Tuesday, May 21, 2024

నాగాలాండ్ కల్లోలిత రాష్ట్రమే : కేంద్రం వెల్లడి

- Advertisement -
- Advertisement -
Centre extends AFSPA in Nagaland
మరో ఆరునెలల పాటు ఎఎఫ్‌ఎస్‌పిఎ పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ఇటీవల వివాదాస్పదంగా మారిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) అమలును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా పేర్కొంటూ స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఈ చట్టం అమలును డిసెంబర్ 30 నుంచి ఆరు నెలల వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత పొడిగింపుతో రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ చట్టం అమలులో ఉంటుంది. డిసెంబర్ 4 న ఇక్కడి మోన్ జిల్లాలో భద్రతాబలగాల కాల్పుల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానికుల నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.

దీన్ని రద్దు చేయాలంటూ నాగాలాండ్ అసెంబ్లీ డిసెంబర్ 21న ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ వివాదాస్పద చట్టం పరిధిలోఈ రాష్ట్రం 1958 నుంచి కొనసాగుతోంది. ఇది 1942 నాటి బ్రిటిషర్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆర్డినెన్సు. ఈ చట్టం ఉపసంహరణను పరిశీలించడానికి కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ప్రకటించింది. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి , కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి పీయూష్ గోయెల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన మూడు రోజుల తరువాత ఈ చట్టం అమలును పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ను జారీ చేయడం గమనార్హం. చీఫ్ సెక్రటరీ, అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ నాగాలాండ్ , డైరెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. ఈ కమిటీ 45 రోజుల్లో తన నివేదికను సమర్పించ వలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News