Sunday, April 28, 2024

ఆర్థిక సంస్కరణలకు పెట్టింది పేరు పివి: ఎర్రబెల్లి

- Advertisement -
Economic reforms by PV
హన్మకొండ: దేశానికి ఎన్నో సేవలు అందించి, ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మహానీయుడు పివి నర్సింహారావు అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.  శుక్రవారం పి.వి స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగరలో పర్యటించిన మంత్రులు పి.వి.నర్సింహారావు స్మృతి వనంతోపాటు స్వాగత తోరణం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పి.వి. నర్సింహారావు విజ్ఞాన వేధిక, పి.వి. మెమోరియల్ మ్యూజియం నిర్మాణంతోపాటు వివిధ పనులను పరిశీలించడంతో పాటు పలు సూచనలు చేశారు. అనంతరం ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని 2115 మహిళా సంఘాలకు 24 కోట్ల 42 లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను, 45 కుటుంబాలకు 45 లక్షల 5వేల 220 రూపాయల విలువైన కళ్యాణలక్ష్మి, షాధీముభారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనలో భారతదేశం అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. పి.వి  జన్మతో వంగరతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థిక పురోభివృద్ధి చెందాలన్నదే మన ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని, అందులో భాగంగా ప్రతి మహిళకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహిళా సంఘాలు పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. అందుకు ప్రభుత్వం అర్థిక వనరులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని అన్నారు. మహిళలకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. వృద్దులకు, వికలాంగులకు ఆసరా పథకాన్ని అందించి బరోసా కల్పించిన ఘనత మన సియం కేసీఆర్ గారిదని అన్నారు.
 ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, వ్యవసాయానికి సాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు, త్రాగునీటి కోసం మిషన్ భగీరథ పథకంతో మహిళా సోదరిమణుల కష్టాలను తీర్చిన మహానీయుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. దేశంలో ఆదర్శ పాలనతోపాటు, తను ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలాలను ప్రజలకు అందించిన మహానీయుడి చివరి ఘడియల్లో జరిగిన వివక్షను ఈ ప్రాంత ప్రజలు మర్చిపోరని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. మన ప్రాంత బిడ్డ పి.వి.నర్సింహారావు జ్ఞాపకాలను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా పి.వి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన రంగాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో గుర్తించాలన్నారు. ప్రతి గుండెల్లో, ప్రతి ఇంట్లో కెసిఆర్ ఉన్నారని, ప్రజల బాగోగుల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చూసుకుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో పి.వి.శతజయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు కెశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, స్థానిక ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్, పి.వి కూతురు, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణి, పివి కుమారుడు పి.వి.ప్రభాకర్ రావు, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News