Tuesday, June 11, 2024

వినోదానికి విరామం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ప్రేక్షకులు రాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ప్రేక్షకులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్, ఎ న్నికలు, మండుతున్న ఎండల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్స్‌కి రావటం లేదు. పెద్ద సినిమాలు గేమ్ ఛేంజర్, దేవర, కల్కి, ఓజి, పుష్ప 2… ఇలా అన్నీ సెట్స్‌పైనే ఉన్నాయి. పెద్ద సినిమాలు లేకపోవడం, చిన్న సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడంతో తెలంగాణ ధియేటర్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని శుక్రవారం నుంచి పది రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ “సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ప్రస్తుతం సరిగ్గా నడవటం లేదు. సినిమా వేస్తే రూ.6,000 నష్టం వస్తోంది, వేయకపోతే రూ.4,000 నష్టంతో సరిపెట్టవచ్చు. అందుకని సింగిల్ స్క్రీన్ థియేటర్లను శుక్రవారం నుంచి పది రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నాము”అని అన్నారు. అయితే సింగిల్ థియేటర్స్‌లో మాత్రమే కాదు, మల్టిప్లెక్స్ కు కూడా ప్రేక్షకులు అంతగా రావటం లేదు. ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ వంకా మాట్లాడుతూ “ప్రస్తుతం మంచి సినిమాలు లేకపోవటం వలన ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం లేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ప్రేక్షకులు కొంతమంది వచ్చినా, వాళ్ళ కోసం ఏసి నడపాల్సి వస్తోంది.దీంతో కరెంట్ బిల్లులు చాలా ఎక్కువగా వస్తుండటంతో తట్టుకోలేక కొన్ని రోజులపాటు థియేటర్స్ మూసి ఉంచాలని నిర్ణయించాం’‘అని తెలిపారు.

అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి…
తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉన్నట్లుండి శుక్రవారం నుంచి పది రోజుల పాటు ధియేటర్స్‌ను మూసివేసేందుకు నిర్ణయించడం షాక్‌కు గురిచేసిందని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ “థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు ఆ అసోసియేషన్ వారు చెబుతున్నారు. జూన్ 27వ తేదీన కల్కీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాల రిలీజ్‌లే ఉన్నాయి. నేను అడిగేది ఒక్కటే…మీరేలా ఒక్కరే నిర్ణయం తీసుకుంటారు. నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా.అలాగే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వంటి వాటితో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News