Thursday, May 2, 2024

సాగు చట్టాల రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Union Cabinet approves bill to repeal Farm laws

29 నుంచి పార్లమంట్ శీతాకాల సమావేశాలు
ఈ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం
ఎంఎస్‌పి అధ్యయన కమిటీపై రాని స్పష్టత
క్రిప్టో కరెన్సీసహా మరో 25 బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో వేలాది రైతుల నుంచి గత ఏడాది కాలంగా నిరసనలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదం కోసం ఈ నెల 29న ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదది. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రయోజనాల గురించి రైతులకు నచ్చచెప్పి ఒప్పించలేకపోయినందున మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించారు. మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గత ఏడాది కాలంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన సాగిస్తున్న రైతులు నిరసనలకు స్వస్తి చెప్పి తమ ఇళ్లకు తిరిగివెళ్లాలంటూ ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో&గత ఏడాది జూన్ 15న వ్యవసాయ చట్టంపై కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టగా 2020 సెప్టెంబర్ 17న బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 20న ఈబిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే క్రమంలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021ను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది.

వివాదాస్పద చట్టాలు ఇవే..

కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం(ప్రోత్సాహం, సదుపాయ కల్పన) బిల్లు-2020, ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత, రక్షణ) 2020-బిల్లు, నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు-2020 ఉన్నాయి. నిత్యావరసర వస్తువుల(సవరణ) బిల్లు అమలు ఉద్దేశం తృణధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు వంటి వస్తువులను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించి వాటి నిల్వలపై ఉన్న ఆంక్షలను తొలగించడం.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన ఈ మూడు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల రైతులు భగ్గుమన్నారు. గత ఏడాది నవంబర్ 26వ తేదీన ఢిల్లీ శివార్లలో రైతుల నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆందోళనల్లో 40కి పైగా రైతు సంఘాలు పాల్గొన్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 11 దఫాలుగా రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పటికీ సఫలీకృతం కాలేదు. కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ఇచ్చిన టాక్టర్ ర్యాలీ పిలుపు హింసాత్మకంగా మారడంతో రైతుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రైతులు తమ ఆందోళనలను నిర్నిరోధంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని ఈ నెల 19న ప్రకటించారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలో ఇందుకు సంబంధించిన బిల్లులను ఆమోదిస్తామని కూడా ఆయన ప్రకటించారు. రైతులు తమ నిరసనను వెంటనే విరమించుకుని ఢిల్లీ శివార్లలోని నిరసన శిబిరాలను ఖాళీ చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చినప్పటికీ రైతులు మాత్రం ఇవి పార్లమెంట్‌లో ఆమోదం పొందేంతవరకు తాము నిరససను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక తమ పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని కూడా రైతు సంఘాలు డిమాండు చేస్తున్నాయి.

అధ్యయన కమిటీపై కేంద్ర మంత్రి మౌనం..

ఈ నేపథ్యంలో&మూడు వ్యవసాయ చట్టాలను రద్దుకు సంబంధించిన ప్రక్రియను క్యాబినెట్ పూర్తి చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విలేకరులకు తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడమే తమ ప్రాధాన్యతాంశంగా ఆయన చెప్పారు. కాగా..కనీస మద్దతు, ఇతర వ్యవసాయ సంబంధిత అంశాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు కొనసాగుతాయి. ఈ బిల్లుతో పాలు క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన బిల్లుతోసహా మరో 25 బిల్లులను కూడా పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News