Sunday, April 28, 2024

ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!

- Advertisement -
- Advertisement -

BJP Huge Win in Assembly Elections 2022

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు ఎంతో ఊరట కలిగించినట్లు తెలుస్తున్నది. బిజెపికి నాలుగు రాష్ట్రాలలో తన ప్రభుత్వాలను నిలబెట్టుకో గలిగినా, దిమ్మతిరిగే తీర్పును ప్రజలు ఇచ్చారని చెప్పక తప్పదు. ప్రధాని చెప్పినట్లు సుపరిపాలనకు, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారు అనుకొంటే ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీ ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రులతో సహా కీలక నేతలు ఎందుకు ఓటమి చెందారు? ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అందరూ పంజాబ్‌లో అద్భుతంగా ప్రచారం చేసినా ఘోర పరాజయం ఎందుకు ఎదురైనది?
అందుకనే ప్రజల తీర్పు విలక్షణమైనది అని చెప్పక తప్పదు. ఒక విధంగా బిజెపి పాలన ఘనత కన్నా ప్రతిపక్షాల వైఫల్యం ఎక్కువగా కనిపిస్తుంది. గత ఎన్నికలలో అధికారంలోకి రాకపోయినా, ఐదేళ్లుగా పట్టు విడవకుండా పంజాబ్ పై అరవింద్ కేజ్రీవాల్ దృష్టి సారించిన ఫలితంగా ఆ రాష్ట్రంలో అనూహ్య విజయం లభించింది. మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడా ప్రతిపక్షాలు అంత ఎన్నికల ముందు తప్ప అంతకు ముందు పెద్దగా కనబడలేదు. ఉత్తరప్రదేశ్ సంగతే చూడండి. 60 శాతంకన్నా ఓటింగ్ నమోదు అయినది అంతే ప్రజలు అంత ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేదని స్పష్టం అవుతుంది. బిజెపికి కేవలం 40 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం ఓటర్లలో 25 నుండి 26 శాతం మాత్రమే ఆ పార్టీకి ఓటు వేశారని విశ్లేషకులు బరున్ మిత్రా భావిస్తున్నారు. ప్రతిపక్షాలు అనుకొంటున్నట్లు హిందువులంతా ఆ పార్టీకి ఓటు వేసారని అనుకొంటే జనాభాలో 80 శాతంగా ఉన్న హిందువులలో మూడింట ఒక వంతు మాత్రమే వేసిన్నట్లు భావించవలసి వస్తుందని కూడా ఆయన చెప్పారు. పైగా, 40 శాతం మంది హిందువులు అసలు ఓటు వేయలేదు. మరో 30 శాతం మంది బిజెపికి ఓటు వేయడం పట్ల ఆసక్తి చూపలేదు.
ఇక ప్రధాని చెబుతున్నట్లు ‘డబల్ ఇంజిన్’ సంక్షేమ పథకాలు, నగదు బదిలీ వంటి వాటి లబ్ధిదారులు కృతజ్ఞతతో అధికార పక్షానికి ఓటు వేశారు అనుకొంటే వారిలో అసలు ఓటు వేసినవారు 30 నుండి 40 శాతంగా కనిపిస్తున్నది. పేదలు ఎక్కువగా ఉన్న తూర్పు యుపిలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. అంటే పథకాల లబ్ధిదారులు మూకుమ్మడిగా అధికార పక్షంపై ఓటు వేశారనడంలో వాస్తవం లేదని చెప్పవల్సిందే. హిందీ ప్రాంతాలలో నేడు రాజకీయ ప్రభంజనంగా భావిస్తున్న హిందుత్వ, మోడీ ఆకర్షణలకు పరిమితులను ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయని బరున్ మిత్రా భావిస్తున్నారు. బిజెపి వాటిని మించి ముందుకెడితే గాని తన ఓటు ప్రాతిపదికను పెంచుకోలేదని వెల్లడి అవుతుంది. అదే విధంగా సిఎఎ వ్యతిరేక, రైతు ఆందోళనలకు సహితం పరిమితులున్నాయి. ఈ ఉద్యమాల ప్రభావం ఉన్న ప్రాంతాలలో బిజెపి ఖచ్చితంగా దెబ్బతిన్నది.
రైతు ఉద్యమంలో ‘మిలిటెంట్’ పాత్ర పోషించిన పంజాబ్ లో బిజెపి ఘోర ఓటమిని చవిచూసిందని, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతు ఉద్యమం కేంద్రీకృతమైన చెరకు రైతులు, జాట్లు అత్యధికంగా ఉన్న ముజఫర్ నగర్, శామ్లీ, భాగపాట్, మీరట్ జిల్లాల్లో 19 శాసనసభ స్థానాలుంటే ఆరింటిలో మాత్రమే బిజెపి గెలిచిందని రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ గుర్తు చేస్తున్నారు. వాటిలో కూడా మూడు ఉద్యమ ప్రభావం లేని పశ్చిమ మీరట్, మీరట్ కంటోన్మెంట్, ముజఫర్ నగర్ అంటే, పట్టణ ప్రాంతాల్లోని స్థానాలు కావడం గమనార్హం. భారత దేశంలో రాజకీయాలకు నిజమైన ప్రత్యామ్నాయ విధానానికి ఓ ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి. అయితే రాజకీయాలు గాని, ప్రజాజీవనం గాని పూర్తి సమయం పని చేస్తేనే ప్రజల దృష్టి ఆకట్టుకోగలం. కానీ ఎన్నికల ముందు వస్తే ప్రజల మద్దతు పొందడం కష్టం అనే హెచ్చరికను సహితం ఈ ఎన్నికలు ఇస్తున్నాయి.
తప్పనిసరిగా అధికారంలోకి వస్తానని అంచనా వేసుకొని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిరాశ చెందిన్నట్లున్నారు. ఫలితాల తర్వాత బైటకు రావడంలేదు. అయితే ప్రజలు ఏమి చూసి ఆయనను అధికారంలోకి తీసుకు రావాలని లక్ష్మీనారాయణ ప్రశ్నిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ ఐదేళ్లుపాటు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. రైతాంగ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవలేదు, కనీసం పాల్గొనలేదు. కేవలం కుల సమీకరణాలపైన, ప్రభుత్వ వ్యతిరేకతపైన ఆధారపడి, అహంభావంతో వ్యవహరించిన ఫలితమే ఈ ఫలితాలు అని చెప్పవచ్చు. ఒక విధంగా ఆయన బిజెపి నాయకుల విమర్శల ఉచ్చులో పడిపోయారు. ‘కుటుంబ పాలన’ అనే విమర్శలతో భయపడి తన పరివార్ అందరినీ దూరంగా చేసుకొని ఒంటరి పోరాటం చేశారు. చివరకు మరదలు బిజెపిలో చేరుతున్నా ఆపు ప్రయత్నం చేయలేదు.
బాబాయి శివపాల్ గత ఎన్నికలలో అఖిలేష్ ఆధిపత్యంపై తిరుగుబాటు చేసి, పార్టీ ఓటమికి కారకులయ్యారు. ఈసారి ఆయన తిరిగి పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నా, ఆయనను కూడా ప్రచారంలో దింపలేదు. కనీసం ములాయం సింగ్ యాదవ్ తిరగలేక పోయినా అక్కడక్కడా కనిపించినా కొంత ప్రభావం ఉండెడిది గదా! అదే, బిజెపిని చూడండి. యోగి ఆదిత్యనాథ్ మూడేళ్ల నుంచి ఎన్నికల ప్రచార తరహాలోనే వ్యవహరిస్తున్నారు. ఆదిత్యనాథ్ ఎదుగుదల రాజకీయంగా తనకు ముప్పనే భయంతో ఆయనను అస్థిరపరచాలని ప్రధాని మోడీ గత ఏడు ఆగస్టులో విఫల ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత సర్దుకొని యోగి పాలన చూసి ఓటు వేయమని ప్రచారం చేశారు. ఆయన మరెక్కడా, తనను కాకుండా మరొకరిని చూసి ఓటు వేయమని కొరకపోవడం గమనార్హం. ప్రధాని అయితే సంవత్సరం అంతా ఎన్నికల ప్రచారం ధోరణిలోనే వ్యవహరిస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ వంటి నేతలు తరచూ ‘సెలవు’ పై ఉంటూ తమ పార్టీ వారికి కూడా అందుబాటులో ఉండరు. పంజాబ్‌లో పార్టీ అంతగా దిగజారడానికి ఆయన సర్దుబాటు ధోరణి ప్రదర్శించక పోవడమే గదా కారణం. బిజెపి నాయకుల మధ్య కూడా కేంద్రంలో, రాష్ట్రంలో ఆధిపత్య పోరు ఉంది. అయితే ఎన్నికల సమయంలో నాయకులందరూ కలిసి పని చేస్తారు. పార్టీ ఓడితే అందరం మునిగిపోతామనే భయం వారిని వెంటాడుతుంది.
కాంగ్రెస్, బిఎస్‌పి తుడిచిపెట్టుకు పోయినా బిజెపి చెప్పుకోదగిన ప్రయోజనం పొందలేకపోయింది. చివరకు హిందూత్వకు చిహ్నాలుగా మారిన అయోధ్య, వారణాసిలలో కూడా ఓటమి చెందుతామనే భయంతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, పరివార్ చివరిలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్వయంగా ప్రధాని వారణాసిలో మూడు రోజులు ఉన్నారు. అంత పట్టుదల ప్రతిపక్ష నేతలు ఎవ్వరిలో కనిపించలేదు. ప్రభుత్వ వ్యతిరేకత, ఓటర్ల సానుభూతి స్పష్టంగా వ్యక్తమైనా వాటిని ఉపయోగించుకొనే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం అన్నా, రాజకీయాలు అన్నా కేవలం ఎన్నికలకు పరిమితం అనే దృష్టి నుండి మన రాజకీయ నాయకత్వం బయటపడితే గాని దేశంలో సుపరిపాలన సాధ్యం కాదు. నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించాలి. ఎన్నికల ఫలితాలు తాత్కాలికమైనవి. నిత్యం ప్రజాజీవనంలో క్రియాశీలకంగా ఉండడం ద్వారా, ప్రజల ముందు ప్రత్యామ్నాయ విధానాలు, ఆలోచనలు ఉంచడం ద్వారా మాత్రమే ఏ నాయకుడైనా, రాజకీయ పార్టీ అయినా దీర్ఘకాలం మనగలిగే అవకాశం ఉంటుంది. ఆ విధం గా ఈ ఫలితాలు దేశంలోని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం లేదా హెచ్చరిక కావాలి.
ఎన్నికల ఫలితాలతో జాతీయస్థాయిలో రాజకీయ కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాలు మూలన పడినట్లే అంటూ బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే రాజకీయం అన్నది క్రియాశీల ప్రక్రియ. ఎప్పుడు, ఏ పరిణామం ఎటువంటి మార్పుకు దారితీస్తుందో చెప్పలేము. ప్రతి ఎన్నిక కూడా ఒక పోరాటమే. అందుకనే భారతదేశం కోసం సంగ్రామం 2024 లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తును నిర్ణయించలేవని అంటూ ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం గమనార్హం. ఈ ఫలితాల పట్ల పాజిటివ్ ధోరణిలో వ్యవహరించాలని మమతా బెనర్జీ పేర్కొన్నారు. బిజెపిని ఎదుర్కోవాలనుకునే రాజకీయ పార్టీలన్నీ కలిసి నడవాలని ఆమె స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ తమ విశ్వసనీయతను కోల్పోతోందని పేర్కొంటూ కాంగ్రెస్ పైన ఆధారపడలేమని తేల్చి చెప్పారు. అందుకనే రాజకీయ పోరాటంలో నిబద్ధత కూడా చాలా అవసరం.

                                                                                    చలసాని నరేంద్ర, 9849569050

BJP Huge Win in Assembly Elections 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News