Saturday, April 27, 2024

సంక్షోభ సమయాన చూస్తూ ఊరుకోం

- Advertisement -
- Advertisement -

సంక్షోభ సమయంలో ప్రేక్షక పాత్ర వహించలేం
హైకోర్టు విచారణలను అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు
కరోనా విజృంభణపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Can't be silent spectator during National Crisis: SC

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో యావత్ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ తాము ప్రేక్షకపాత్ర వహించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనా విలయంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు మెరుగైన రీతిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయపర్చడంలో తమ పాత్ర ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు యావద్దేశం పోరాటం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు జోక్యం ఎంతో అవసరం. జాతీయ సంక్షోభ వేళ సుప్రీంకోర్టు స్పందించకుండా ఉండలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఇప్పటికే హైకోర్టుల్లో కరోనా విషయంలో జరుగుతున్న విచారణలను అపే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై హైకోర్టులే సరైన నిర్ణయాలు తీసుకోగలవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో హైకోర్టులు మెరుగ్గానే పని చేస్తున్నాయని, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు తమ అధికారాలను వినియోగించకుండా తాము అడ్డుకోవడం లేదని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వారు పరిశీలించలేని అంశాలపై మాత్రమే సాయం చేసే పాత్రను తాము పోషిస్తామని అభిప్రాయపడింది.

కరోనా విజృంభణపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడాన్ని గతవారం కొందరు న్యాయవాదులు విమర్శించడం, హైకోర్టులు తమ విచారణలను కొనసాగించేందుకు అనుమతించాలంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశంలో కరోనా నియంత్రణ చర్యలపై సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గత వారమే విచారణ చేపట్టింది. తొలుత అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి కేంద్రప్రభుత్వ ప్రణాళికను కోర్టు ముందుంచాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ ప్రణాళికను తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆక్సిజన్ లభ్యత, రాష్ట్రాల ఆక్సిజన్ అవసరాలు, కరోనా తీవ్రప్రాంతాల్లో చర్యలు, టీకా లభ్యత వంటి వివరాలను అందించాలని కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా టీకాకు వేర్వేరు ధరలు నిర్ణయించడంపై సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సహా పలువురు లాయర్ల వాదనలను కూడా బెంచ్ వినింది. టీకా ధర నిర్ణయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. వీటితో పాటుగా ధరల నియంత్రణకు పేటెంట్ చట్టం అమలు అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. వీటన్నిటిపై గురువారం సాయంత్రం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా కొంతమంది న్యాయవాదుల వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అమికస్ క్యూరీ బాధ్యతలనుంచి తప్పుకొన్న దృష్టా సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్తా, మీనాక్షి అరోరాలను ధర్మాసనం కొత్త అమికస్ క్యూరీలుగా నియమించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Can’t be silent spectator during National Crisis: SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News