Sunday, April 28, 2024

హింస తగదు

- Advertisement -
- Advertisement -

‘హింస వల్ల కలిగే మంచి తాత్కాలికం.
అది చేసే చెడు శాశ్వతం’ మహాత్మా గాంధీ.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గ బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం అత్యంత హేయమైనది. ప్రజాస్వామ్య ప్రియులందరూ గట్టిగా ఖండించదగినది. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ నిరసించవలసిన దారుణ దుర్ఘటన. రాష్ట్రంలో ప్రశాంతంగా, కన్నుల పండుగగా సాగిపోతున్న ఎన్నికల ప్రచార ఘట్టాన్ని ఈ హత్యాయత్నం రక్తసిక్తం చేసి భయానక వాతావరణాన్ని సృష్టించింది. పార్టీలు, అభ్యర్థులు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రచారంలో పాల్గోలేని అభద్రతా వాతావరణాన్ని కలిగించింది. వారి మనోభావాలను సమగ్రంగా తెలుసుకోలేని స్థితిలో ప్రజలను పడవేసింది. ఇది ఎన్నికల లక్షాన్నే దెబ్బ తీస్తుంది. ఎన్నికల్లో అభ్యర్థులు, వారి ప్రచార కార్యకర్తలు ప్రజల్లో కలిసిపోయి తిరుగుతారు. ఇంటింటికీ వెళ్ళి వారితో మమేకమైపోతారు.

అన్న, తమ్మి, అక్క, చెల్లి అంటూ వరుసలు కలిపి వారి ఓటును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలా ప్రచార ఘట్టాన్ని ఒక సంబురంగా చేసుకోడానికి అలవాటు పడిన చోట ఇటువంటి దాడులు తమ నీడను తామే అనుమానించేటట్టు చేస్తాయి. ఆగంతకుడు, ప్రభాకర్ రెడ్డి పొట్టలోకి కత్తిని దించి కసిగా తిప్పాడని, దానితో ఆయన పేగులు దెబ్బ తిన్నాయని వార్తలు చెబుతున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరం. దాడి చేసిన వ్యక్తి దేనిని ఆశించాడో, అతడి వెనుక ఏవైనా రాజకీయ శక్తులున్నాయో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తులో గాని తెలియదు. ప్రభాకర్ రెడ్డి కేవలం అభ్యర్థే కాదు, ఎంపి కూడా. ప్రజాక్షేత్రంలో చాలా కాలంగా పని చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తి కావడం వల్ల ఆయన నుంచి ప్రభుత్వ సంబంధమైన మేలు ఏదైనా ఆశించి అది లభించక అసంతృప్తికి లోనై ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడా? ఘటన జరిగింది ప్రచార సమయంలో కాబట్టి సహజంగానే దీనిపై పలు రకాల ఊహాగానాలు బయలుదేరుతాయి. దాడి చేయించింది మీరే అంటే మీరే అని పార్టీలు ఆరోపణలకు దిగే పరిస్థితి తలెత్తుతుంది.

ఈ స్వార్థ రాజకీయ క్రీడలో అసలు నిజం చచ్చిపోతుంది. ఎన్నికలను సమరం, యుద్ధం, సంగ్రామం అనడం కూడా తప్పే. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు సమీప గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ప్రశాంత ఎన్నికలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య వైరుధ్యాలు కక్ష సాధింపుకి, పరస్పర దాడులకు దారి తీయడం చాలా అరుదు. బెంగాల్‌లో గత జులైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస చెలరేగి ఏడుగురు చనిపోయారు. మన దగ్గర అటువంటి దుసంప్రదాయం లేదు. ఈ ఘటనతో అభ్యర్థులకు గట్టి భద్రత కలిగించవలసిన అవసరం ఏర్పడుతున్నది. ప్రచారంలో పాల్గొనే నాయకులు వాడే భాష ఇటువంటి సందర్భాల్లో విమర్శకు గురి కావడం సహజం. ప్రజాస్వామ్యయుతమైన చర్చకు మాత్రమే ఎన్నికలు వేదికలు కావాలి గాని, వ్యక్తిగతమైన దూషణలకు ఆస్కారం కలగరాదు. కాని దురదృష్టవశాత్తు పాలక, ప్రతిపక్ష నాయకుల మధ్య రెచ్చగొట్టే ఆరోపణ, ప్రత్యారోపణలు తరచూ చోటు చేసుకొంటున్నాయి.

దీనిని వారు మానుకోవాలి. ఎన్నికలంటే మిత్రపూర్వకమైన పోటీలే గాని శత్రుత్వానికి ఎంత మాత్రం సందు లేనివి. ప్రజల కోసం జరిగే ఎన్నికల ఘట్టంలో వారి సమస్యలపై పార్టీలు, అభ్యర్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అంశాల ప్రాతిపదికగా పరస్పరం విభేదించుకోవాలే గాని వ్యక్తిగత నిందలకు తలపడకూడదు. ‘హింసా మార్గాన్ని అనుసరించే వారికి ప్రజాస్వామ్యంలో విశ్వాసం వుండదు, వారి పద్ధతిదే పైచేయి అయితే కల్లోల పరిస్థితులు నెలకొంటాయి. ప్రజల స్థితిగతులు దిగజారిపోతాయి’ అని మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1949 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ విలువైన ఉద్బోధ చేశారు, ఇది ప్రత్యక్షర సత్యం.

దేశంలోని పార్టీలు, నాయకులకు శిరోధార్యం. పురోగతికి శాంతి బలమైన పునాది. దేశంలో, సమాజంలో ప్రశాంత పరిస్థితులు లేకపోతే అభివృద్ధి అణువంత కూడా జరగదు. అందుకే ఎన్నికలు ప్రజాస్వామ్య పట్టాల మీద సాగే ప్రజాహితమైన రైళ్ళు. ఆ పట్టాలు గతి తప్పితే జరిగే ప్రమాదం అంత ఇంత కాదు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఇప్పుడిప్పుడే చిక్కబడుతున్నది. ఆదిలోనే సంభవించిన ఈ కత్తి దాడి ఇక ముందు జరగబోయే ప్రచార ఘట్టానికి ఒక హెచ్చరిక వంటిది. పోలీసులకు సవాల్ కూడా. స్వేచ్ఛాయుతమైన ప్రచారానికి ఎటువంటి హాని కలగని రీతిలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చాకచక్యమైన భద్రతా ఏర్పాట్లను చేయవలసి వుంటుంది. అంతిమంగా హింసతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోజాలరని చాటవలసి వుంది. ఊహించని దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకొని తిరిగి ప్రచారంలో తలమునకలు కావాలని ఆశిస్తున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News