Sunday, April 28, 2024

ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

1895లో స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1901 నుంచి ప్రతి ఏట్ భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), వైద్యశాస్త్రం (మెడిసిన్, సాహిత్యం (లిటరేచర్), శాంతి (పీస్) అనబడే ఐదు రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అత్యున్నత నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. 1969 నుంచి నోబెల్ గౌరవార్థం బ్యాంక్ ఆఫ్ స్వీడెన్ సౌజన్యంతో ఆర్థికశాస్త్రం (ఎకనమిక్స్)లో కూడా నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నారు.

1901 నుంచి 2022 వరకు 615 అవార్డులను 989 మందికి నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు. అత్యంత ఖ్యాతితో పాటు నగదు పారితోషికం కూడా లభించే నోబెల్ పురస్కారాలకు అత్యధిక ప్రాధాన్యం ఉన్నది. భౌతిక, రసాయన, ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతులను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌వారు అందజేస్తారు. వైద్యశాస్త్ర నోబెల్ పురస్కారాన్ని కరోలిస్కా ఇనిస్టిట్యూట్ ప్రదానం చేస్తుంది. సాహిత్యానికి స్రీడిష్ అకాడమీ, శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ అందజేస్తారు. సి వి రామన్ (ఫిజిక్స్), రవింద్రనాథ్ టాగూర్(లిటరేచర్), అమర్త్యసేన్ (ఎకనమిక్స్), హర్ గోవింద్ ఖురానా (మెడిసిన్), అభిజిత్ బెనర్జీ (ఎకనమిక్స్), కైలాస్ సత్యార్థి (శాంతి), మదర్ థెరిసా (శాంతి), సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (ఫిజిక్స్), వెంకట రామకృష్ణన్ (కెమిస్ట్రి) లాంటి భారత దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అందుకున్నారు.

నోబెల్ వైద్యశాస్త్ర పురస్కారం
ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసి కోట్ల ప్రాణాలను తీసిన కొవిడ్- 19కు విరుగుడుగా ‘మాడిఫైడ్ ఎం-ఆర్‌ఎన్‌ఎ వ్యాక్సీన్’ రూపొందించడానికి ఉపయుక్తమయ్యే ప్రతిపాదించిన్ పరిశోధనల ప్రాధాన్యాన్ని గుర్తించిన నోబెల్ బహుమతి ఎంపిక కమిటీ అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రజ్ఞులు హంగేరా సంతతికి చెందిన కరీకో, అమెరికాలోకి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వీస్‌మాన్ ద్వయానికి ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించడం సమర్థనీయం, అభినందనీయం. వీరి పరిశోధనల కృషితోనే ఫైజర్, మడెర్నా సంస్థలు కొవిడ్ -19 టీకాలను తయారు చేయడం మనకు తెలుసు.

నోబెల్ భౌతికశాస్త్ర పురస్కారం
పరమాణువులోని మౌలిక రుణావేశ కణమైన ఎలక్ట్రాన్ కదలికలపై చేసిన పరిశోధనలకు మెచ్చి ఈ ఏడాది నోబెల్ బహుమతి అమెరికాలోని ఓహాయో యూనివర్సిటీకి చెందిన మహిళా శాస్త్రవేత్త ఫ్రొఫెసర్ ‘పి. ఆర్. అగోస్తీ’, జర్మనీలోని లుడ్‌విగ్ మ్యాక్స్‌మిలియన్ యూనివర్సిటీకి చెందిన ఫ్రొఫెసర్ ‘ఫెరెంక్ క్రౌజ్’, స్వీడన్‌లోని లండన్ యూనివర్సిటీకి చెందిన మహిళ ఫ్రొఫెసర్ ‘యాన్ ఎల్ హ్యులియర్’ త్రయాన్ని ఎంపిక చేశారు. వేగవంతమైన ఎలక్ట్రాన్ కదలికల్ని, వాటి శక్తిలో వచ్చే మార్పులను కొలవడానికి ఉపయుక్తమైన స్వల్పస్థాయి కాంతి తరంగాలను సృష్టించడానికి మార్గాన్ని కనుగొన్నందులకు రాబోయే రోజుల్లో క్యాన్సర్ లాంటి వ్యాధి నిర్ధారణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు మాత్రమే కాకుండా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాలను రూపొందించడానికి కూడా మార్గం సుగమం అయిందని నోబెల్ బహుమతి ఎంపిక కమిటీ భావించింది.

నోబెల్ రసాయనశాస్త్ర పురస్కారం
వైద్య సాంకేతిక రంగాల్లో ఉపయోగిస్తున్న ‘క్వాంటం డాట్’ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రజ్ఞులను ఈ ఏడాది రసాయశాస్త్ర రంగంలో నోబెల్ బహుమతి వరించింది. మెడికల్ ఇమేజింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుల త్రయం మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ‘మింగి బవెండి’, న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ‘లూయిస్ బ్రస్’, నానోక్రిస్టల్ టెక్నాలజీ కంపెనీలో పరిశోధనలు చేస్తున్న ‘అలెక్సా ఎకిమోవ్’లను రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.

నోబెల్ సాహిత్య పురస్కారం
నార్వే దేశానికి చెందిన 64 ఏండ్ల జోన్ ఫాసే సాహిత్య సృజనకు మెచ్చి నోబెల్ సాహిత్య పురస్కారం పులకించిపోయింది. నాటకాలతో పాటు పాఠకులను పరవశింపజేసే విశిష్ట వచనశైలిలో సిద్ధహస్తుడికి నోబెల్ వరించడం సముచితంగా ఉంది. ఆధునిక డిజిటల్ యుగపు మానవుడిలో గూడుకట్టుకున్న అభద్రతా భావనలు, అనవసర అపార్థాలను బలంగా వ్యక్తీకరించడంలో నిష్ణాతుడు జోన్ పాసే ఇప్పటి వరకు 40 నాటకాలు, కవితలు, నవలలు, వ్యాసా లు, బాలల పుస్తకాలు, కథానికలు లాంటి రచనలు చేసిన ఫాసే కలానికి సాహిత్య సలామ్‌లు తెలుపుదాం.

నోబెల్ శాంతి పురస్కారం
మహిళల స్వేచ్ఛకు ఉక్కు సంసెళ్లు వేస్తున్న సమాజాన్ని గర్హిస్తూ, తన అకుంఠిత దీక్షాదక్షతతో తుంచేయడానికి నడుం బిగించి, గళమెత్తి, జీవితాన్ని ధారపోసి, ఛాందస సంప్రదాయాలను వ్యతిరేకించి, జైలు పాలైన ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ధీర వనిత నార్గీస్ ముహమ్మదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం హర్షదాయకం. మానవ హక్కుల గళాలకు సెంకెళ్లు వేస్తున్న అధికారుల అకృత్యాలను ప్రశ్నిస్తూ 13 సార్లు అరెస్టు కావడంతో పాటు అమానవీయంగా 154 కొరడా దెబ్బలు తిని, 31 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తూ కారాగారంలోనే ఉన్నారు ధీర వనిత నార్గీస్ ముహమ్మదీ. మహిళలపై లైంకిగ వేధింపులు, అక్రమ నిర్భంధాలను వ్యతిరేకిస్తూ తన మద్దతుదారులతో ఎడతెగని పోరు చేస్తున్న నార్గీస్ ఉద్యమానికి మనం కూడా చేయూత నిద్దాం. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి అందిన 351 నామినేషన్లలో నార్గీస్ మాత్రమే ఎంపిక కావడం ముదావహం.

నోబెల్ ఆర్థికశాస్త్ర పురస్కారం
అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన క్లాడియా గోల్డిన్ అనే మహిళా ఎకనమిక్స్ ప్రొఫెసర్‌కు ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడీస్ అకాడమీ అఫ్ సైన్సెస్ ప్రకటించింది. మహిళా లేబర్ మార్కెట్ సరళి పట్ల విశేష కృషి చేసిన క్లాడియా గోల్డిన్‌ను నోబెల్ స్మారక స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్‌‌కు ఎంపిక చేసారు. నోబెల్ ఎకనమిక్స్ బహుమతి పొంది మూడో మహిళగా గోల్డిన్ చేసిన పరిశోధనల్లో కార్మిక వ్యవస్థలో మహిళల పట్ల జరుగుతున్న తీవ్ర వివక్ష విశ్లేషణలను శాస్త్రీయంగా వివరించింది.

శతాబ్ద కాలంగా మహిళల పట్ల చూపుతున్న వేతన వ్యత్యాసాలు, ఉపాధి కల్పనలో చిన్నచూపు లాంటి ప్రధాన అంశాల పునాదిగా పరిశోధనలు చేసిన గోల్డిన్‌కు అభినందనలు చెబుదాం. ప్రతి ఏట ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ బహుమతుల వివరాలను తెలుసుకోవడానికి విద్యావంతులు ఉత్సుకతలో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు పొందిన ప్రపంచ అత్యున్నత శాస్త్రజ్ఞులకు అభినందనలను తెలియజేద్దాం. వీరు చేసిన పరిశోధనలు ప్రపంచ మానవాళి జీవన ప్రమాణాలు పెరగడానికి, సుఖజీవనానికి ఉపయుక్త మార్గాలను చూపాలని కోరుకుందాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి- 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News