Wednesday, May 1, 2024

మిడతల దండు తెలంగాణలోకి రావొద్దు: సిఎ: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

cm-kcr

మన తెలంగాణ/హైదరాబాద్: మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు.

మిడతల దండు తెలంగాణవైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై సిఎం కెసిఆర్ కూలంకషంగా చర్చించారు. రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్‌ఘడ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని తేల్చారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

CM KCR Review on locust swarms at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News