Sunday, April 28, 2024

హరిత దీపావళి జరుపుకుందాం

- Advertisement -
- Advertisement -

భూమిపై సమస్త జీవరాశి బతకడానికి కీలక భూమిక పోషిస్తున్న గాలి నేడు అనేక రూపాలలో కలుషితమై జీవజాతి మనుగడకు పెనుశాపంగా మారుతున్నది. అభివృద్ధి పేరుతో ప్రకృతి సహజ వాతావరణంపై మానవ ప్రమేయం రోజురోజుకీ మితిమీరిపోతున్న తరుణంలో వాతావరణ కాలుష్యం పెరిగి స్వచ్ఛమైన గాలి అనేది కరువైపోతుంది. అంతేకాకుండా మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా భారతతో సహా ప్రపంచ దేశాలలో వాయు కాలుష్యం తీరును పరిశీలిస్తే పరిశ్రమలు, మోటార్ వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం,పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలలో పెరిగిపోతున్న టపాసులు వాడకం లాంటి కారణాల వలన సూక్ష్మాతి రేణువులు గాలిలోకి చేరి గాలి కాలుష్యానికి గురికావడం జరుగుతుంది. వాతావరణంలో గాలి కాలుష్యాన్ని లెక్కించాలంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ‘గాలి నాణ్యత సూచీ’ (ఎక్యుఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఆధారంగా లెక్కిస్తారు.

కాలుష్యం వల్ల గాలిలోకి నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్, అమ్మోనియం, సీసం వంటి విషవాయువులు విడుదలవుతున్నా యి. అంతేకాకుండా గాలిలో తేలియాడే అతి సూక్ష్మరేణువులు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. గాలిలోని సూక్ష్మాతి రేణువులు మానవ, జంతు ఊపిరి తిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, గర్భిణీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపడం , గుండె జబ్బులు సంభవించడం లాంటి సమస్యలకు దారితీస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి’ గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.
భారత్‌లోని వాయు కాలుష్య ప్రమాద ముప్పును గురించి జాతీయ, అంతర్జాతీయ సర్వేలు పలు ఆసక్తికరమైన నిజాలు బయట పెట్టడం జరిగింది. గతంలో ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం వలన దేశంలో ఏటా దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొనడం జరిగింది.

హెల్త్ ఎఫెక్ట్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఇఐ) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ సంస్థ- 2023 విడుదల చేసిన తాజా నివేదికలో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ప్రపంచంలోనే టాప్ 20 నగరాల జాబితాలో భారత్ నుంచే మూడు అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేరాయి. ఇందులో ఢిల్లీ, కలకత్తా తర్వాత ముంబై నగరాలు ఉన్నాయి. గడిచిన దశాబ్ద కాలం నుండి పలు నివేదికల ఆధారంగా మన దేశంలో పంట అవశేషాలు , బాణసంచా కాల్చడం లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన, పరిశోధన వ్యవస్థ (ఎస్‌ఎఎఫ్‌ఎఆర్ system of air quality and weath er forecasting and research)’ అధ్యయనం ప్రకారం శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ ప్రమాద స్థితిలోకి వెళుతున్నదని పేర్కొన్నది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 నుంచి 500 శాతానికి చేరుకున్నది.

కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోం ది. వాహన కాలుష్యాన్ని తగ్గించాలని సరి, బేసి విధానం పాటిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. మరోవైపు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు దేశ రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించాలని ఆలోచన చేస్తుంది. గాలి కాలుష్యాన్ని అరికట్టపోతే భవిష్యత్తులో ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది.
వాస్తవానికి గాలి నాణ్యత సూచీ (ఎక్యుఐ) 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమై గాలిగా పరిగణించడం జరుగుతుంది. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ రోజురోజుకూ దిగజారుతున్నది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడానికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబాదులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. అదే విధంగా ‘జాతీయ హరిత ట్రిబ్యునల్’ 2019 లో ఉత్తర భారత దేశంలోని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయ అవశేషాలను కాల్చడం వలన గాలి నాణ్యత దెబ్బతిని అనేక మంది ప్రాణాలను వాయు కాలుష్యం హరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ నివారణకై తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయా రాష్ట్రాలను సూచించడం జరిగింది.

ప్రస్తుతం మన దేశంలో వాయు కాలుష్యం అనే ఘోరకలి తీవ్ర రూపం దాల్చుతున్న వేళ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం వుంది. భారత్ దేశంలో కార్చిచ్చు, అగ్నిపర్వతాలు పేలడం లాంటి ప్రమాదాల తీవ్రత లేనప్పటికీ మానవ తప్పిదాల వలన జరుగు వాయు కాలుష్య తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్నది. కావున వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా శిలాజ ఇంధనాల స్థానంలో హరిత ఇంధనాల వినియోగాన్ని పెంచాలి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి, జనావాసాలకు దూరంగా పరిశ్రమలను నెలకొల్పాలి, ఉత్తర భారత దేశంలోని వ్యవసాయ అవశేషాలను జీవ ఇంధనాల తయారీకి వినియోగించాలి. చెట్లను విరివిరిగా పెంచుతూ వనీకరణ కార్యక్రమాలు చేపట్టాలి. జనావాసాలకు దూరం గా గనుల తవ్వకాలను పర్యావరణం ప్రభావ అంచనా (ఇఐఎ) ఆధారంగా చేపట్టాలి. వివిధ పండగలలో, ఆనందోత్సవాలలో పర్యావరణహిత బాణసంచాను వాడాలి.

రసాయనాలతో తయారు చేసిన టపాసులు స్థానంలో పర్యావరణహిత బాణ సంచాను వాడాలి. దీపావళి పండుగ రోజున సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు కూడా ఎప్పటికప్పుడు వాయు కాలుష్యంపై తగు చర్యలు చేపట్టాలి. అప్పుడే స్వచ్ఛమైన ప్రాణ వాయువు ప్రతి ఒక్కరూ పీల్చుకొని ఆరోగ్యంగా జీవిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News