Sunday, May 5, 2024

చేదు వాస్తవాలు

- Advertisement -
- Advertisement -

Ghastly failure of Economic reforms is proving to be

 

అంకెల్లో, అంచనాల్లో కనిపించే దేశాభివృద్ధికి వాస్తవంలో జరుగుతున్న దానికి పొంతన ఉండకపోడం కొత్త కాదు. అది పర్వాలేదనిపించేటట్టు ఉండడం, పూడ్చలేని అఘాతాన్ని తలపించడం మధ్య తేడా ఉంది. మన దేశంలో అభివృద్ధి గురించి చేసే ప్రకటనలు, ప్రసంగాలకు వాస్తవ స్థితికి బోలెడంత వ్యత్యాసముండడమే మనకు తరచూ కనిపిస్తుంది. ఉన్నవారిది, లేని వారిది కలిపి సగటు తేల్చి తలసరి ఆదాయపు లెక్కను చూపిస్తారు. దానిని చూసి మురిసిపోడానికి లేదు. ప్రజల జీవన శైలిలో కనిపించే ఆధునికత వారి బతుకుల్లో ప్రతిబింబించదు. దేశం గేట్లు బార్లా తెరిచి ప్రపంచీకరణను అక్కున చేర్చుకొని ప్రజల సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకోడం ప్రారంభించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయింది. ఇప్పుడు నిజంగా మనం ఎక్కడున్నామో ఇటీవల పాక్షికంగా విడుదలైన ఐదవ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 5) తెలియజెప్పింది. 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వెల్లడైన ఈ నివేదికలో ఆందోళన చెందవలసిన చేదు వాస్తవాలు ఎక్కువగానూ, సంతోషించవలసినవి బహు తక్కువగానూ ఉన్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో అంటే కరోనా దేశాన్ని కరకరా నమిలి మింగడం మొదలుకాక ముందు ఈ సర్వే నిర్వహించారు. ఇందులోని ప్రతికూల సూచీలు కరోనా లాక్‌డౌన్ సంక్షోభంలో మరింత తీవ్రమై ఉండడానికే ఆస్కారముంది. మణిపూర్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలలో సైతం 20 ఏళ్ల లోపు వయసు గర్భవతుల సంఖ్య పెరగడం మహిళల వికాసాన్ని కోరుకునే సమాజం కలలో కూడా ఎదురు చూడ కూడని పరిణామం. దీర్ఘకాలం వామపక్ష పాలనలో ఉన్న త్రిపురలో ఈ వయసు గర్భవతులు 2015-16లో 18.8 శాతం మంది ఉండగా, 2019-20 నాటికి 21.9 శాతానికి పెరగడం విషాదకరం. ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు కూడా ఎక్కువయ్యాయని సర్వే చెబుతున్నది. ఆడ పిల్లలకు విద్యావికాసాలు కలిగించి వారు పురుషులతో సమానమైన అభివృద్ధి చూరగొనడానికి వీలుగా ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చి విద్యా వసతులు కల్పించి ఉద్యోగాలు కూడా ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోడానికి అవకాశమివ్వని బాధాకరమైన పరిస్థితి ఇది.

మొత్తమ్మీద మహిళలపై గృహ హింస తగ్గు ముఖం పడుతున్నదని సర్వే నిగ్గు తేల్చడం ఆహ్లాదకరమైన పరిణామమే. అయితే సిక్కిం, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, అసోం, కర్నాటక రాష్ట్రాలలో గృహ హింస పెరిగిందని, కర్నాటకలోనైతే నాలుగేళ్ల క్రితం 20.6 శాతంగా ఉన్న ఈ హింస 44.4 శాతానికి చేరుకున్నదని సర్వే వెల్లడించిన కఠోర వాస్తవం ఆందోళనకరమైనది. ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు కూడా పెరిగాయని తేలింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం చేయించుకుంటున్న మహిళలు అందుకోసం గతంలో కంటే బాగా ఎక్కువగా ఖర్చు చేయవలసి రావడమూ ఆవేదన కలిగించే అంశం. పేద, మధ్య తరగతి కుటుంబాల దురవస్థకు నిదర్శనం. గత సర్వే నాటితో పోలిస్తే ఈ ఖర్చు సిక్కింలో 109 శాతం, మిజోరంలో 63 శాతం, బీహార్‌లో 60 శాతం, అసోంలో 42 శాతం పెరిగింది. ఒక్క సిక్కింలో తప్పించి దేశమంతటా ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య పురుషుల కంటే చాలా తక్కువగా ఉంది.

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ఇంకా మహిళలే అత్యధికంగా చేయించుకుంటూ ఉండడం ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న పురుషుల సంఖ్య బహు స్వల్పంగా ఉండడం మన నత్త నడక అభివృద్ధిని అద్దం పట్టి చూపిస్తున్నది. బాల్య మరణాలు తగ్గినప్పటికీ ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లేమి, ఎత్తుకు, వయసుకు బరువు తక్కువ పిల్లలు అధికంగా ఉండడం సిగ్గుపడవలసిన విషయాలే. 17 రాష్ట్రాల్లో ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ దుస్థితి ఇంకా కొనసాగుతున్నది. పిల్లలు తగిన పోషకాహారాన్ని పొందలేకపోడం ఆహార కొరతను చాటుతుంది. సస్య విప్లవాలు, సంక్షేమ శకాల గాలిని తీసివేసే దుష్పరిణామమిది. కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వ సామర్థానికి మించి ఆహార ధాన్యాలు పోగులుపడి ఆరుబయట మేటలు వేసిన బస్తా లు వర్షానికి తడిసిపోయి చివరకు ఆహార సేకరణ వ్యవస్థనే రద్దు చేయాలన్న ఆలోచన వైపు కేంద్రం అడుగులు వేస్తుండగా దేశంలోని బాలలు పోషకాహార లేమితో తీసుకుపోతూ ఉండడం ఒక విచిత్ర విషాద స్థితి.

ఇటువంటి గణాంకాల్లోనే పాలకుల చిత్తశుద్ధిలేమి, ఆర్థిక సంస్కరణల ఘోర వైఫల్యం రుజువవుతుంది. సంక్షేమ పథకాలకు ఉరి బిగించి సంస్కరణల మీసాలు మెలివేయడం వల్ల దేశంలో సంపన్నులు మరింత ధనికులు అవుతూ పేదలు నిరుపేదరికంలోకి, కటిక దారిద్య్రంలోకి ఇంకా జారిపోతున్నారని, విద్య, ఆరోగ్య ఖర్చులు మితిమించిపోయి సాధారణ జనం వెనుకుబాటుతనంలో కూరుకుపోతున్నారని ఇంత స్పష్టంగా రుజువైన తర్వాతైనా పాలకులు తమ ప్రాధాన్య క్రమాన్ని సమీక్షించుకొని సవరించుకోవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News