Thursday, May 2, 2024

తెలంగాణ ఘనకీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

జూన్ 2నుంచి 21రోజుల పాటు ఉత్సవాలు అంబేద్కర్ సచివాలయంలో తొలిరోజు వేడుకలు ప్రారంభం 
అదేరోజు జిల్లా కేంద్రాల్లోనూ ఆరంభం 
అన్నిరంగాల్లో అద్భుత ఫలితాలు సాధించాం, పేరుకు తొమ్మిదేళ్లయినా దాదాపు మూడేండ్లు వృథా
కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది
ఉత్సవాల నిర్వహణపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో…తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను.. అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ ఉత్సవాలు.. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిఎం స్పష్టం చేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు, రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సిఎం తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాల ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్ర మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు.
ఈ మేరకు…తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం నాడు రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి సమావేశమందిరంలో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహదారులు రమణాచారి, అనురాగ్ శర్మ, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్ శర్మ, సింగరేణి కాలరీస్ సిఎండి శ్రీధర్, ఫైనాన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ఎస్సీడిడి రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎమ్. రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ హన్మంతరావు, మత్య్సశాఖ డైరెక్టర్ లచ్చిరామ్ బుక్యా, అనిమల్ హజ్బండరీ శాఖ డైరెక్టర్ రామచందర్, విజయ డైరీ మార్కెటింగ్ డైరెక్టర్ మల్లికార్జున్, సెక్రటరీ టి.కె.శ్రీదేవి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శేషాద్రీ, ప్రొటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ ఎస్‌ఎఎమ్ రిజ్వీ, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితెందర్, హ్యాండ్లూమ్స్ శాఖ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సిడిఎమ్‌ఎ సత్యనారాయణ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఇవి నర్సింహరెడ్థి, బిసి వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిష్టినా జడ్ చోంగ్తూ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతీ హోలికేరి, సాంసృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ట, ముషారఫ్ అలీతో పాటు ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని అన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని పేర్కొన్నారు.

తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారింది
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సుగల రాష్ట్రమని, అయినా కూడా…ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. నేడు తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారిందని, మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారని, వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నామని సిఎం తెలిపారు. అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి వుంటుందని సిఎం చెప్పారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని..తెలంగాణలో అదే జరుగుతున్నదని సిఎం స్పష్టం చేశారు.

కేంద్రానికి దూరదృష్టి కొరవడింది
కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం,దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సిఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని వున్నదనడానికి తొమ్మిదేండ్ల అనతికాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. పేరుకు తొమ్మిదేండ్లు అయినా, మొదటి సంవత్సరంతో పాటు మరో కరోనా కాలపు రెండేండ్లు దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, వ్యవసాయం విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, పల్లెలు పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతి, తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక ఐటి అభివృద్ధి, సింగరేణి, ప్రతి ఒక్క రంగంలో తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన ప్రగతి గురించి సిఎం కెసిఆర్ అధికారులకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ..రోజువారీ కార్యక్రమాల వివరాలు:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను మొత్తం 21 రోజుల పాటు నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగే మొదటి రోజు కార్యక్రమాలను డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్‌వోడిలు ఉద్యోగులందరూ హాజరవుతారు.

ఒకరోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డే
అమర వీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా…మార్టియర్స్ డేగా జరుకోవాలి.అమరుల స్మారక దినం సందర్భంగా…రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి విద్యుత్తు దీపాలతో వెలిగించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలి. జాయతీ జండాను ఎగరవేసి వందన సమర్పణ చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి.

20 రోజులపాటు ఆయా శాఖలు సాధించిన ప్రగతి డాక్యుమెంట్ల ప్రదర్శన
మరో ఇరవై రోజుల పాటు వరుసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంటు రూపంలో ప్రదర్శించాలి. వ్యవసాయం విద్యుత్తు.. ఇట్లా ప్రతివొక్కశాఖ గురించిన డాక్యుమెంటరీని, ఆయా శాఖలకు కేటాయించబడిన రోజున, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తారు. ప్రతి శాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని కూలంకశంగా రికార్డు చేస్తూ అన్ని శాఖలకు శాఖల వారీగా ఒక్కో డాక్యుమెంటును రూపొందించి ప్రదర్శించాలి.
ఆయా శాఖలు దేశానికే అదర్శంగా సాధించిన ప్రగతిని, ఈ ప్రగతి సాధించడానికి వెనక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని దార్శనికతను, దృక్పథాన్ని, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంటును రూపొందించి, సినిమాహాల్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.

విద్యుత్తు శాఖకు కేటాయించిన రోజును పవర్ డేగా పరిగణిస్తూ…ఆ రోజు విద్యుత్తుశాఖ సాధించిన విజయాల గురించి డాక్యుమెంటరీ ప్రదర్శన, తదితర సమాచారంతో ఆ రోజంతా విద్యుత్తు డేగా జరుపుకుంటారు.ఉదాహరణకు… తాగునీరు సాగునీరుకు సంబంధించి, మొత్తంగా ఒకరోజును …వాటర్ డేగా నిర్వహించాలి. రాష్ట్రంలో సాగునీరు తాగునీరు, జలాభివృద్ధి జరిగిన తీరు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ దృక్పథం దార్శనికత..ఎంత కష్ట పడితే వొకనాడు తాగునీటికి తల్లడిల్లిన తెలంగాణలో నేడు అడుగడుగునా జలధారలు పరవళ్లు తొక్కుతున్నాయనే అంశాల గురించిన అవగాహన పై ఒక రోజును కేటాయించాలి.

ఒక్కో శాఖకు ఒక్కోరోజును కేటాయింపు
రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రకాల అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించిన వెల్పేర్ డేను ప్రత్యేకంగా ఒక రోజు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా.. దళితబంధు అమలు, 125 అడుగుల డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం దగ్గర నుంచి ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ, మహిళా సహా పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యాచరణను గురించిన సమాచారాన్ని పలు మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిపేలా కార్యక్రమాలు ఉండాలి. ఇట్లా… అగ్రికలర్చర్ డే, పల్లె ..పట్టణాభివృద్ధి దినం…రూరల్ అండ్ అర్భన్ డెవలప్ మెంట్ డే….రెవిన్యూ డే, పరిపాలనా సంస్కరణలు, పోలీసు సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపే దిశగా వుమెన్ డే, ఇండస్ట్రీస్ ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టీజాన్స్ డే (వృత్తిపనులు), గ్రీన్ డే, హాండ్లూమ్ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృధ్ధి, ఇట్లా ఒక్కో శాఖకు ఒక్కోరోజును కేటాయించి..దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలుంటాయి.

తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీలు
స్వతంత్ర భారతంలో, తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన.. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే..డాక్యుమెంటరీని రూపొందించాలి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన, ప్రభుత్వ పాలన ప్రారంభమైన.. 2 జూన్ 2014 నుంచి నుంచి 2023 జూన్ 2 దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన, అది సాధించిన ప్రగతిని గురించిన మరో డాక్యుమెంటరీని రూపొందించాలి.

21 రోజుల పాటు..తెలంగాణ సంబురాలు నిర్వహించాలి. ఈ సందర్భంగా… పిండి వంటలు ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపద తదితర సంగీత విభావరి, సినిమా జానపద తదితర కళాకారలతో ప్రదర్శనలు..వంటి, సంగీత నృత్యం జానపదం సాంసృతక కార్యక్రమాలను నిర్వహించాలి.గోల్కొండ కోట. భువనగిరి కోట వంటి జిల్లాల వ్యాప్తంగా వున్న చారిత్రక కట్టడాలను, ప్రముఖ రామప్ప సహా రాష్ట్ర వ్యాప్తంగా వున్న దేవాలయాలను సుందరీకరణ చేపట్టి విద్యుత్తు కాంతులతో అలంకరించాలి. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలి. తమ తమ ఉద్యోగ విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు అందజేయాలి.

రాష్ట్ర సాంసృతిక శాఖ, సాంసృతిక సారథి ఆధ్వర్యంలో ఐదారు వేల మంది కళాకారులతో హైదరాబాద్‌లో సాంసృతక కార్యక్రమాలు ధూం ధాం ర్యాలీ నిర్వహిస్తారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవ శోభ ప్రస్పుటించేలా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా ఉత్సవాలను నిర్వహించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలోని ఉత్సవాల కమిటీ.. ఇందుకు సంబంధించి పలుమార్లు సమావేశమవుతూ..ఉత్సవాల విధి విధానాలను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో మరింతగా చర్చిస్తూ..ఇంకా ఏవైనా చేర్చదగ్గ అంశాలు వుంటే జత చేసుకుని తుది రూపం ఇవ్వాలని సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News