Sunday, May 12, 2024

రెపరెపలాడిన గులాబీజెండా

- Advertisement -
- Advertisement -

CM KCR

 

పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్
సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ జెండాను ఎగరవేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, పాల్గొన్న నాయకులంతా సామాజిక దూరం పాటించారు. సోమవారం ఉదయం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్ మొదట తెలంగాణ తల్లికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్ పార్టీసిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సహచర మంత్రులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. ఎంతో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, కర్నెప్రభాకర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, కె.కేశవ రావు,మాజీ స్పీకర్ సిరికొండ మధుసుధనాచారి, శాసనసభ్యుడు దానం నాగేందర్, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని ఉద్యమాలుచేసి గమ్యాన్ని చేరకున్న టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సం ప్రతి కార్యకర్తకు పండుగ రోజు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్, టిడిపి అవమానించినప్పటికీ రాష్ట్ర సాధనేలక్షంగా కెసిఆర్ ముందుకు వెళ్లి సాధించారని చెప్పారు. 14 ఏళ్లు పోరాటం చేసి సాధించిన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఏ బాల్క సుమన్ మాట్లాతూ నాడు హేళన చేసిన వారంతా ఈ నాడు అభిమానిస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి దేశానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శనీయంగా మారుతుందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సాధించిన తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తో తెలంగాణ అతిపెద్ద ధాన్యాగారంగా మారుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా అమలు చేసి చూపుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికి ఆదర్శం అవుతుందనే ఆనందం వ్యక్తం చేశారు.

నిరాడంబరంగా ఆవిర్భావ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్షంగా ఆవిర్భవించి గమ్యాన్ని చేరకున్న టిఆర్‌ఎస్ 20ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నాయకులు భౌతికదూరం పాటిస్తూ పార్టీ జెండా ఎగరవేశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో లక్షలాది మంది కార్యకర్తలు తమ ఇళ్లపై గులాబీజెండాలు ఎగరవేసి పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ పై అభిమానం తమ గుండెల నిండా ఉందని చాటారు.

CM KCR Flag hoisted at party office
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News