Sunday, April 28, 2024

సెంట్రల్ విస్తా వాస్తవాలు!

- Advertisement -
- Advertisement -

Central Vista was launched in 1931 by Viceroy Irwin

 

హిట్లర్ బెర్లిన్ కొత్త రాజధాని జర్మేనియాలో ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. దాని వాస్తుశిల్పి అల్బర్ట్ స్పీర్. ఈ పథకం పారలే. మోడీ కొత్త సెంట్రల్ విస్తా పథకం వేశారు. బిమన్ పటేల్ వాస్తుశిల్పి. బ్రిటిష్ వాస్తు రూపశిల్పి ఎడ్విన్ లత్యేన్స్ (Lutyens), వాస్తుశిల్పి హర్బర్ట్ బేకర్ సెంట్రల్ విస్తాతో సహా కొత్త ఢిల్లీని నిర్మించారు. కొత్త ఢిల్లీని లత్యేన్స్ ఢిల్లీ అంటారు. 1920లో మొదలైన సెంట్రల్ విస్తాను 1929కి పూర్తయి 1931లో వైస్రాయ్ ఇర్విన్ ప్రారంభించారు. జాత్యహంకారుల ఈ నిర్మాణం భారతీయతలో కలిసింది. దీని పక్కలో భారతీయతను హిందుత్వతో గజిబిజి చేసిన ఆర్య సంస్కృతి జాతీయవాదుల భవనం సంఘ్ సౌధం రాబోతోంది.

రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు 3 కి.మీ. పొడవు 1,100 ఎకరాల చారిత్రక ప్రదేశమే సెంట్రల్ విస్తా. 2019 సెప్టెంబర్‌లో మోడీ ప్రభుత్వం ఈ ప్రదేశంలో నూతన భవనాల పథకం ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కన త్రికోణ ఆకారంలో కొత్త భవన సముదాయం నిర్మిస్తారు. రేఖాగణితంలో త్రికోణం హిందుత్వ పవిత్ర చిహ్నం. ఇక్కడ ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతుల భవంతులు, మంత్రుల కార్యాలయాల కోసం బహుళ అంతస్థుల 10 ఆధునిక భవనాలు నిర్మిస్తారు. సుప్రీంకోర్టు షరతులతో డిసెంబర్ 10న ప్రధాని సంఘ్ సౌధ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత ప్రాచీన ప్రజాస్వామ్య సంప్రదాయాలను, ప్రజాస్వామ్య సిద్ధాం తం, ఆచరణల్లో విశ్వాసాలను వక్కాణించారు. స్వతంత్ర, ఆత్మనిర్భర్ భారత ప్రజాస్వామ్యానికి కొత్త పార్లమెంటు సంకేతమన్నారు.

ట్రంప్ అమెరికా ముందు అన్నట్లు ‘భారత్ ముందు’ ప్రమాణం చేయమని ప్రజలను కోరారు. ఈ మాయ మాటలు మోడీ చీకటి కోణాలను, పారదర్శక లోపాలను దాచలేకపోయాయి. ప్రజలతో చర్చించకనే వారి అవసరాల నిర్ణయంలో, వాటి అమలులో ఈ ప్రభుత్వ ఏకపక్ష తత్వాన్ని బయటపెట్టాయి. మోడీ ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ఏకపక్షమే. పార్లమెంటులో చట్టాలపై చర్చలు, సెలెక్టు కమిటీలు లేవు. ప్రజాస్వామ్యంలో ఉద్దేశం, ఆచరణల మధ్య సుస్పష్ట వైఖరి ఉంటుంది. నియంతృత్వంలో ఆచరణ అతిక్రమించబడుతుంది. తమ ఉద్దేశాలు నెరవేర్చుకోడానికి పాలక వర్గం ఎదురు లేకుండా దూసుకుపోతుంది. అప్రజాస్వామిక రాజకీయాలు, నిర్ణయాలు త్వరగా జరుగుతున్నాయన్న భ్రమలు కల్పిస్తాయి. ప్రజాస్వామ్య పునాదులు బీటలు వారుతాయి.
మోడీకి, ఆర్.ఎస్.ఎస్. (సంఘ్)కు తమ సాంస్కృతిక వారసత్వ కట్టడాలను చరిత్రలో నిలపడం ప్రతిష్ఠాత్మక, హిందుత్వ అవసరం. సెంట్రల్ విస్తా నూతన భవన సముదాయంపై జాతీయ చిహ్నం ఉంటుంది.

లోక్‌సభ అంతర్భాగంలో జాతీయ పక్షి నెమలి, రాజ్యసభ లోపల జాతీయ పుష్పం (బిజెపి ఎన్నికల గుర్తు) కమలం ఉంటాయి. సుప్రీంకోర్టులో ఎన్ని ఫిర్యాదులున్నా 2022 మార్చిలోపు ఈ నిర్మాణం పూర్తి చేయాలన్న మహత్వోన్మాదం మోడీ తలకెక్కింది. భారత స్వాతంత్య్ర 75 ఏళ్ళ వేడుకలో ఈ ఘనత ప్రకటించాలి. 2024 ఎన్నికల్లో (అధ్యక్ష ప్రజాస్వామ్య రాష్ట్రపతిగా) మోడీ విజయం సాధించాలి. సంఘ్‌కు ఇది శత వసంతాల కానుక. ఇది మోడీ కల అని పట్టణ వ్యవహారాల మంత్రి హరదీప్ పురి ప్రకటించారు. భారత భవిష్యత్తు పథక రచనలో మోడీ ప్రతిపక్షాలను సంప్రదించరు. విస్తా ప్రాజెక్టు మోడీ రహస్య అజెండా. సంఘ్ సాంస్కృతిక కోరిక. ప్రజల, దేశ అవసరం కాదు.

2012లో భారత ప్రభుత్వం సెంట్రల్ విస్తాతో పాటు ఢిల్లీని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. 2015లో మోడీ ప్రభుత్వం ఈ అభ్యర్థనను ఉపసంహరించుకుంది. తమ సెంట్రల్ విస్తా రహస్య పథకానికి ఇది నాంది. పార్లమెంటులో సెంట్రల్ విస్తాపై చర్చ జరగలేదు. 1957 ఢిల్లీ అభివృద్ధి చట్టంతో సహా అనేక వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక పరిరక్షణ చట్టాలను పట్టించుకో లేదు. సంయుక్త సంస్కృతి, వారసత్వాల సంరక్షణ భారత పౌరుల విధి అన్న రాజ్యాంగ అధికరణ 51-ఎ(ఎఫ్)ను, జీవించే హక్కు (అధికరణ 21)ను ఉల్లంఘించారు. సంస్కృతి, వారసత్వాల సంపూర్ణ సంరక్షణ జీవిత భాగాలని, జీవించే హక్కు పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు గుర్తించింది. జాతీయ ప్రాముఖ్యత ప్రదేశాలను రాజ్యం రక్షించాలన్న అధికరణ 49 కూడా ఉల్లంఘించబడింది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ ప్రాజెక్టును ఆపమని 60 మంది విశ్రాంత పౌర అధికారులు ప్రధానికి ఉత్తరం రాశారు.

2017 సాధారణ ఆర్థిక నియమాల ప్రకారం దేశ సంపద నిర్మాణ, పునర్నిర్మాణ, అభివృద్ధి పథకాల కోసం పోటీ టెండర్లు పిలవాలి. ఆ పథక అధ్యయనాల వివరాలు ప్రజా పరిధిలో ఉంచాలి. పోటీ టెండర్ల నిర్వహణ, నిర్ణయాలకు న్యాయ సంఘాన్ని ప్రకటించాలి. సెంట్రల్ విస్తాలో ఇవేమీ జరగలేదు. టెండర్లు రహస్యంగా జరిగాయి. వచ్చిన 7 టెండర్లలో ఆరింటిని సాకులతో నిరాకరించారు. టెండర్లలో 20% నిర్మాణానికి, 80% నైపుణ్యతకు కేటాయించారు. నైపుణ్యతను ప్రభుత్వమే (మోడీ యే) నిర్ణయిస్తుంది. వాస్తుశిల్ప మండలి సూత్రాలకూ తిలోదకాలిచ్చారు. పోటీ టెండర్‌లు పిలవకుండా ఆదేశక ఆమోదంతో కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ ప్రదేశ తార్కిక యజమానులైన ప్రజలను మోసం చేశారు. గుజరాత్ హెచ్.సి.పి. డిజైన్, ప్లానింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంఘ్ సౌధానికి ప్రణాళిక తయారు చేసింది. మోడీతో సన్నిహిత సంబంధాలున్న దీని యజమాని బిమల్ పటేల్‌కు ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.

ఈ కంపెనీ సబర్మతి ప్రాజెక్టు, కాశీ ఆలయాలు, గుజరాత్ రాష్ట్ర కార్యాలయాలు, బిజెపి కేంద్ర కార్యాలయాలు నిర్మించింది. విస్తా నిర్మాణ ఖర్చు రూ.25,000 కోట్లు. 2024 నాటికి రూ.50,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఇష్టమొచ్చిన మార్పులు, చేర్పులు చేయడానికి హెచ్.సి.పి. డిజైన్ కు సర్వాధికారాలు ఇచ్చారు. ప్రభుత్వ నిర్మాణ, వాస్తుశిల్ప సంస్థలు ఇచ్చిన సలహాలను బుట్టదాఖలు చేశారు. పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టు టాటా ప్రాజెక్టుకు రూ.971 కోట్లకు ఇచ్చారు. ఈ కాంటాక్టులు పొందడానికి ఈ కంపెనీల సాంకేతిక సామర్థ్యాలు ఎవరికీ తెలియవు. నూతన భవన నిర్మాణానికి 80, 90 ఏళ్ల చెట్లు నరకాలి. నిర్మాణ ప్రతిపాదనల ఆమోదానికి నిర్మాణ నిపుణులు, రూప శిల్పులు, పర్యావరణ వేత్తలు, భూగర్భ శాస్త్రజ్ఞులు, పట్టణ ప్రణాళికా శాఖను సంప్రదించ లేదు. మొత్తం భవన సముదాయానికి కాక ఒక్కొక్క భవనానికి విడివిడిగా పర్యావరణ అనుమతులు అడిగారు. వారసత్వ సంప్రదాయ పరిరక్షణ కమిటీ అనుమతి అడగనే లేదు.

నేటి ఆర్థిక మాంద్యంలో ఈ నిర్మాణం అవసరమా? ఇది నిరుద్యోగ సమస్యను తీరుస్తుందని, ఆర్థిక కార్యక్రమాలు పెంచుతుందని మంత్రి పురి సమర్థన జవాబు. ఈలోపే శబ్ద నియంత్రణ గోడలు కట్టడానికి పార్లమెంటు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్రాన్ని జనపథ హోటల్‌కు మార్చుతున్నారు. భవిష్యత్తులో గాంధీ బొమ్మ, కళా కేంద్రం కన్పించవు.

మోడీ భారతం సంస్కృతి, సామాజిక అంశాల్లో విలువలను ప్రతిబింబించాలి. ప్రభుత్వం ప్రజల ఆస్తుల కాపలాదారు మాత్రమే. ప్రజల (పార్లమెంటు) అనుమతి లేకుండా ఈ రాజ్యాంగ నియమ అతిక్రమణ హక్కు ప్రభుత్వానికి లేదు. ఇది సామాజిక, ప్రజాస్వామ్య ఆరోగ్యాలను దెబ్బ తీస్తుంది. పాలక, పాలిత బంధం తెగుతుంది. ప్రజా ప్రయోజకులపై కోర్టు ధిక్కార నేరాలు మోపే కోర్టులు ఆ నేరానికి బహిరంగంగా పాల్పడుతున్న పాలకులను సరిదిద్దాలి. అవినీతి, అన్యాయ, అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ అతిశయ పథకాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి. రాజ్యాంగ విరుద్ధ ప్రజా వ్యతిరేక సాగు చట్టాల వ్యతిరేక రైతాంగ ఉద్యమం మార్గదర్శకం కావాలి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News