Sunday, April 28, 2024

భగవత్ ఉద్బోధ

- Advertisement -
- Advertisement -

Mohan bhagwat

 

ఎడారిలో వాన చినుకులా, బొత్తిగా ఎదురు చూడని వైపు నుంచి అమృత బిందువు వంటి ఒక మంచి పలుకు కరోనాను మించిన మహమ్మారిలా దేశంలో వ్యాపించి జాతి సమైక్యతను బలి తీసుకుంటున్న విద్వేష ప్రచారం మీద పదునైన కత్తి వేటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ నుంచి అత్యంత ఆలస్యంగానైనా వెలువడిన ఈ ప్రకటనను మనసారా స్వాగతించకుండా ఉండలేము. కొద్ది మంది చేసే పనులకు మొత్తం ఆ వర్గాన్నే, ఆ మతస్థులనే లక్షం చేసుకోరాదని భగవత్ ఆదివారం నాడు యూ ట్యూబ్‌లో చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్బోధించారు. జాతి ఎదుర్కొంటున్న ఈ ఆపత్కాలంలో ఇది ఎంతైనా ఆహ్వానించదగినది. దేశ దేశాలన్నీ ఒక్క కరోనాతోనే సతమతమవుతుండగా భారతదేశం అదనంగా మత వైషమ్య విద్వేష దుష్ప్రచారమనే వైరస్ దాడికి కకావికలవుతున్నది. ఈ దుర్మార్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శక్తులకు దిశా నిర్దేశం చేసే స్థానంలో గల అసమాన వ్యక్తి నుంచి ఈ మాటలు వెలువడడం హర్షించవలసిన అంశం. ‘కరోనా నేపథ్యం మన పాత్ర’ అనే శీర్షికతో భగవత్ ప్రసంగం 40 నిమిషాల పాటు సాగింది.

ఈ ప్రసంగ సందర్భం ఇటీవల మహారాష్ట్రలోని పాల్‌ఘడ్‌లో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్ మూక హత్యకు గురైన దారుణ ఘటన. దేశ ప్రజలు వివిధ మత వర్గాలుగా కాకుండా ఒక బాధ్యత గల జాతిగా వ్యవహరించాలని భగవత్ చేసిన విజ్ఞప్తిలో సమున్నత సందేశం ఇమిడి ఉంది. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఒక తల్లి బిడ్డలు, ఒక జాతి అనే సద్భావన కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ పాలకుల్లో గనుక ఉండి ఉంటే కరోనా విపత్తు ముంచుకు రాక ముందు వరకు దేశాన్ని అట్టుడికించిన పౌరసత్వ సవరణ చట్ట (సిఎఎ) వ్యతిరేక ఆందోళనలు తల ఎత్తి ఉండేవి కావు. రాజ్యాంగ విరుద్ధమైన ఆ సవరణే చోటు చేసుకునేది కాదు. భగవత్ ఇప్పుడు చెప్పినట్టు ఈ దేశ ప్రజలు ఒక బాధ్యత గల జాతిగా నడచుకోవలసిన సమయమిది. ఒక గుంపు చేసే పనిని దాని మతానికో, వర్గానికో ఆపాదించి స్పందించడం ఎంత మాత్రం సమంజసం కాదు. పాల్‌ఘడ్ ఘటనలో దారుణ మూక హత్యా దురాగతానికి బలి అయింది సాధువులు కాబట్టి అందుకు పాల్పడిన వారు ముస్లింలయి ఉంటారంటూ మతపరమైన రంగు పులమడానికి కొన్ని శక్తులు ప్రయత్నించాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ మంత్రి ఈ కేసులో అరెస్టు అయిన 101 మంది పేర్లను విడుదల చేశారు. అందులో ముస్లిం ఒక్కరూ లేరనే విషయాన్ని బయట పెట్టి సామాజిక కల్లోలం తలెత్తకుండా, విద్రోహుల కుట్ర పారకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సందర్భంగా భగవత్ వెలిబుచ్చిన మరో అభిప్రాయమూ గమనించదగినది. సాధువుల హత్యలపై అర్థంపర్థం లేని ప్రచారాలను నమ్మవద్దని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు, అధికారం ఎవరికీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన నుంచి ఉత్పన్నమైన ఆగ్రహాన్ని కొందరు జాతిని విడదీయడానికి ఉపయోగించుకోవచ్చు, దానిని జరగనివ్వరాదు అని కూడా ఆయన నొక్కి పలికారు. కరోనా సవాలును ఎదుర్కోడంలో అందరం ఒక్క మాట మీద, ఒక్క తాటి పైన ఉండాలని ఎటువంటి వివక్ష చూపకుండా అందరికీ సేవలందించాలని భగవత్ స్పష్టంగా సూచించారు.

అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన వారే అని అన్నారు. క్వారంటైన్‌కు పంపుతారనే భయంతో కరోనా సోకిన విషయాన్ని కొంత మంది బయటపెట్టకపోవచ్చని, ప్రభుత్వం తమ సభలను, సమావేశాలను రద్దు చేస్తుందనే అనుమానంతో మరి కొందరు అలా చేయవచ్చని కొద్ది మంది ధోరణిని ఆ మతం వారందరికీ వర్తింప చేసి ఆ మొత్తం ప్రజల మీద దాడికి, దుష్ప్రచారానికి దిగడం తగని భగవత్ వెలిబుచ్చిన అభిప్రాయం శిరసావహించదగినది. నిర్వాహకుల పొరపాటు వల్లనో, నిబంధనలు సకాలంలో అమలు చేయడంలో పాలకుల వైఫల్యం వల్లనో కరోనా వ్యాప్తికి ఢిల్లీ తబ్లిఘీ సన్నివేశం కొంత వరకు దోహదం చేసిన మాట వాస్తవం. దానిని సాకుగా తీసుకొని దేశమంతటా గల ముస్లిం మతస్థులను బోనెక్కించి వారిపై సాగించిన దాడులు, దుష్ప్రచారం మానవ నాగరకతకు, సంస్కారానికే చెప్పనలవికాని కళంకం తెచ్చాయి.

ఢిల్లీ నగర శివార్లలోని హరేవాలీ అనే గ్రామానికి చెందిన మహబూబ్ అలీని కరోనా జిహాదిస్టు అంటూ నిందించి హిందూ మూకలు ఈ నెల మొదటి వారంలో చిత్రహింసలకు గురి చేశారు. దగ్గరలోని గుడికి తీసుకు వెళ్లి ముస్లిం మతాన్ని విడిచిపెట్టాలని ఒత్తిడి తెచ్చారు. సీనియర్ బిజెపి నాయకులే తబ్లిఘీ ముస్లింలను తాలిబన్లని నిందించారు. మానవ బాంబులన్నారు. ముస్లింల వద్ద నుంచి పండ్లు, తదితరాలు కొనవద్దని ప్రచారం చేశారు. తబ్లిఘీలు డాక్టర్లపై ఉమ్ముతున్నారని కపిల్ మిశ్రా వంటి బిజెపి నాయకులు ట్విట్టర్ సందేశాల్లో పేర్కొన్నారు. ఇంతటి చెప్పనలవికాని విద్వేష ప్రచారం సాగిపోయింది. జాతిని మత ప్రాతిపదిక మీద మరోసారి విభజించే దుస్సాహసం జరిగిపోయింది. దీనికి మీడియాను కూడా వేదికగా చేసుకున్నారు. మోహన్ భగవత్ మాటలు అప్పుడే వెలువడి ఉంటే ఇవి కొంతవరకైనా తగ్గి ఉండేవి. ఇప్పటికైనా ఆణిముత్యాల వంటి పలుకులు పలికినందుకు ఆయనను అభినందించాలి.

 

Mohan bhagwat speech about Maharashtra incident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News