Tuesday, April 30, 2024

విశాఖలో బాబు ‘నారా’జ్

- Advertisement -
- Advertisement -

Chandrababu

జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన
బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు
ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు
సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్
పోలీసులపై బెదిరింపులకు దిగిన వైనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పర్యటిస్తున్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విశాఖ పట్టణం ఎయిర్‌పోర్ట్ ఎదుట గురువారం నాడు ఊహించని పరిణామం ఎదురైంది. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వేలాది మంది ఆందోళన కారులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటన నిరసిస్తూ ఆందోళన చేపట్టడంతో పాటు ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో దాదాపు ఐదు గంటల పాటు వందలాదిమంది ప్రజలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌ను దిగ్బంధించి వాహనాన్ని అంగులం కూడా కదలకుండా చేశారు.

చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వారు చేసిన నినాదాలతో అక్కడి ప్రాంతం మారుమోగింది. చంద్రబాబు వెనక్కి వెళ్లాలని కాన్వాయ్ పైకిఎక్కి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దన్న చంద్రబాబు నాయుడు విశాఖకు ఎందుకు వచ్చారంటూ నిలదీయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో టిడిపి నేతలు అక్రమించిన భూములును, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆందోళన కారులు విమర్శించారు. మరో వైపువిశాఖ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తేలేదని పెద్ద ఎత్తున మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విశాఖకు జైకొడితేనే ఆయన కాన్వాయ్‌ను కదలనిస్తామని, లేకపోతే ఒక్క అంగులం కూడా ముందుకు వెళ్లనీయమని భీష్మించుకుని కూర్చున్నారు. తమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నచంద్రబాబుని, టిడిపి నేతలను విశాఖలో అడుగుపెట్టనీయమని ఆందోళన కారులు స్పష్టం చేశారు.

బాబు ఆగ్రహం ఆపై బెదిరింపులు…

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టిడిపి అధినేతతో సహా పార్టీనేతలంతా ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. దీంతో తీవ్ర ఆవేశం ప్రదర్శించిన చంద్రబాబు పోలీసులపైకి బెదిరింపులకు దిగారు. తమాషా చేస్తున్నారా అంటూ అక్కడున్న పోలీసులను పరుష పదజాలంతో దూషించారు. వారి సూచనలను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. నాకే సూచనలు చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన యాత్రను అడ్డుకుంటుంటే.. పోలీసులు దానికి వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు వినేందుకు విశాఖలో పర్యటించి తీరుతానని చంద్రబాబు ప్రకటించారు. “ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా?ఇందుకు పోలీసులు ఏం సమాధానం చెబుతారు?, ఎంత సమయమైనా విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతానని తేల్చిచెప్పారు.

విశాఖకు జై కొడితేనే పర్యటన

వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయనకు ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు. విశాఖకు జై కొడితేనే పర్యటనను సాగిస్తామని ఆందోళన కారులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆందోళన కారులు బాబుపై విమర్శలు గుప్పించారు. ‘అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు’ అంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబును కదలనిచ్చేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి సుమారు ఐదుగంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. చివరికి స్థానికులు ఆందోళన విరమించకపోవడంతో ఐదుగంటల హైడ్రామా అనంతరం చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లారు. మొత్తానికి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపించి విజయం సాధించామని స్థానికులు చర్చించుకున్నారు.

తూపాకులతో కాల్చి ఎన్‌కౌంటర్ చేయండి…

విశాఖలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తనను తూపాకులతో ఎన్‌కౌంటర్ చేసినా వెనక్కి తగ్గనని చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పర్యటనకు పర్మిషన్ తీసుకున్నప్పటికీ అడ్డుకుంటున్నారన్నారని, వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి మాపై కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లు వేశారని బాబు ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సిఎంగా పనిచేసిన నన్ను అడ్డుకున్నారంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

హైకోర్టులో పిటిషన్ : టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు అరెస్ట్‌పై హైకోర్టులో టిడిపి గురువారం మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మళ్లీ రద్దు చేయడంపై ఆ పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

వి‘శాఖ’ నుంచి హైదరాబాద్‌కు విశాఖ పర్యటనలో ఇటు టిడిపి వర్గాలు, అటు ఆందోళన కారుల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విఐపి లాంజ్ లో సుమారు అరగంటసేపు ఉన్న అనంతరం చంద్రబాబును విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా విశాఖ వెస్ట్ జోన్ ఎసిపి పేరుతో సెక్షన్ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా బాబును అరెస్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించడంతో పాటు అక్కడ విఐపి లాంజ్ లో ఉంచారు. అయితే బాబు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Chandrababu Naidu detained at Vizag Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News