్నానని ఆ పార్టీయే వెల్లడించింది. అంటే 2000లకు పైగా వార్డుల్లో బిజెపి అభ్యర్థులు ఓడిపోయినట్టు రూఢి అవుతున్నది. వెయ్యి స్థానాలను గెలుచుకున్నట్టు సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి) ప్రకటించగా, 300 స్థానాలు సాధించుకున్నట్టు బిఎస్‌పి, చెరి 70 సీట్లలో గెలుపొందినట్టు కాంగ్రెస్, ఆప్‌లు చెప్పుకున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ఉత్తరప్రదేశ్‌లోనూ బీభత్సం సృష్టిస్తున్నది. ప్రజలను ఆదుకోడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమవుతున్నది.

దేశంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేట్ శక్తులు బలోపేతం కాడానికి, వ్యవసాయ రంగం మీద కూడా వారి గుత్తాధిపత్యం నెలకొనడానికి దోహదం చేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని ఘోరంగా నిర్లక్షం చేస్తున్నదనే నగ్న సత్యం కొవిడ్ అకాల మరణాల పరంపరలో ప్రజల కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల అభిమానాన్ని త్వరితగతిన కోల్పోతున్నదనుకోడానికి ఉత్తరప్రదేశ్, కర్నాటక స్థానిక ఎన్నికల ఫలితాలు తోడ్పడుతున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులు ఇకనైనా ప్రజాభీష్టాన్ని సరిగ్గా తెలుసుకొని నడుచుకుంటారని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News