Sunday, April 28, 2024

భావితరాలు పౌష్టికంగా ఉండాలనే అల్పాహారం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టామని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లో గల మునగ రామ్ మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విద్యార్థులతో కూర్చొని అల్పాహారం చేశారు. ఒక్కొక్క విద్యార్థిని ఏది కావాలో అడిగిన తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వానికి కెటిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణలో సుమారు 27 వేల స్కూళ్లలో 23 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.  తమిళనాడు రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ కల్పిస్తున్నారని, కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు తెలిపారు.

బంగారు తెలంగాణ దిశగా ఒక్కొక్క అడుగులోను విజయాలు సాధిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ముందుకు దూసుకుపోతున్న మరో కొత్త పథకానికి ముఖ్యమంత్రి  శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకొని రాష్ట్రంలో పాఠశాలకు వచ్చే విద్యార్థి కూడా పౌష్టికాహారం లోపం లేకుండా ఉండేందుకు అల్పాహార పథకం కు శ్రీకారం చుట్టారని చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలో 1314 పాఠశాలలో 2,38,808 మంది విద్యార్థిని విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

పిల్లల తల్లిదండ్రులు రోజు వారి కష్ట పడే కుటుంబాలు కావున ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తాను విద్యార్థులతో అల్పాహారం చేస్తున్న సందర్భంలో ఒక విద్యార్థిని అడుగగా మా తల్లిదండ్రులు టైలరింగ్ చేస్తున్నారని వివరించినట్లు మంత్రి తెలియజేశారు.  ఈ సందర్భంగా మంత్రి అల్పాహారంపై ఫీడ్ బ్యాక్ తెలియజేయాలని టీచర్లను విద్యార్థులను ఉద్దేశించి అడిగారు. అంతేకాక ఈ ప్రాంత ప్రజలు కూడా పరిశీలించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. ఫీడ్ బ్యాక్ ను బట్టి మరింత మెరుగైన అల్పాహార అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లా కలెక్టర్, డిఇఒ, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, జోనల్ కమిషనర్ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ కు మంత్రి కొన్ని సూచనలు చేశారు.

క్వాలిటీ ఎప్పటి కప్పుడు ర్యాండప్ చెకింగ్ చేసి నాణ్యత పట్ల దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ట్రస్ట్ నిర్వాహకురాలు లీల జోసెఫ్ ను కూడా అభినందించారు. ఉప్పల్ లో మన్న ట్రస్ట్ అధ్వర్యంలో రోజుకు 2 లక్షల భోజనాలు సరఫరా చేస్తున్న నేపథ్యంలో నాణ్యమైన ఫుడ్ అందించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. తదనంతరం కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కమిషనర్ స్నేహ షబరిష్ ల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, విద్యా శాఖ అధికారి రోహిణి, జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్, ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News