Wednesday, May 1, 2024

సమానత ఇప్పుడైనా సాధ్యపడేనా!

- Advertisement -
- Advertisement -

దేశం నిండా జలాలు సమృద్ధిగా లభిస్తున్నా నీరందని బీళ్లున్నట్టే ముప్పై శాతానికి పైబడిన నిరక్షరాస్యత అభివృద్ధికి గొడ్డలు పెట్టుగా మారింది. సహస్రాధిక విశ్వవిద్యాలయాలు, అరకోటి కళాశాలలు విద్యనందిస్తున్నప్పటికీ పట్టభద్రులు సైతం ‘వర్క్ ఫోర్స్’ గా రూపొందని దారుణ పరిస్థితి. సమ్మిళిత లేదా సమీకృ విద్య, నైపుణ్యాలు, అర్హతలు, సమానావకాశాల గురించి ఎన్‌ఇపి -2020లో చర్చోప చర్చల సందర్భంలో ” మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నారు. అయితే వీళ్లంతా చాలామటుకు ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు? అని మీరు ఆలోచిస్తున్నారా! అవకాశాలు లేకపోవడమేనా? కాదు, అతిపెద్ద కారణం – నైపుణ్యం లేకపోవడం, నిపుణులు లేకపోవడమే” అంటారు నాగపూర్‌కు చెందిన ప్రశాంత్ బోర్కర్.

School education in india

‘సమ్మిళిత విద్య సమాన అవకాశాలు’ అనేది చాలా కాలంగా ఉత్తి పొడి మాటగానే వినపడుతుందే తప్ప, ఈ దిశగా జరిగిన ఆచరణాత్మక కృషి తక్కు వే. దేశంలో చాలా ప్రాంతాలు, వర్గాలు, శ్రేణులు, సమూహాలు ఏదో ఒక దశలో ఏదో ఒక కారణంతో ఉన్నత విద్య కు దూరమవుతూనే ఉన్నారు. అర్హతలు, అవకాశాలు కులీనుల (ఎలైట్స్)కే దక్కడం మూలంగా సంపన్నులు మరింత సంపన్నులుగాను పేదలు నానాటికీ మరింత పేదలుగాను మారుతున్న పరిస్థితి. విద్య ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుంది, ఆర్థికాభివృద్ధి విద్యను కొత్తపుంతలు తొక్కిస్తుందనేది గత రెండు వందల సంవత్సరాల ప్రాపంచికానుభవం. అందుకేనేమో ప్లేటో మహాశయుడు ‘ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా విద్యను నిర్లక్ష్యం చేస్తే, వాళ్లు జీవితాంతం అవిటి వాళ్లమాదిరిగా బ్రతకవలసి ఉంటుంది’ అన్నాడు. ఇక్కడ నిర్లక్ష్యం అనే మాటనే తీసుకుంటే లబ్ధిదారులే నిర్లక్ష్యం చేయడం ఒక కోణం, లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయబడటం రెండోది. ఉన్నత విద్యా గమనం, గమ్యాలను చూసినట్లైతే నిర్లక్ష్యం చేయబడటం అనే రెండోదే సమానతను దెబ్బ తీస్తూ వస్తున్నది. నిర్లక్ష్యం చేయబడటం అనేది ప్రభుత్వాలకు తెలిసి విధానపరంగా జరిగినా, తెలియకుండా సామాజికంగా జరిగినా నష్టపోయిన ఏ తరాన్ని, ఏ కోశానా ఆ తరం అభివృద్ధి వర్గాలతో కలపలేం. అయితే ఎప్పటికప్పుడు అందరికీ అర్హతలనూ అవకాశాలనూ కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు బాధ్యతలకు ఎడం జరిగినప్పుడూ, విస్మరించినప్పుడూ జ్ఞాపకం చేసేందుకు సమాజం వైపు నుంచి పూనిక ప్రయత్నాలూ తప్పని జరుగుతుంటాయి, జరగాలి.
ఒక్క విద్యకు సంబంధించే కాదు, అన్ని రంగాల్లో సమానత సాధన కోసం పౌర సమాజం వైపు నుండి జరగవలసిన పూనిక ప్రయత్నాలను గురించి సుప్రసిద్ధ ఆర్థికవేత్త థామస్ పికెట్టే తన ‘Brief History of Equality’ గ్రంథంలో ఇట్లా ‘The battle for equality will continue in the twenty-first century, basing itself cheifly on the memory of past struggles . If a historical movement toward more social, economic, and political equality has been possible over the last two centuries, that is above all thanks to a series of revolts, revolutions, and political movements of great scope.The same will be true in the future’ అంటారు. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమానత కోసం నడుస్తున్న సుదీర్ఘ ఉద్యమాల్ని సమర్థించి, అవి మున్ముందు కొనసాగవలసిన అవసరాన్ని థామస్ పికెట్టే కాంక్షించారు. వ్యవస్థలో తలెత్తే ఏ ఉద్యమానికైనా దాని ముడి చైతన్యం ఆ వ్యవస్థ సాధించిన విద్యా ప్రగతిలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పటి వరకు దేశం సాధించిన విద్యాప్రగతిలో సామాజిక దామాషాను గమనిస్తే భారీ అసమానతలే కనిపిస్తున్నాయి.
మన విద్యా కార్యక్రమంలో పాఠశాల విద్య (school education), తదుపరి విద్య (further education), ఉన్నత విద్య (higher education) అనే మూడు దశల్లో విద్యా హక్కు చట్టం మూలాన మహా అయితే పిల్లలు పాఠశాల విద్య పూర్తి చేయగలుగుతున్నారు. ఇంటర్మీడియట్ గా పిలువబడుతున్న తదుపరి విద్య మొదలుకొని పైచదువుల్లోకి నిమ్నవర్గాలు, గ్రామీణులు, ఆదివాసీల ప్రవేశాల నమోదు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
అయితే ఉన్నత విద్యలో అసమానతల పరిష్కారం కోసం ఇటీవల యుజిసి సంకల్పించిన ‘నేషనల్ హయ్యర్ ఎడ్యకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేం వర్క్ (ఎన్‌హెచ్‌ఇక్యుఎఫ్ 2022)’, ‘నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేజ్ వర్క్ (ఎన్‌ఎస్‌క్యుఎఫ్ -2022)’ ముసాయిదాలు కొంత ఊరట, ఉపశమనం కలుగజేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వందకు పైచిలుకు దేశాలు పకడ్బందీగా తమ యువతకు ‘నైపుణ్యార్హతా ఫ్రేం వర్క్’ ను అందిస్తున్న దరిమిలా ఎన్‌హెచ్‌ఇక్యుఎఫ్, ఎన్‌ఎస్‌క్యుఎఫ్ రెండూ ఉన్నత విద్యలో గుణాత్మక అభ్యసనానికి రెండు వైవిధ్యభరిత మార్గాలని, ఉన్నత విద్యాసంస్థలను వాటి సాధారణ స్థాయి నుండి ఒక బెంచ్ మార్కింగ్‌కు తీసుకురావడం లేదా ఎలివేట్ చేయడం సామర్థ్యాలపెంపు, జ్ఞానం, నైపుణ్యాలు, యోగ్యతల అనుగుణంగా అన్ని స్థాయిల్లో యువతకు కావలసిన అర్హతలను అవకాశాలను కల్పించేందుకు, దేశాన్ని ‘సూపర్ పవర్’ గా మార్చేందుకు పూనుకున్నట్టు యుజిసి చెబుతున్నా, ఆచరణలో తటస్థించే సాధ్యాసాధ్యాలను అనుమానంగా చూడవలసివస్తుంది.
దేశం నిండా జలాలు సమృద్ధిగా లభిస్తున్నా నీరందని బీళ్లున్నట్టే ముప్పై శాతానికి పైబడిన నిరక్షరాస్యత అభివృద్ధికి గొడ్డలు పెట్టుగా మారింది. సహస్రాధిక విశ్వవిద్యాలయాలు, అరకోటి కళాశాలలు విద్యనందిస్తున్నప్పటికీ పట్టభద్రులు సైతం ‘వర్క్ ఫోర్స్’ గా రూపొందని దారుణ పరిస్థితి. సమ్మిళిత లేదా సమీకృ విద్య, నైపుణ్యాలు, అర్హతలు, సమానావకాశాల గురించి ఎన్‌ఇపి -2020లో చర్చోప చర్చల సందర్భంలో ” మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నారు. అయితే వీళ్లంతా చాలామటుకు ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు? అని మీరు ఆలోచిస్తున్నారా! అవకాశాలు లేకపోవడమేనా? కాదు, అతిపెద్ద కారణం – నైపుణ్యం లేకపోవడం, నిపుణులు లేకపోవడమే” అంటారు నాగపూర్‌కు చెందిన ప్రశాంత్ బోర్కర్.
ఈయన ఎడ్ టెక్ మాడ్యూల్స్ నిపుణులు. ఈ నేపథ్యంలోనే విద్యార్హతలు, నైపుణ్యాలు, అవకాశాల విషయంలో కీలకమైన మార్పుల గురించి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనల దృష్ట్యా లబ్ధిదారులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యాపరంగానూ, వృత్తిపరంగానూ ద్విముఖ ప్రయోజనం కల్పించేందుకు యుజిసి యోచన చేస్తూ వస్తున్నది. ఇప్పటి దాకా కొనసాగిన విద్యా విధానానికి భిన్నంగా అవకాశాలకు దూరమైన వారినందరినీ కలుపుకునే దిశలో అంకురించిన తార్కిక భావనలను ఎన్‌హెచ్‌ఇక్యుఎఫ్, ఎన్‌ఎస్‌క్యుఎఫ్‌లు వివిధ స్థాయిలుగా సూత్రీకరించుకున్నాయి. ఎక్కడా ఆగిపోకుండా ఐచ్ఛికాంశంలో కోర్సు కాలపరిమితి, అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఆధారంగా విశ్వవిద్యాలయాల నుండి అవసరమైతే ఏయేటికాయేడు డిప్లొమా నుండి డాక్టరేట్ వరకు సంబంధిత విజయ పత్రాన్ని పొందవచ్చు. జాతీయ, అంతర్జాతీయ అర్హతలకు సమానంగా నైపుణ్య సముదాయంతో వృత్తి ఉపాధి అవకాశాల్లో మన యువత అన్ని చోట్లా పోటీ పడవచ్చుననేది యుజిసి ఎన్‌హెచ్‌ఇక్యుఎఫ్, ఎన్‌ఎస్‌క్యుఎఫ్ ల ద్వారా ఇస్తున్న భరోసా.
ప్రపంచ అత్యున్నత విద్యావంత దేశాల్లో అగ్ర భాగాన నిలిచిన కెనడాను మనం గమనించినట్లైతే ఆర్థిక స్థోమత, జీవన నాణ్యత, వృత్తిపరమైన వృద్ధికి ఆ దేశం పెట్టింది పేరు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది నివసించాలనుకుంటున్న దేశాల్లో కూడా కెనడానే మొదటిది. పరిపాలనా పరంగా అక్కడ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అక్కడి యువత ఆకాంక్షలపైనే కాకుండా, విదేశీయులు అక్కడ ఉన్నత విద్యనభ్యసించేందుకు సైతం ప్రభుత్వం కొత్త కొత్త కోర్సులను ప్రామాణికంగా రూపొందించి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలను కూడా కెనడా కల్పిస్తుంది. ఇందుకు ఆ మధ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ విద్యా సదస్సులో ఇచ్చిన ఈ Our natural resources are important, and they always will be. But Canadians know that what it takes to grow and prosper isn’t just what’s under our feet, it’s what between our ears. సందేశమే తార్కాణం. అర్హతలు, అవకాశాలు, నైపుణ్యాల కల్పనలో నాణ్యతకు కెనడా పెద్దపీట వేస్తుందని నమ్మడానికి ఇంతకంటే మహత్తర వాంగ్మూలం మరేముంటుంది. ‘మన చుట్టూ ఉండే ప్రకృతి వనరులు, సంపద మనతోనే వుంటాయి. అవి మనకు ముఖ్యమే. అయితే మన కాళ్లకిందే ఉండే భూమి కంటే చెవుల్లో వినపడే చదువు శాస్త్రమే ప్రతి కెనడా వాసికి తారకమంత్రం కావాలి’ అనగలిగే శక్తివంతమైన ఆచరణాత్మక నాయకత్వమే మనకిప్పుడు కావాలి. విజన్‌తో పాటు మిషన్ ఉన్నందున్నే కెనడా అత్యున్నత విద్యావంతులను అత్యధికంగా తయారు చేయగలిగింది. మన పాలకులకూ పాలనలో కెనడా ప్రభుత్వాలకు వలెనే రాజకీయాలు అధికారలాలస కాకుండా ప్రథమ ప్రాథ మ్యం విద్య అయితేనే సమానత, సుస్థిరాభివృద్ధి సాధ్యం.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News