Friday, April 26, 2024

బ్రిటన్‌కు ‘భారతీయ’ ప్రధాని!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం:  నెలన్నర క్రితం లక్షానికి చేరువగా వెళ్లి జారిపోయిన రిషి సునక్ ఇప్పుడు అవలీలగా దానిని ఛేదించి బ్రిటన్ ప్రధాని కావడం గొప్ప విషయమే. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, మరొక ఆశావహి పెన్నీ మోర్టాండ్ పోటీ నుంచి తప్పుకోడం, వంద మందికి పైగా ఎంపిల మద్దతును హుటాహుటిన సమీకరించుకోగలగడం సునక్‌ను ప్రధాని పదవి వరించేలా చేసింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ ద్వారా సుదీర్ఘ ప్రక్రియలో గెలిచి ప్రధాని కావడం వేరు, ఎస్కలేటర్ మార్గంలో వంద మంది ఎంపిల మద్దతును గీటురాయిగా చేసుకొని ఆ పదవిని చేపట్టడం వేరు. ఈ రెండవ పద్ధతిలో సునక్ సునాయాసంగా బ్రిటన్ అగ్రాధిపత్యాన్ని సాధించగలిగారు. భార్య అక్షత (ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె) సంపదను కలుపుకొని చూడగా సునక్ బ్రిటన్‌లోనే సాటిలేని సంపన్నుడయ్యారు. 2015 ఎన్నికల నుంచి పార్లమెంటు సభ్యుడుగా వున్నారు.

బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖను సమర్థంగా నిర్వహించాడన్న ఖ్యాతిని పొందారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో లక్షలాది ఉద్యోగాలను కాపాడే ఆర్థిక ప్యాకేజీని రూపొందించాడన్న ప్రత్యేకతను మూటగట్టుకున్నారు. సునక్ భారతీయ సంతతివాడే కాకుండా భగవద్గీతను విశ్వసించే హిందువునని సగర్వంగా చెప్పుకుంటారు. పార్లమెంటు సభ్యత్వం స్వీకరించినప్పుడు భగవద్గీతపై ప్రమాణం చేశారు. అంతటి నిబద్ధ హిందువు బ్రిటన్‌కు ప్రధాని కావడంతో సహజంగానే మన దేశంలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. భారతీయులను బానిసలుగా చేసుకొని 200 ఏళ్లు పాలించిన బ్రిటన్‌కు ఏలికగా ఎన్నికైన భారతీయుడుగా సునక్‌ను ఇక్కడ ఆకాశానికి ఎత్తడం సహజమే. దీనిని అంతర్జాతీయ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా భారతీయులు భావించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కమల హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికైనప్పటి కంటే ఎక్కువగా ఆనందాన్ని వ్యక్తం చేయడం సహేతుకమే. అవిభక్త భారత దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో గల గుజ్రాన్‌వాలాలో సునక్ పూర్వీకులు నివసించారు. ఈ పట్టణం ఇప్పుడు పాకిస్తాన్‌లో వున్నప్పటికీ హిందూ విశ్వాసిగా సునక్ కుటుంబం భారత సంతతి వారుగానే గుర్తింపు పొందుతున్నారు.

ఈ కుటుంబం అక్కడి నుంచి ఆఫ్రికాకు (నైరోబీ) వలస వెళ్ళి ఆ తర్వాత బ్రిటన్ చేరుకున్నది. సునక్ తండ్రి యశ్వీర్ సునక్ 1949లో నైరోబీలో పుట్టారు. 1966లో బ్రిటన్‌లోని లివర్ పూల్‌కు వెళ్ళిపోయి అక్కడ వైద్య విద్య అభ్యసించారు. సునక్‌ను బ్రిటన్‌లోని అత్యున్నత అధికార పీఠం వరించడం ఆయనకు లభించిన అతి గొప్ప అవకాశం అనుకోవాలా, అత్యంత క్లిష్టమైన సవాలుగా పరిగణించాలా? వాస్తవానికి ఇది ఆయనకు ఎదురైన సవాలే. అయితే ఆర్థిక మంత్రిగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఈ సవాలును దృఢంగా ఎదుర్కోగలిగితే అది ఆయన కీర్తి కిరీటంగా నిలిచిపోతుంది. బ్రెగ్జిట్ సుదీర్ఘ అనిశ్చితి నుంచి బ్రిటన్‌ను బయట పెట్టిన ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఒక రకమైన చరిత్రనే సృష్టించారు. ఆ క్రమంలో ఆయన పార్లమెంటుకు ఆకస్మిక ఎన్నికలు కూడా జరిపించారు. వ్యక్తిగత ప్రవర్తనాపరమైన లోపాలతో పార్టీలో మద్దతు కోల్పోయి జాన్సన్ నిష్క్రమించారు.

ఆయన తర్వాత సునక్‌తో పోటీలో నెగ్గి ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ ముందు వెనుకలు ఆలోచించకుండా ఏడాదికి లక్ష 50 వేల పౌండ్ల పైగా ఆదాయమున్న సంపన్నులపై గల పన్నుల కోతను ప్రతిపాదించి అభాసుపాలయ్యారు. పన్నులు తగ్గించడం వల్ల ఖజానాకు వాటిల్లే నష్టాన్ని అప్పులతో భర్తీ చేస్తానని ప్రకటించి స్టాక్ మార్కెట్‌లో భయోత్పాతాన్ని సృష్టించారు. పౌండు విలువ దిగజారిపోడానికి కారణమయ్యారు. దానితో ఆమె ప్రతిపాదిత బడ్జెట్‌కు మద్దతు ఇవ్వడానికి పార్టీ ఎంపీలెవరూ ముందుకు రాలేదు. పర్యవసానంగా ఆమె 45 రోజుల అత్యల్ప వ్యవధిలోనే దిగిపోయారు. ద్రవ్యోల్బణం శిఖర స్థాయికి చేరుకొని తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు సునక్ ఎటువంటి వైద్యం చేస్తారోనని బ్రిటన్ మాత్రమే కాదు ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నది.

ధరలు విజృంభించి జీవన వ్యయం పెరిగిపోయింది. ఆర్థిక మాంద్యం సుదీర్ఘ కాలం పీడించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని అయిన తర్వాత సునక్ మాట్లాడుతూ లిజ్ ట్రస్ వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. సమగ్రత, వృత్తిగత దృష్టి, ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం కూడిన పరిపాలనను అందిస్తానని సునక్ ప్రధాని పదవిని చేపట్టిన వెంటనే చేసిన ప్రసంగంలో బ్రిటన్ ప్రజలకు హామీ ఇచ్చారు. కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని భరోసా ఇచ్చారు. 42 ఏళ్ల సునక్ బ్రిటన్‌కు గత 200 సంవత్సరాల్లో ఎన్నడూ లేని అత్యంత పిన్న వయసు ప్రధాని మాత్రమే కాక తొలి శ్వేతేతర పాలకుడు. తెల్లవారి దేశమైనప్పటికీ తాము సంక్షోభంలో కూరుకున్నప్పుడు తమను గట్టెక్కించే ందుకు తోడ్పడ గల ఇతర జాతీయులకు కూడా అధికారం అప్పగిస్తారని బ్రిటిషర్లు నిరూపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News