Thursday, May 2, 2024

కృష్ణ, గోదావరి బోర్డులతో నేడు కేంద్రం భేటీ

- Advertisement -
- Advertisement -

Center is scheduled to meet Krishna and Godavari boards today

ఢిల్లీకి రెండు బోర్డుల చైర్మన్లు
గెజిట్ అమలుపైనే ప్రధాన చర్చ

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణాగోదావరి నదీయాజమాన్య బోర్డులతో కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి కృష్ణాబోర్డు ఛైర్మన్ ఎం.పి.సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరు కానున్నారు. కృష్ణా,గోదావరి బోర్డులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రాజెక్టుల పరిధి ,వాటిపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ,అభ్యంతరాలు , సవరణలు తదితర అంశాలతోపాటు, కృష్ణా,గోదావరి నదులపై నిర్మించిన , నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వాటికి అనుమతులు తదితర అంశాలపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఈ ఏడాది జులై 15న కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నోటిఫికేషన్ అమలుకు ముందు పూర్తి చేయాల్సినపలు కీలకమైన పనులకు సమయం సరిపోదని, మరికొంత గడువు అవసరం అని రెండు రాష్ట్రాలు ఇటీవల జరిగిన కృష్టా,గోదారి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల సమావేశాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించాయి.

అంతేకాకుండా ఢీల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు కూడా ఇదే అంశాలపై లేఖ ద్వారా విన్నవించాయి. కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులకు వచ్చే నెల 14లోపు అనుమతులు పొందాలని, లేకుంటే వాటిని నిలిపివేయాలని గెజిట్‌లో పెట్టిన నిబంధనల పట్ల రెండు రాష్ట్రాల అభ్యంతరాలు తెలుపుతూ ఇందుకోసం మరికొంత గడువు ఇవ్వాలని కోరాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సిఎం కెసిఆర్ ఇదే అంశంపై కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కూడా స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కూడా అవసరమైనంత మంది సిబ్బంందిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

బోర్డుల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా ఒక్కో బోర్డుకు ఒకేసారి రూ.200కోట్లు డిపాజిట్ చేయాలనటం కూడా సరికాదిని ఈ విషయంలో కొంత సౌలభ్యత కల్పించాలని సిఎం కేసిఆర్ కేంద్రానికి సూచించారు. ఈ నేపధ్యంలో సోమవారం రెండు బోర్డుల చైర్మన్లతో జరగనున్న సమావేశంలో కేంద్రం అన్ని అంశాలను సమగ్రంగా చర్చించనుంది. తెలంగాణ , ఎపి రాష్ట్రాలనుంచి వ్యక్తమైన అభిప్రాయాలు , వాటి సాధ్యాలు కూడా సమావేశంలో చర్చించి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్ల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను మరోమారు రాష్ట్రాలకు తెలియపరిచి తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News