Wednesday, May 1, 2024

నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, “నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా”నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘తెలంగాణ దళితబంధు అమలుతీరు పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్కట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సిఎం మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకత అని అన్నారు.

రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించామని, గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకుందని సిఎం కెసిఆర్ తెలియజేశారు. బీ డీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్నామని, ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నామన్నారు.

ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నామని. తాను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని, తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేస్తామని, దళితబంధు గత సంవత్సరమే ప్రారంభం కావాలి కానీ కరోనా కారణం చేత ఆలస్యమైందన్నారు.

 ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, సిఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా
కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీంద్రసింగ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహేష్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News