Wednesday, May 1, 2024

సర్వే చెప్పిన కఠోర సత్యాలు!

- Advertisement -
- Advertisement -

 Economic Survey

కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్‌లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా ఉంది. అయితే ఈ భావన రుజువు కాని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. సర్వేదారి సర్వేది, బడ్జెట్ దారి బడ్జెట్‌దిగా అవి తెల్లారిపోయాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ప్రవేశపెట్టబోయే 2020-21 బడ్జెట్ రూపురేఖలు ఎలా ఉండగలవనేది అటుంచితే శుక్రవారం నాడు ఆమె పార్లమెంటుకు సమర్పించిన 2019-20 ఆర్థిక సర్వే పత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇందుకు దీని రూపుకర్త కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రహ్మణ్యంను అభినందించాలి. దేశ ఆర్థిక వృద్ధి దారుణంగా మందగించిందని గత కొంత కాలంగా పదేపదే రుజువవుతున్న చేదు సత్యాన్ని సర్వే పత్రం అంగీకరించింది.

అయితే అందుకు బాధ్యతను అంతర్జాతీయ మాంద్యం మీద తోసేసింది. ప్రధాని మోడీ గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అవకతవక అమలు నిర్ణయాలే దేశంలో ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలని ప్రఖ్యాత ఆర్థిక రంగ నిపుణులు ఇంతకు ముందే స్పష్టం చేసి ఉన్నారు. ఆర్థిక సర్వే పత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201920) వృద్ధి రేటును 5 శాతంగా అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (202021) మాత్రం 6 నుంచి 6.5 శాతంగా ఉంటుందని జోస్యం చెప్పింది. వాస్తవానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు అంచనాను 4.8 శాతానికి కుదించివేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5.8 శాతం వృద్ధి సాధ్యం కావచ్చునని అభిప్రాయపడింది. ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు మందగించిన పరిస్థితుల్లో ప్రధాని మోడీ నిర్దేశించిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం ఎలా అనేది అంతుచిక్కని ప్రశ్న.

అందుకు సంపద సృష్టి ఒక్కటే మార్గమని ఆర్థిక సర్వే అంటున్నది. దానితో ఏకీభవించని వారు ఉండరు. అయితే అందుకోసం సంపద సృష్టికర్తలని ప్రభుత్వం భావిస్తున్న కార్పొరేట్ రంగ పారిశ్రామికవేత్తలకు మరింతగా రాయితీలు కల్పించడం వల్ల ఆశించిన ఫలితం సిద్ధించకపోవచ్చు. దేశంలో పూర్తిగా చతికిలపడిపోయిన తయారీ రంగాన్ని వెంటనే పునరుజ్జీవింప చేయవలసి ఉంది. సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను విరివిగా ప్రోత్సహించవలసి ఉంది. అదే సమయంలో మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచవలసిన అవసరం ఉంది.

అప్పుడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. 202425 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే మౌలిక సదుపాయాల కల్పన విస్తరణ మీద రూ. లక్ష కోట్లు ఖర్చు చేయాలని సర్వే సూచించింది. అలాగే ఎగుమతులను పెంచుకోడం మీద దృష్టి కేంద్రీకరిస్తే 2025 నాటికి 4 కోట్లు, 2030 నాటికి 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని అభిప్రాయపడింది. ఇందుకు చైనాలో అవలంబిస్తున్న పద్ధతులే శరణ్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

అంటే అక్కడ మాదిరిగా చౌక కార్మిక శక్తిని అందుబాటులోకి తేవాలన్నది ఆర్థిక సర్వే ఆంతర్యంగా స్పష్టపడుతున్నది. ఇందుకోసం ఇప్పటికే నీరుగార్చిన కార్మిక చట్టాలను మరింత కోరల్లేనివిగా చేయడమే శరణ్యమని భావిస్తూ ఉండవచ్చు. ఇక్కడ విచక్షణతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. ద్రవ్యలోటును పరిమితం చేసే లక్షంతో ప్రభుత్వాలు వ్యయాన్ని తగ్గించుకొని ప్రజలు ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తున్నాయి. 200809లో జర్మనీ తన ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ద్రవ్య లోటుకు భయపడుకుండా ప్రభుత్వ వ్యయాన్ని పెంచిన సంగతిని నిపుణులు ఉదహరిస్తున్నారు. అంటే ఆర్థిక వికాసం బాధ్యతను కేవలం ప్రైవేటు రంగానికి వదిలిపెట్టకుండా ప్రభుత్వం కూడా తన వ్యయాన్ని పెంచడం ద్వారా దానిని కొంత పంచుకోవాలన్నది సారాంశం. దేశంలో విడి భాగాల కూర్పు ద్వారా ఎగుమతి ప్రధానమైన వస్తూత్పత్తిని పెంచాలని సర్వే చేసిన సూచన గమనించదగినది.

అలాగే ఉల్లిపాయల ధరను దించడంలో ప్రభుత్వ జోక్యం విఫలమైన సంగతిని సర్వే అంగీకరించడం బాగుంది. ఎన్నడూ లేనంతగా ఆహార ద్రవ్యోల్బణం పేట్రేగిపోయిన నేపథ్యంలో ఇక ముందు ప్రభుత్వమే సేకరణను, నిల్వలను పెంచితే బాగుంటుందనే సూచన సర్వేలో కనిపించింది. బ్యాంకుల నిర్వహణ సామర్థాన్ని మెరుగుపరచవలసిన అవసరాన్ని సర్వే నొక్కి చెప్పింది. అలాగే దేశ కార్మిక శక్తిలో స్త్రీ పురుష వ్యత్యాసం దారుణంగా పెరిగిపోయిన విషయాన్ని ఎత్తిచూపింది. ఆర్థిక సర్వే స్పష్టం చేసిన కఠోర వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడానికి చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి తగిన నిర్ణయాలను నిర్మలా సీతారామన్ నేటి బడ్జెట్‌లో ప్రకటించగలరని ఆశిద్దాం.

Blatant Truths told by Economic Survey
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News