Tuesday, May 7, 2024

నిల్వ సామర్థ్యం 40లక్షల మెట్రిక్ టన్నులు

- Advertisement -
- Advertisement -

Godowns

 

రూ. 2,500కోట్లతో గోడౌన్ల నిర్మాణం, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు రెడీ, త్వరలో సిఎంకు అందజేత

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోడౌన్‌లను అన్ని జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ను సిద్ధం చేసింది. వీటి నిర్మాణానికి గతం లో మాదిరి నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం రూ. 2 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారు లు అంచనా వేసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గోడౌన్‌ల నిర్మాణంపై త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు డిపిఆర్‌ను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సమర్పించనుంది. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి.

రాష్ట్రం ఏర్పడిన తరువాత 364 గోదాములు నిర్మించింది. ఇందుకోసం రూ.1100 కోట్ల వరకు నాబార్డు నుంచి రుణం తీసుకుంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో గోదాముల్లో నిల్వ సామర్థ్యం దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటం, ప్రధానంగా కాళేశ్వరం జలాలు పంట పొలాలకు చేరుతుండటంతో రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరుగుతోంది. ఈసారి యాసంగిలోనే 40 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదైంది. దాదాపు కోటి లక్షల టన్నులకు పైగా ధాన్యం వస్తోంది. ఇక రానున్న వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉంది.

ఈ లెక్కన వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణలో ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించడం, నిల్వ చేయడం, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పనితో కూడుకున్నది. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే గోదాముల్లో నిల్వ సామర్థం పెరగాల్సిందేనని ఇప్పటికే సిఎం స్పష్టం చేశారు.

ఎక్కడా… ఎవరికీ ఇబ్బంది రాకూడదనే
ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేస్తోంది. అయితే అంత మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థం లేకపోవడంతో పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో మరింత దారుణంగా తయారవుతుందని, అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సాగు పెరిగితే ఎరువులు, విత్తనాలు కూడా పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. వీటి నిల్వకు కూడా స్థల కొరత వేధిస్తోంది.

ప్యాక్స్‌లలో తగినంత సామర్థం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు కూడా నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి, అవి నిండిన తరువాతనే ప్రభుత్వ గోదాములను నింపేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాముల్లో నిండిన తర్వాతనే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపుతున్నారు. దీంతో గడిచిన రెండు సంవత్సరాలుగా వందశాతం ఆక్యుపెన్సీ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన విషయం తెలిసిందే.

 

CM KCR order to Construction of Godowns
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News