Saturday, April 27, 2024

అరుంధతీరాయ్‌పై కేసు!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్‌తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు పెట్టారు. అరుంధతీ రాయ్, మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా అక్టోబర్ 10వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. ‘విద్వేషపూరిత ప్రసంగాలు’ చేశారని భారత శిక్షాస్మృతిలోని 153 ఎ, 153బి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి తగిన ప్రాథమి సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎల్‌జి అభిప్రాయపడ్డారు. అరుంధతీరాయ్, హుస్సేన్‌లు సామాజికి సామరస్యాన్ని దెబ్బతీసి, ప్రజలను పక్కదారి పట్టించారని దేశద్రోహ నేరం కంటే తీవ్రంగా ఎఫ్‌ఐర్‌లో ఆరోపించారు. అరుంధతీ రాయ్‌పైన, హుస్సేన్ పైనే కాకుండా, దివంగతులైన సయ్యద్ అలీషా జిలాని, సయ్యద్ అబ్దుల్ రహమాన్ జిలానీలపై పదమూడేళ్ళ క్రితం; 2010 అక్టోబర్ 28వ తేదీన సుషీల్ పండిట్ చేసిన ఫిర్యాదుననుసరించిన కేసు గురించి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశద్రోహ నేర చట్టాన్ని ప్రభుత్వం సమీక్షిస్తున్నందున ఈ చట్టాన్ని పక్కన పెట్టాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. దీంతో దేశద్రోహ చట్టానికి కాలం చెల్లిందని, పోలీసులు కూడా కేసులు పెట్టడం లేదని సక్సేనా గమనించారు. దేశ వ్యాప్తం జర్నలిస్టులు, పరిశోధకుల ఇళ్ళపైైన, కార్యాలయాలపైన దాడి జరిగిన మరుసటి రోజే ప్రభుత్వం అరుంధతీ రాయ్, హుస్సేన్‌లపై చర్యలకు ఉపక్రమించింది.

ఆమె రచనలు ‘ద గ్రేటర్ కామన్ గుడ్’ (1999), ‘ద ఆల్జీబ్రా ఆఫ్ ఇన్‌ఫినైట్ జస్టిస్’ (2001), ‘లిజనింగ్ టు గ్రాస్ హూపర్’ (2002), ‘ద కాస్ట్ ఆఫ్ లివింగ్’ (2000), ‘వార్ టాక్’ (2003) ప్రవాహంలా వచ్చాయి. భారత దేశాన్ని దారుణమైన అసమానతల్లోకి, హింసలోకి నెట్టివేసే యుద్ధం, లాభాలు, వాటి మూలాల గురించి ‘మై సెడిషన్ హార్ట్ 2019’ అన్న పేరుతో వ్యాసాలు రాశారు. అరుంధతీరాయ్ 2004లో చేసిన అద్భుతమైన ఐజీ ఖాన్ స్మారకోపన్యాసంలో భారతదేశ అభివృద్ధి ద్వంద్వ మేళంలా ఉందని వ్యాఖ్యానించారు. ఒకవైపు దేశ సంపదను ముక్కలు ముక్కలు చేసి అమ్ముతూ, మరొకవైపు ‘సాంస్కృతిక జాతీయవాదం’ పేరుతో కేకలు పెడుతూ ప్రజల దృష్టిని మరల్చారని ఆరోపించారు. ఆ సమయంలో అధికారంలో వున్న బిజెపి ఎన్నికల్లో ఓడిపోయింది. బిజెపి ఇలాంటివేవీ మర్చిపోలేదు. ప్రతి ఒక్కటీ జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. ఆ జ్ఞాపకాలను సొమ్ము చేసుకోవడానికి బిజెపి తిరిగొచ్చింది.

అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగాన్ని మర్చిపోలేం. న్యూస్‌క్లిక్ ఎడిటర్ పురకాయస్థ, హెఆర్ డైరెక్టర్ చక్రవర్తిలను అరెస్టు చేసినప్పుడు చేపట్టిన నిరసన ప్రదర్శనలో అరుంధతీరాయ్ ఉన్నారు. ఇది జరిగిన వారం లోగానే లెఫ్టినెంట్ గవర్నర్ ఎఫ్‌ఐఆర్‌ను ముందుకు తీసుకొచ్చారు. ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ రాసినప్పటి నుంచి దేనికోసమైతే నిలబడ్డారో దాని కోసమే ఎఫ్‌ఐఆర్ తప్ప, 2010లో ఆమె చేసిన ప్రసంగానికి కాదు. గత ఏడాది కశ్మీర్‌లో జరిగిన పరిణామాలే గుర్తుకు రావు, ఎప్పుడో 2010లో జరిగిందేం గుర్తుకు వస్తుంది? పాకిస్థాన్ నుంచి భారత దేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ 2010లో ముగ్గురు పౌరులను రఫియాబాద్‌లో భారత సైన్యం కాల్చి చంపింది. చొరబాటుదారులను కాల్చిచంపినందుకు తమకు రివార్డులు ఇవ్వాలని ముగ్గురు సిపాయిలు కోరగా, ఈ సంఘటనపై విచారించిన భద్రతా దళాల ట్రిబ్యునల్ 2017లో అయిదుగురు సైనికులకు జీవిత ఖైదు విధించింది.

ఈ సంఘటనతో కశ్మీర్‌లో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. కశ్మీర్‌లో కోటి 40 లక్షల మంది పౌరులకు గాను పది లక్షల సైన్యం మోహరించింది. ఈ ఆందోళనతో మరింత సైనిక హింస పెరిగి సెప్టెంబర్ నాటికి మరింత మంది ప్రజలు సమీకృతులయ్యారు.ఫలితంగా అదొక ప్రజా ఉద్యమంలా తయారైంది. ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అక్టోబర్ 21న బహిరంగ సభ జరిగింది. అరుంధతీ రాయ్ 2008లో కశ్మీర్ వెళ్ళారు. కశ్మీర్‌లో తీవ్రమైన హింస, ప్రజా ప్రదర్శనలు ఎక్కువయ్యేసరికి 1997 నుంచి కశ్మీర్‌లో ఉండడం సాధ్యం కాలేదు. శ్రీనగర్‌లో సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆ సమయంలో అరుంధతీ రాయ్ కాకతాళీయంగా అక్కడే ఉన్నారు. ఔట్ లుక్‌లో రాయ్ వ్యాసం రాస్తూ ‘నగరం చిరునవ్వుల ప్రవాహంలా ఉంది. గాలిలో పారవశ్యం కనిపిస్తోంది. పడవల యజమానులు, వ్యాపారులు, విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు ఒకరేమిటి అందరి చేతిలో బ్యానర్లున్నాయి. ‘మేమంతా ఖైదీలం, మమ్మల్ని విడుదల చేయండి’ అని వారిలో ఒకరు అన్నారు’ అని రాశారు.

తెహరీ ఏ హురియత్ నాయకుడు సయ్యద్ ఆలి షా జిలానితో పాటు అరుంధతీరాయ్ కూడా ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు. ఆ ఉద్యమానికున్న మత స్వభావం తనకెంత ఇబ్బందికలిగించిందో కూడా రాశారు. తమ సమాజాన్ని మిలిటరీకరించడాన్ని ప్రజలు అప్పటికప్పుడు వ్యతిరేకించడం పట్ల ఆమె వారికి మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో 2010 అక్టోబర్ 21న జరిగిన సభలో గిలానితో అరుంధతీ రాయ్ చేతులుకలిపారని ప్రపంచం భావించింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆ సదస్సు నిర్వహించారు. ‘ఆజాదీ ద ఓన్లీ వే’ (స్వాతంత్య్రమే ఏకైక మార్గం’ అని పోడియం వద్ద బ్యానర్ కట్టారు. విద్యారంగం పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో విద్యార్థులు 2016లో చేసిన ఆందోళన జరిగినప్పటి నుంచి ‘ఆజాదీ’ అన్నపదం అనేక గందరగోళాలకు దారి తీసింది.

‘ఆజాదీ’ అంటే స్వాతంత్య్రం. జాతీయోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ పదాన్ని ఉపయోగించారు. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా స్త్రీవాదులు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. హిందుత్వవాది, కశ్మీరి పండిట్ కుటుంబం నుంచి వచ్చిన సుశీల్ పండిట్ ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో అరుంధతీ రాయ్‌పై కేసు పెట్టారు. దేశద్రోహ నేరం కింద (ఐపిసిలోని 124ఎ), ‘ఉపా’ లోని విద్వేష ప్రసంగాలపైన ఇతర సెక్షన్లపైన ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అరుంధతీ రాయ్ వెనక్కి తగ్గలేదు. పండిట్ ఇచ్చిన ఫిర్యాదుపైన పదమూడేళ్ళ వరకు ఏమీ జరగలేదు.

నర్మదా ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన ఆదివాసీలు, దళితులు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందనవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి వీరికి సబ్సిడీ ధరకు విద్యుత్ సరఫరా చేయాలి. పేదలు తుడిచిపెట్టుకుపోయారు.యాభై లక్షల మంది ప్రజలు అదృశ్యమవడానికి కారణమైన నిర్లక్ష్యాన్ని, కర్మను కానీ గుర్తించకూడదా అని అరుంధతీ రాయ్ రాశారు. మనకు మనం భ్రాంతిలోకి జారిపోయేలా చేయకూడదు. ఇక్కడొక పద్ధతి ఉంది, కచ్చితంగా అది నూటికి నూరుపాళ్ళూ మానవ తప్పిదమే. రాజ్యం తన స్వప్రయోజనాల కోసం సమర్థవంతంగా ఉపయోగించే పద్ధతి.

గుజరాత్‌కు చెందిన గౌతవ్‌ు ఆదానీ కోసం సమీకరించడానికి, 2014లో నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయడానికి ప్రతిభ ఉపయోగపడుతోంది. మేధాపట్కర్, అరుంధతీ రాయ్ పేదల కోసం గొంతెత్తితే, గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త సక్సేనా కార్పొరేట్ రంగం గొంతు వినిపించే వీరుడిగా 1991లో పౌర హక్కుల జాతీయ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. సక్సేనాకు అయిష్టమైన మేధాపట్కర్ తన ఆందోళనతో భారతీయ వర్గాల్లో బాగా ప్రసిద్ధురాలయ్యారు. తన ఆందోళనతో నర్మదా ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు సమీక్షించే స్థాయికి తీసుకెళ్ళారు. సక్సేనా 2002 ఏప్రిల్ 10వ తేదీన బిజెపికి చెందిన అమిత్ పి.షా, అమిత్ బి.ఠాకూర్, కాంగ్రెస్‌కు చెందిన రోహిన్ ఎన్.పటేల్‌ను తీసుకుని గాంధీజీ సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళారు.

ముస్లింలకు వ్యతిరేకంగా 2002లో జరిగిన హింసపై శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమానికి ఊపు తీసుకు రావడానికి మేధాపట్కర్ అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో మేధాపట్కర్‌పై సక్సేనా భౌతికంగా దాడి చేసినట్టు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ మధ్య కాలంలో బిజెపితో పాటు సక్సేనా కూడా రాజకీయంగా ఎదిగి ఆ ఎఫ్‌ఐఆర్‌పై ప్రభావం చూపగలిగే స్థాయికి చేరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2002 మే లో సక్సేనాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. ఆ సమయంలో సక్సేనా మేధాపట్కర్‌పైన చేసిన దాడి గురించి ఆవ్‌ుఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ లేవనెత్తారు.ఫలితంగా పురకాయస్థ, చక్రవర్తి అరెస్టయిన మరుసటి రోజే సంజయ్ సింగ్‌ని లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేశారు. లెప్టినెంట్ గవర్నర్‌గా రాష్ర్టపతి తనను నియమించారని తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా సక్సేనా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏడాది తరువాత గుజరాత్ హైకోర్టు ఈ కేసులో స్టే విధించింది.

మేధాపట్కర్‌కు సన్నిహితురాలైన అరుంధతీరాయ్‌పైన పండిట్ పెట్టిన పాత ఎఫ్‌ఐఆర్‌ను సక్సేనా ముందుకు తెచ్చారు. అరుంధతీరాయ్‌కు 2023 సెప్టెంబర్ 12వ తేదీన ‘యూరోపియన్ యస్సే’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “కార్పొరేట్ అడ్వర్‌టైజ్ మెంట్లతో బతికే ప్రధాన పత్రికా స్రవంతి ఈ వ్యాసాన్ని ప్రచురించడం ఊహాతీతం. గడిచిన ఇరవై ఏళ్ళుగా భారత దేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేని సమాజాన్ని తీసుకు రావడానికి స్వేచ్ఛా విపణి, ఫాసిజం, స్వతంత్రంగా ఉందని చెప్పుకుంటున్న పత్రికారంగం కలిసి బృందనాట్యం చేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. పురకాయస్థ, చక్రవర్తిల అరెస్టు, అరుంధతీ రాయ్, హుస్సేన్‌లపై కేసులు ‘ప్రజాస్వామ్య విధ్వంసంలో భాగం’ గానే జరుగుతున్నాయి. ‘స్వర్గంలో ఉన్న చిన్న దేవత’ పలికిన వణుకు పుట్టించే మాటలను వినడానికి 1999లో అరుంధతీ రాయ్ ప్రయత్నించారు. ఆ దేవత భారత దేశంపై ఇప్పుడు కళ్ళు తెరవాలి.

రాఘవశర్మ- 9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News