Thursday, May 16, 2024

పార్లమెంటులో ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

BJP demands resignation of Deshmukh, CM Thackeray

 

దేశ్‌ముఖ్, సిఎం థాక్రే రాజీనామాకు బిజెపి డిమాండ్
ఎదురు దాడి చేసిన శివసేన, ఎన్‌సిపి

న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల అంశం సోమవారం పార్లమెంటును కూడా కుదిపేసింది. ఉభయ సభల్లోను అధికార బిజెపి సభ్యులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయాలని, ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తమ అవినీతి బైటపడుతుందన్న భయంతోనే దేశ్‌ముఖ్‌ను కాపాడడానికి యత్నిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ తొలుత ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పలువురు బిజెపి సభ్యులు నిరసనకు దిగారు. తమ సీట్లలోంచి లేచి నినాదాలు చేశారు. అయితే బిజెపి సభ్యుల ఆరోపణలపై శివసేన సభ్యులు కూడా అదే తీరులో ఎదురుదాడి చేశారు. అందరికన్నా ఎక్కువ అవినీతికి పాల్పడిన వారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు.

ఎన్‌సిపి సభ్యులు కూడా దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నినాదాలు చేశారు. దీనితో సభలో కొంత గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభలోను పలువురు బిజెపి ఎంపిలు జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈశాన్య ముంబయి బిజెపి ఎంపి మనోజ్ కోటక్ మాట్లాడుతూ ఒక్క ముంబయిలోనే వంద కోట్లు వసూలుకు ఆదేశిస్తే రాష్ట్రంలోని ఇతర నగరాలనుంచి ఎంత సేకరిస్తున్నారు? అని అంటూ దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటుగా పలువురు బిజెపి ఎంపిలు సైతం ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అయితే శివసేన సభ్యులు ఈ ఆరోపణలను ఖండిస్తూ బిజెపిపై ఎదురు దాడి చేశారు. బిజెపి సభ్యుల ఆరోపణలపై స్పందించడానికి తమకు అవకాశమివ్వనందుకు శివసేన, ఎన్‌సిపి సభ్యులు సభనుంచి వాకౌట్ కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News