Wednesday, May 15, 2024

పాసుల జారీ వెనుక బిజెపి మైసూర్ ఎంపి ప్రతాప్ సింహ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్మోక్ బాంబులతో పార్లమెంట్ లోపలకు ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులకు పాసుల జారీకి సిఫార్సు చేసిన ఎంపీ ఎవరన్న విషయమై వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి సభ్యులు కూర్చున్న సీట్ల పైకి దూకి అలజడి సృష్టించిన నేపథ్యంలో వారికి విజిటర్స్ పాసుల అనుమతి వెనుక ఎవరు ఉన్నారన్న విషయాలు వెలుగు చూస్తున్నాయి. బిజెపి ఎంపి ప్రతాప్ సింహా కార్యాలయం నుంచే వారికి పాసులు జారీ అయినట్లు బిఎస్‌పి ఎంపి డానిష్ అలీ తెలిపారు.

కర్నాటకలోని మైసూరుకు చెందిన ఎంపి ప్రతాప్ సింహ కార్యాలయం నుంచే వారిద్దరికీ పాసులు జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవకర్గానికి చెందిన వ్యక్తని వారు చెప్పారు. 35 ఏళ్ల డి మనోరంజన్ మైసూరులోని వివేకానంద్ యూనివర్సిటీ నుంచి బిటెక్ చదివాడు. అతని తండ్రి మైసూరులోని విజయ్‌నగర్‌లో నివిస్తున్నారు. 2014లో మైసూరు నియోజకవర్గం నుంచి 43.46 శాతం ఓట్లు సాధించి గెలుపొందిన సింహ 2019 ఎన్నికలలో తన ఓట్ల వాటాను 52.27 శాతానికి పెంచుకున్నారు. మాజీ జర్నలిస్టు అయిన 42 ఏళ్ల సింహ తన వ్యాసాల ద్వారా పేరు పొందారు. 2007లో ప్రధాని నరేంద్ర మోడీపై జీవిత కథ రాసిన సింహ ప్రధాని మోడీని తాను ఆరాధిస్తానని గతంలో చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డి మనోరంజన్, సాగర్ శర్మ లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఛాంబర్‌లోకి దూకారు. ఎంపీలు కూర్చునే డెస్కులపైకి దూకిన సాగర్ స్పీకర్ కుర్చీ వూసు పరుగెత్తడం టివి పుటేజ్ చూపింది. ఈ సమయంలో మనోరంజన్ ఒక స్మోక్ బాంబును ప్రయోగించగా పసుపు రంగు పొగ రావడం కనిపించింది. మనోరంజన్ ఎంపి కార్యాలయానికి తరచు వచ్చేవాడని వర్గాలు తెలిపాయి. బుధవారం ఎంపి కార్యాలయానికి వచ్చిన మనోరంజన్ సహ నిందితుడు సాగర్ శర్మను తన మిత్రుడిగా అక్కడి సిబ్బందికి పరిచయం చేశాడని వారు చెప్పారు.

కొత్త పార్లమెంట్‌ను చూస్తామన్న నెపంతో సిబ్బంది నుంచి పాసులు పొందాడని వారు తెలిపారు. సింహా తరఫున మూడు పాసులు జారీ చేశారని, అయితే చంటిబిడ్డతో వచ్చిన ఒక మహిళ లోపలకు అనుమతించకపోవడంతో వాపసు వచ్చిందని, ఆమె పేరును పాసులో పేర్కొనలేదని వర్గాలు తెలిపాయి. ఇద్దరు నిందితులతో ఆ మహిళకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు. పాసుల కోసం మూడు నెలలుగా మనోరంజన్ ఎంపిని, ఆయన కార్యాలయ సిబ్బందిని అడుగుతున్నాడని వర్గాలు తెలిపాయి. తమ నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి అటువంటి విజ్ఞప్తులను ఎంపీలు మన్నించడం సాధారణమేనని ఎంపి కార్యాలయం తమ చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఉండగా పార్లమెంట్ వెలుపల రంగుల స్మోక్ బాంబులతో ఉన్న అమోల్ షిండే, నీలం దేవి అనే ఇద్దరు స్త్రీపురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News