Tuesday, May 7, 2024

జార్ఖండ్‌లో బిజెపి రాజకీయం!

- Advertisement -
- Advertisement -

Former Japanese Prime Minister assassinated

 దేశంలో రాజకీయ వాతావరణం ఆరోగ్యవంతంగా లేదు. రాష్ట్రాల్లోని బిజెపి యేతర ప్రభుత్వాల తల మీద అస్థిరత్వ ఖడ్గం వేలాడుతున్నదనే అనుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ప్రతిపక్ష ముక్త్ భారత్ కోసం బిజెపి ఆరాటం జుగుప్స కలిగిస్తున్నది. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని అత్యంత నియమ విరుద్ధంగా కేంద్రంలోని బిజెపి పాలకులు కూల్చివేసిన తర్వాత ఇతర మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నీచ నికృష్ట రాజకీయాన్ని వారు జరిపించగలరనే అభిప్రాయం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల లో అటువంటి అప్రజాస్వామిక క్రీడకు పాల్పడ గలరనే భయాలు పొడసూపుతున్నాయి. జార్ఖండ్ పాలక కూటమికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు పెద్ద మొత్తం డబ్బుతో కోల్‌కతాలో పోలీసులకు పట్టుబడడం వెనుక బిజెపి హస్తం ఉందనే విమర్శ వినవస్తున్నది.

కాంగ్రెస్ అధిష్టాన వర్గ నాయకులే ఈ ఆరోపణ చేశారు. ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నామన్ బిక్సల్ కొంగారి అనే ఈ ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ శాసన సభ్యుల వద్ద గల డబ్బు ఎంతో వెంటనే వెల్లడి కాలేదు. లెక్కింపు యంత్రాలు ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. వీరిని హౌరా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జార్ఖండ్‌లోని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే వీరికి బిజెపి ఈ డబ్బు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఆ ముగ్గురు ఎంఎల్‌ఎలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 82 మంది సభ్యులున్న జార్ఖండ్ శాసనసభలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎమ్‌ఎమ్) కు 30 మంది, కాంగ్రెస్ కు 17 మంది, బిజెపి కి 25 మంది ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని జెఎమ్‌ఎమ్ నెలకొల్పింది. దొరికినది జెఎమ్‌ఎమ్ -కాంగ్రెస్ అవినీతి సొమ్మని, జార్ఖండ్‌లో ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ అక్రమాలు పేట్రేగిపోయాయని జార్ఖండ్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు ఆరోపించారు.

అరెస్టయిన ముగ్గురు శాసనసభ్యుల అభిప్రాయం వెల్లడికావలసి ఉంది. ఇటీవల గోవాలో ఐదుగురు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ముఖ్యమంత్రిని కలియగానే అక్కడ తమ పార్టీకి బిజెపి ఎసరు పెట్టదలచిందని గ్రహించి హస్తం పార్టీ గగ్గోలు పెట్టింది. దానితో ఆ కుట్ర ఆగింది. ఎన్నికలలో ప్రజల మద్దతు చూరగొనడం ద్వారా అధికారంలోకి రావడంలో విఫలమయిన చోట సిగ్గుఎగ్గు లేకుండా బిజెపి దొడ్డి దారిని ఎంచుకొంటున్నది. ఇడి, సిబిఐలను జేబు సంస్థలను చేసుకొని చెప్పినట్టు వినే శకుని పాచికల్లా ప్రయోగిస్తున్నది. వాటి చేత ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని కీలక ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నది. ఆ విధంగా వారిని నైతికంగా దెబ్బతీసి తన పబ్బం గడుపుకుం టున్నది. మొన్న మహారాష్ట్రలో కూల్చివేత కుట్ర భగ్నం చేయడానికి శాయశక్తుల ప్రయత్నించిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ను తాజాగా అరెస్టు చేయించారు.

జార్ఖండ్ పాలక కూటమి భాగస్వామ్య పక్షాలు జెఎమ్‌ఎమ్, కాంగ్రెస్‌లు ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో చెరో దారి పట్టాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వోటు వేయగా, జెఎమ్‌ఎమ్ పాలక ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి, విజేత ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చింది. దీనితో ఆ రాష్ట్రంలో త్వరలో బిజెపి -జెఎమ్‌ఎమ్ ప్రభుత్వం ఏర్పడనున్నదనే ఊహాగానాలు బయలు దేరాయి. సాటి ఆదివాసీ కాబట్టి ముర్ముకు జెఎమ్‌ఎమ్ వోటు వేయడం సహజమనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అయితే బిజెపి వైపు జెఎమ్‌ఎమ్ మొగ్గుతున్నదనిపించడానికి వేరే పరిణామాలు సైతం దోహదపడ్డాయి. జూలై 12 న దేవుఘడ్ నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

ఆయన పక్కన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వెలిగిపోయారు. ఆ సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ‘కేంద్రం నుంచి సహాయం అందితే, వచ్చే పదేళ్లలో జార్ఖండ్ అభివృద్ధి చెందిన రాష్ట్రం అవుతుంది. ఈ రోజు చరిత్రాత్మక దినం. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం శ్రీకారం చుట్టుకొంటే అభివృద్ధి ఊపు అందుకొంటుంది’ అని ప్రధాని సమక్షంలో ప్రారంభోత్సవ వేదిక మీది నుంచి హేమంత్ సోరెన్ అన్నారు. ఈ పరిణామం తర్వాత బిజెపి గెద్ద చూపు జార్ఖండ్‌పై ఉన్నదని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని అధికారాలను వినియోగించుకొని ఒక్కొక్క రాష్ట్రాన్నీ అక్రమ మార్గంలో, అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ్ద పద్ధతిలో తన ఖాతాలో వేసుకోడం ద్వారా బిజెపి దేశ రాజకీయాన్ని అపూర్వ స్థాయిలో కలుషితం చేస్తున్నది. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేసి ఏకపక్ష నిరంకుశ పాలనను నెలకొల్పుకోవాలని చూస్తున్నది. ప్రజాస్వామ్యానికి బొత్తిగా నూకలు లభించకుండా చేస్తున్నది. దేశంలోని ప్రజాస్వామ్యవాదు లందరూ ఏకమై దీనిని తీవ్రంగా ఖండించవలసి వున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News