Friday, April 19, 2024

దేశంలో రాబోయేది రైతు తుఫానే..

- Advertisement -
- Advertisement -

కాంధార్: దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతుందని, దాన్నెవరూ ఆపలేరని బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్‌ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో సిఎం కెసిఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు జన్మనిచ్చిన మరాఠా పుణ్యభూమికి ప్రాణమని తెలిపారు. పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వక స్వాగతమని ఆయన పేర్కొన్నారు.

లోహ సభకు తరలివచ్చిన ప్రజలు, రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాందేడ్ ప్రజల ప్రేమ కారణంగా ఇక్కడే రెండో సభ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారని, భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళతా, తెలంగాణలో రైతుబంధు, 24 గంటలు కరెంటు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
వీటిని అమలు చేయండి ?
తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణలో రైతులకు రూ.5లక్షల రైతుబీమా ఇస్తున్నాం. పూర్తిగా పంట కొంటున్నాం. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే తాను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు తాను వస్తూనే ఉంటానన్నారు. మహారాష్ట్రలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో దళితబంధు ఇస్తున్నామని, మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేస్తే తాను రానని కెసిఆర్ ప్రకటించారు.

అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదన్నారు. కాంగ్రెస్, బిజెపిలతో మన బతుకులు మారాయా?, రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? తాను చెప్పేది నిజమో అబద్ధమో మీరో ఆలోచించుకోవాలని కెసిఆర్ ప్రజలకు సూచించారు.
మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం..
అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బిజెపి 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టిఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మన కళ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారడం లేదు. నాయకులు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని, మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతామన్నారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయని, దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉందని, దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్‌ను సులభంగా ఇవ్వొచ్చన్నారు.

125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉందనీ, అయినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని కెసిఆర్ ప్రశ్నించారు. పిఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుందని, పిఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదనీ, బతుకులపై ఆలోచన సభ అని, యూపీ, పంజాబ్‌లో నాయకుల మాయమాటలకు అక్కడి ప్రజలు మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి
మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగుర వేయాలని బిఆర్‌ఎస్ అధినేత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్ట్రర్ చేయించామని ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల్లో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరించి చూపిస్తానని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని, తమ ప్రాంతంలో సభ పెట్టాలని అనేకమంది కోరుతున్నారని తర్వాత షోలాపూర్‌లో సభ పెట్టనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు
మేం నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారని, బిఆర్‌ఎస్ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా? ఫసల్ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా? బిఆర్‌ఎస్‌ను గెలిపించండి, రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కెసిఆర్ హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మీ నుంచే నాయకున్ని ఎన్నుకుంటే మార్పు వస్తుందన్నారు. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఒక్క ఝలక్ ఇవ్వండి, మొత్తం మారిపోతుందని కెసిఆర్ తెలిపారు. 24 గంటలు పని చేసే నాందేడ్ ఎయిర్‌పోర్టును పగటికే పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. దేశం ముందుకు వెళ్తోందా..? వెనక్కి వెళ్తోందా? అనేక మంది ఉద్యమకారుల జన్మభూమి మహారాష్ట్ర అని, మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదనీ, ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో సాగు, తాగునీరు అందుబాటులో లేదు
కృష్ణా, గోదావరి నదులు మహారాష్ట్రలోనే పుట్టాయని, కానీ, మహారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్ల అందుబాటులో లేదని ఆయన వాపోయారు. అవసరానికి మించి నీళ్లున్నా సాగుకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన హామీనిచ్చారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ మహారాష్ట్ర కంటే దారుణంగా ఉండేదని, ప్రస్తుతం తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధ్యమయ్యిందని, మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదన్నారు. ఈ 9 ఏళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను అభివృద్ధి చేసి చూపామని కెసిఆర్ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో మీ నుంచే నాయకుడిని ఎన్నుకుందాం
కొందరు నాయకులు మైకులు పగిలేలా ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మనం కళ్లు తిరిగి పడిపోవాల్సిందేనని కెసిఆర్ విమర్శించారు. మీరు గెలిపించి పంపిన ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎక్కడ నిద్రపోతున్నారు. రైతులు, కూలీలు, దళితులు ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు, వచ్చే ఎన్నికల్లో మీ నుంచే నాయకుడిని ఎన్నుకుంటే మార్పు వస్తుందని కెసిఆర్ పేర్కొన్నారు. రైతులు ఐక్యంగా పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందని, తాను ఒక్కసారి నాందేడ్ వచ్చి వెళ్తే మహారాష్ట్రలో రైతులకు బడ్జెట్లో నిధులు పెంచారని, మహారాష్ట్రలో రైతుబంధు పథకం అమలు చేసే వరకు కొట్లాడుదాం, వరి, గోధుమలు, చెరుకు పంటలకు మద్ధతు ధర కోసం ప్రతి ఏడాది కొట్లాడాల్సిందేనా..? మహారాష్ట్రలో రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటానని కెసిఆర్ స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేకు గులాబీ కండువా
ఈ సభకు నాందేడ్ జిల్లా నలు మూలల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. లోహాకు వచ్చే దారులన్నీ రైతులు, ప్రజలతో కిక్కిరిసిపోయాయి. నాందేడ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కెసిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేకు ముఖ్యమంత్రి కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌రావు కదం, హర్షవర్ధన్ జాధవ్, సురేశ్ గైక్వాడ్, యశ్పాల్ బింగే, నాగ్నాథ్ గిస్సేవాడ్, మాజీ ఎమ్మెల్యే మనోహర్ పట్వారీ, ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు దగ్దా పవార్, ఛత్రపతి శివాజీ మరాఠా నవయువక్ మండల్ ప్రెసిడెంట్ మదన్ జాధవ్, స్పోర్ట్ కన్వీనర్ దిలీప్ కుమార్ జగ్టప్, సతీశ్ నల్గే, సతీశ్ షిండే, ప్రహ్లాద్ రాకోండే, వార్దా మాజీ ఎమ్మెల్యే వసంతరావు బోండే, ఎన్సీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివరాజ్ దోండ్గే, లక్ష్మణ్‌రావు వోంగేతోపాటు నాందేడ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, జెడ్పీటిసిలు, సీనియర్ రాజకీయ నాయకులు బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
అంబేద్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాల
సభా వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహాలకు సిఎం కెసిఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బిఆర్‌ఎస్, కెసిఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. సభా వేదికపై నుంచి ప్రజలకు కెసిఆర్ అభివాదం చేశారు.
15 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణం
లోహా పట్టణంలోని బైల్ బజార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. స్టేజీతోపాటు దాదాపు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డేరాలతో పాటు వేసవి నేపథ్యంలో సభీకుల కోసం కూలర్లను అమర్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
సంక్షేమ పథకాలు డాక్యుమెంటరీల ద్వారా….
లోహా పట్టణంలోని బైల్ బజార్లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ సభా ప్రాంగణం రైతులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం వినేందుకు మరాఠాలు ఆసక్తి చూపారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయం అయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంక్షేమ పథకాలను మరాఠా వీడియో డాక్యుమెంటరీల ద్వారా సభ నిర్వాహకులు ప్రదర్శించారు.
నాందేడ్ ఎయిర్‌పోర్టు నుంచి….
బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌లోని శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కంధార్ లోహాకు చేరుకున్నారు. లోహాలోని ఓ బిఆర్‌ఎస్ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి కెసిఆర్ ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి కెసిఆర్ చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News