Sunday, April 28, 2024

జాతీయ అవార్డు విజేతలకు సిఎం కెసిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ అవార్డులు దక్కించుకన్న తెలుగు సినీ ప్రముఖలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో ఈసారి తెలుగు కళాకారులు సత్తాచాటారని సిఎం అన్నారు. తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల శుభసూచకమని కెసిఆర్ అన్నారు. విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటనద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 69 ఏండ్ల కాలంలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడుగా అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు.

కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తన నటనా ప్రతిభతో మొట్ట మొదటి జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర నటుడుకావడం., తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.నాటితరం గొప్పనటుడు అల్లు రామలింగయ్య వారసుడుగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్పూర్తితో నేటితరం నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సిఎం ప్రశంసించారు.అలాగే తన సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి జాతీయ అవార్డు దక్కడం సంతోషకరమన్నారు.ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులు తో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు,సాంకేతిక సిబ్బందికి సిఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.తెలుగు చలన చిత్ర రంగం హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమని సిఎం అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణమని సిఎం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో హైద్రాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా భారతీయ సినిమాతో పోటీపడుతుండడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సిఎం ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News