Sunday, April 28, 2024

పోడు సాగు అడవి బయటే

- Advertisement -
- Advertisement -
CM KCR announces action plan to settle Podu lands
నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే
అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం
పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి
కార్యాచరణ అటవీ పరిరక్షణ కమిటీల నియామకం పోడు సమస్యపై
దరఖాస్తుల స్వీకరణ కూడా 3వ వారం నుంచి మొదలుకావాలి పోడు
సమస్య కొలిక్కి వచ్చిన తర్వాత అడవి భూమి ఒక్క గజం కూడా
అన్యాక్రాంతం కావడాకి వీలులేదు అడవుల మీద అడవిబిడ్డలకు అమిత ప్రేమ
వుంటుంది జీవిక కోసం తేనె, బంక, కట్టెలు వంటి ఉత్పత్తులనే వారు
సేకరించి ఉపయోగించుకుంటారు : ప్రగతిభవన్ సమీక్షలో సిఎం కెసిఆర్
అడవి మధ్యలోని పోడు సాగుకు ప్రత్యామ్నాయంగా అడవి అంచున భూమి కేటాయిస్తాం, దానికి సర్టిఫికెట్ ఇచ్చి నీటి సౌకర్యం, కరెంట్ వంటి వసతులు కల్పిస్తాం, రైతుబంధు, రైతుబీమాను కూడా వర్తింపజేస్తాం, పోడు సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం, అవసరమైతే అన్ని పార్టీల నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాం
సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదన్నారు. దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు వెనువెంటనే చేపట్టాలని సిఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడుభూముల సమస్యలపై దరఖాస్తులను కూడా మూడవ వారం నుంచే స్వీకరించాలని సిఎం కెసిఆర్ సూచించారు. అలాగే నవంబర్ నెల నుంచి భూముల సర్వేను ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పోడు భూముల అంశంపై శనివారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారు చేయాలని సిఎం అధికారులను అదేశించారు. అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవి అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అలా తరలించిన వారికి సర్టిఫికేట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించి, రైతుబంధు రైతుబీమాను కూడా వర్తింపచేస్తామన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అవసరమైతే నేతలకు అటవీ భూములు అన్యాక్రాంతమైన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు.

నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు

మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకమన్నారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ కూడా మిగలదని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఈ చర్యల కారణంగా బయో డైవర్సిటీ కూడా బాగా పెరిగిందన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. హరిత నిధికి విశేష స్సందన వస్తున్నదన్నారు. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనపరచాలన్నారు. సమర్థవంతమైన అధికారులను నియమించాలని సూచించారు. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది.

అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటది

అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి మూడో వారం నుంచి తగు కార్యాచరణ ప్రారంచాల్సిందిగా సంబంధిత అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. అడవి బిడ్డలకు…అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుంది. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. అడవులకు హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనెతెట్టె, బంక, పొయిల కట్టెలు తదితర అటవీ ఉత్పత్తుల కోసం మాత్ర మే వారు అడవులను ఉపయోగించుకుంటారని అన్నా రు. ప్రభుత్వం వారి జీవన హక్కును కాపాడుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అటవీ సంపదను నరికి, దుర్వినియోగం చేసేవారితోనేనని ఆయన వ్యాఖ్యానించారు. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వమన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీభూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తుందన్నారు. ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లే కుండా చూసుకోవడం అటవీశాఖ అధికారులదే బాధ్యత అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. “నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్ సైడ్ ఇస్ వోన్లీ ఫారెస్ట్‌” ( అడవి తప్ప, లోపల ఎవరూ ఉండడానికి వీల్లేదు) అని సిఎం అన్నారు.

పోడు దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించాలని, దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. శాససనభ్యుల సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు అటవీ భూముల రక్షణలో కీలకంగా పనిచేయాలన్నారు.

వచ్చే నెల నుంచి సర్వే

నవంబర్ నెల నుంచి అటవీ భూముల సర్వేను ప్రారంభించనున్నట్టు సిఎం తెలిపారు. కోఆర్డినేట్స్ ద్వారా ప్రభు త్వ అటవీభూముల సరిహద్దులను గుర్తించాలన్నారు. అవసరమైన మేరకు కందకాలు తొవ్వడం, ఫెన్సింగ్ తదితర పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు. కావాల్సిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభు త్వం కేటాయిస్తుందన్నారు. పకడ్బందీ చర్యల కోసం అ వసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ అందిస్తామని తెలిపారు. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుం డా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఆసీఫాబాద్ శాసనసభ్యుడు ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ శోభ, ఆర్‌ఎం డోబ్రియాల్, స్వర్గం శ్రీనివాస్, హైదరాబాద్ సర్కిల్ సిసిఎఫ్ అక్బర్, సిసిఎఫ్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరక్టర్ రాజా రావు, టిఎస్ టిఎస్ ఎండి వెంకటేశ్వర్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News